Salaar Day 14 Collections: సలార్‌కు స్టడీగా కలెక్షన్లు: 14 రోజుల్లో ఎన్ని కోట్లంటే!
Salaar Day 14 Collections: సలార్ సినిమాకు కలెక్షన్లు నిలకడగా కొనసాగుతున్నాయి. రెండు వారాల్లో ఈ చిత్రం ఎన్ని కోట్ల వసూళ్లను రాబట్టిందంటే..
Salaar Day 14 Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘సలార్: పార్ట్1 - సీజ్‍ఫైర్’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. డిసెంబర్ 22న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. ప్రస్తుతం రెండు వారాలు ముగుస్తుండటంతో నిలకడగా వసూళ్లను రాబడుతోంది. సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా.. ప్రభాస్‍తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం 14 రోజుల్లో ఎంత కలెక్షన్లను రాబట్టిందంటే..
సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల్లో రూ.659.69 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. ఇప్పటికే తన మూవీ బాహుబలి-1 లైఫ్ టైమ్ కలెక్షన్లను (రూ.650) ఈ చిత్రంతో ప్రభాస్ దాటేశాడు. అలాగే, మరిన్ని రికార్డులు సృష్టించాడు. అయితే, రెండు వారాలు ముగుస్తున్న తరుణంలో సలార్ వసూళ్లు నెమ్మదించాయి.
ఈ వీకెండ్‍లో సలార్ వసూళ్లు కాస్త పుంజుకునే అవకాశం ఉంది. అయితే, తర్వాతి వారం సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు వస్తుండటంతో సలార్ థియేట్రికల్ రన్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.700కోట్లు దాటే అవకాశం ఉంది. రూ.800కోట్ల మార్క్ కష్టంగానే కనిపిస్తోంది.
ఇండియాలో ఇలా..
సలార్ సినిమాకు ఇండియాలో ఇప్పటి వరకు రూ.378 కోట్ల నెట్ (రూ.446 కోట్ల గ్రాస్) కలెక్షన్లు వచ్చాయి. రూ.400కోట్ల నెట్ వసూళ్ల వైపుగా ఈ మూవీ సాగుతోంది. విదేశాల్లోనూ సలార్‌కు మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి.
సలార్ మూవీ హిందీ వెర్షన్ రూ.150కోట్ల నెట్ కలెక్షన్లను దాటేసింది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా పోటీలో ఉన్నా.. సలార్ మాత్రం దుమ్మురేపింది. హిందీలోనూ డంకీని మించిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో సలార్ దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు సుమారు రూ.220 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క నైజాం నుంచే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో బహుబలి 2 కలెక్షన్లను కూడా సలార్ దాటేసింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రెండోస్థానంలో నిలిచింది.
సలార్ చిత్రాన్ని యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. దేవాగా ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సులు ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచాయి. చాలా కాలం తర్వాత యాక్షన్ అవతార్‌లో డార్లింగ్‍ను చూసిన అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ చిత్రంలో దేవా స్నేహితుడు వరదరాజ మన్నార్‌గా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. ఖాన్సార్ సిటీ అధికారాన్ని చేజిక్కించుకోవడం చుట్టూ సలార్ కథ తిరుగుతుంది.
సలార్ చిత్రంలో శృతిహాసన్, జగపతి బాబు, బాబీ సింహా, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి, టినూ ఆనంద్ కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రానికి రవిబస్రూర్ సంగీతం అందించారు. కాగా, సలార్ సీజ్‍ఫైర్ చిత్రానికి సీక్వెల్‍గా పార్ట్ 2 ‘శౌర్యాంగపర్వం’ వస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2025లో ఈ సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది.