ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ భార్య సైరా బాను ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తనను ఏఆర్ రహమాన్ మాజీ భార్య అని పిలవొద్దని ఆమె కోరారు. తాము ఇంకా ఆఫీషియల్ గా విడాకులు తీసుకోలేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఏఆర్ రహమాన్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఆదివారం (మార్చి 16) డీహైడ్రేషన్ కు గురికావడంతో ఏఆర్ రహమాన్ ను చెన్నై ఆసుపత్రికి తరలించారు. రొటీన్ చెకప్ తర్వాత మ్యూజిక్ కంపోజర్ డిశ్చార్జ్ అయ్యాడని హాస్పిటల్ అప్డేట్ ఇచ్చింది.
తమ ఉమ్మడి న్యాయవాది వందనా షా ద్వారా సైరా బాను ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ‘‘ఆయన (ఏఆర్ రహమాన్) త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఛాతీలో నొప్పిగా ఉందని, యాంజియోప్లాస్టీ చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. దేవుడి దయ వల్ల ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. మేము అధికారికంగా విడాకులు తీసుకోలేదు. మేము ఇప్పటికీ భార్యాభర్తలం అని కూడా నేను చెప్పాలనుకుంటున్నా’’ అని సైరా బాను తెలిపారు.
‘‘గత కొన్నేళ్లుగా నా ఆరోగ్యం బాలేకపోవడం వల్ల మేము విడిగా ఉంటున్నాం. అతనిపై ఎలాంటి ఒత్తిడి పెట్టాలనుకోవడం లేదు. అతని మాజీ భార్య అని నన్ను పిలవొద్దని అందరినీ కోరుతున్నా’’ అని ఆమె పేర్కొన్నారు.
డీహైడ్రేషన్, మెడ నొప్పి కారణంగా ఏఆర్ రహమన్ ఇబ్బంది పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చేరినట్టు ఆయన టీమ్ చెప్పింది. లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే రహమాన్ ఇబ్బందిగా ఫీలయ్యారని తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉంటున్న ఆయనకు డీహైడ్రేషన్ అయిందని తెలుస్తోంది.
ఛాతినొప్పి కారణంగా ఏఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారని, వైద్యులు ఏంజియోగ్రామ్ నిర్వహించారని ముందుగా రూమర్లు బయటికి వచ్చాయి. అయితే, అది నిజం కాదని, డీహైడ్రేషన్ వల్ల కలిగి ఇబ్బందితోనే ఆయన ఆసుపత్రిలో చేరారని రహమాన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
ఏఆర్ రహమాన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని అధికారికంగా వెల్లడించింది అపోలో ఆసుపత్రి. డీహైడ్రేషన్ సమస్యలో ఆసుపత్రిలో చేరారని వెల్లడించింది. ఆరోగ్య పరీక్షల తర్వాత డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.
ఏఆర్ రెహమాన్, సైరా బాను 29 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత గత ఏడాది విడిపోతున్నట్లు ప్రకటించారు. ‘‘పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత సైరా, ఆమె భర్త ఏఆర్ రెహమాన్ విడిపోవాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారి బంధంలో గణనీయమైన మానసిక ఒత్తిడి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని లాయర్ వందనా పేర్కొన్నారు. 1995లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రహమాన్ హెల్త్ అప్డేట్ ను ఏఆర్ అమీన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకున్నారు. 'మా ప్రియమైన అభిమానులు, కుటుంబం, శ్రేయోభిలాషులందరికీ.. మీ ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు. డీహైడ్రేషన్ కారణంగా మా నాన్న కొంచెం బలహీనంగా అనిపించారు, అందువల్ల మేము వెళ్లి కొన్ని రొటీన్ పరీక్షలు చేయించాం. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు.’’ అని అమీన్ పేర్కొన్నాడు.
సంబంధిత కథనం