Saif Ali khan doctor: సైఫ్ అలీ ఖాన్ వెన్నులో కత్తి.. సర్జరీ చేశాం.. డాక్టర్ ఏం చెప్పాడంటే?
Saif Ali khan doctor: సైఫ్ అలీ ఖాన్ వెన్నులో కత్తి దిగినట్లు అతనికి చికిత్స చేసిన డాక్టర్ నితిన్ డాంగే వెల్లడించారు. గురువారం (జనవరి 16) తెల్లవారుఝామున ముంబైలోని బాంద్రా ఇంట్లో దొంగలు అతనిపై కత్తి దాడి చేసిన విషయం తెలిసిందే.
Saif Ali khan doctor: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని వెన్నులోకి 2.5 అంగుళాల కత్తిని దించినట్లు ముంబైలోని లీలావతి హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడి అతడు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతనికి ఇప్పటికే పలు సర్జరీలు జరిగాయి. కత్తి దాడి వల్ల సైఫ్ వెన్నులోని ఫ్లుయిడ్ లీకవుతోందని లీలావతి హాస్పిటల్ న్యూరోసర్జన్ నితిన్ డాంగే వెల్లడించారు.

సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏమన్నారంటే..
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన దొంగలు అతనిపై కత్తితో దాడి చేశారు. ఇందులో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే అతనికి చికిత్స జరుగుతోంది. సైఫ్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్ హెల్త్ అప్డేట్ ఇచ్చారు.
"మిస్టర్ సైఫ్ అలీ ఖాన్ ను లీలావతి హాస్పిటల్లో రాత్రి 2 గంటలకు అడ్మిట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్లు చెప్పారు. అతనికి థొరోసిక్ స్పైనల్ కార్డ్ లో తీవ్ర గాయాలయ్యాయి. అతని వెన్నుపై కత్తితో దాడి జరిగింది. కత్తిని తీసేయడానికి, స్పైనల్ ఫ్లుయిడ్ లీకేజీని ఆపడానికి ఎమర్జెన్సీ సర్జరీ చేశాం" అని డాక్టర్ నితిన్ పీటీఐతో చెప్పారు.
నిలకడగానే సైఫ్ ఆరోగ్యం
ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు నితిన్ తెలిపారు. "సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. కోలుకుంటున్నాడు. ప్రమాదం ఏమీ లేదు" అని చెప్పారు. సైఫ్ ను ఐసీయూలోకి షిఫ్ట్ చేసినట్లు లీలావతి హాస్పిటల్ సీఓఓ డాక్టర్ నీరజ్ ఉత్తమణి వెల్లడించారు.
సైఫ్ బాగానే కోలుకుంటున్నట్లు చెప్పారు. "సైఫ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. అతడు బాగానే కోలుకుంటున్నాడు. అందరు కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు" అని తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ కు మొత్తంగా ఆరు గాయాలయ్యాయని, అతనికి రెండు సర్జరీలు నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు.
అసలు ఏం జరిగిందంటే?
బంద్రాలో ఉన్న సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఇంటిలోకి గురువారం ఉదయం ఓ గుర్తుతెలియని ఆగంతకుడు చొరబడ్డాడు. దొంగ ఇంట్లోకి చొరబడిన విషయం గమనించిన సైఫ్ అలీఖాన్ అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో దొంగ.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో ఎటాక్ చేసినట్లు సమాచారం. ఉదయం రెండున్నర గంటల సమయంలో ఈ ఎటాక్ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎటాక్ జరిగిన సమయంలో కరీనా కపూర్, తైమూర్ మినహా మిగిలిన సైఫ్ అలీఖాన్ కుటుంబసభ్యులందరూ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.