Sai Pallavi: అందుకే నేషనల్ అవార్డు గెలవాలనుంది: ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సాయిపల్లవి
Sai Pallavi: తాను జాతీయ అవార్డు గెలువాలని అనుకుంటున్నట్టు సాయిపల్లవి చెప్పారు. తాను అలా ఎందుకు కోరుకుంటున్నారో ఓ ఇంట్రెస్టింగ్ కారణం చెప్పారు. ఆమె ఏమన్నారంటే..

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు రావాల్సిందని చాలా మంది నుంచి వినిపించే మాట. గార్గి సినిమాకు గాను గతేడాది ఉత్తమ జాతీయ నటిగా సాయిపల్లవికి పురస్కారం వస్తుందనే అంచనాలు బలంగా వినిపించాయి. అయితే, తిరుచిత్రాబలం మూవీకి గాను నిత్యా మీనన్‌కు ఆ అవార్డు దక్కింది. అయితే, తనకు నేషనల్ అవార్డు గెలువాలని ఉందని, అందుకు ఓ కారణం ఉందని సాయిపల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అమ్మమ్మ చీర ధరించాలని..
అమ్మమ్మ తనకు బహుమతిగా ఇచ్చిన చీర ధరించేందుకు జాతీయ అవార్డు గెలువాలని తాను కోరుకుంటున్నానని గలాటా ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి వెల్లడించారు. “నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మమ్మ నాకు ఓ చీరను ఇచ్చారు. నా పెళ్ళికి దీన్ని ధరించాలని చెప్పారు. ఆ సమయంలో ఆమె చాలా అనారోగ్యంతో ఉన్నారు. ఆపరేషన్ చేయించుకున్నారు” అని సాయిపల్లవి తెలిపారు.
పెళ్లి ఇప్పుడే కాదని తాను అనుకున్నానని, అప్పటికి తాను మొదటి చిత్రం చేయలేదని తెలిపారు. 24ఏళ్ల వయసులో తాను ప్రేమమ్ సినిమా చేశానని గుర్తు చేసుకున్నారు.
ఏదో రోజు అవార్డు గెలుస్తానని..
అమ్మమ్మ పెళ్లి కోసం ఇచ్చిన ఆ చీరను.. ఏదో ఒక రోజు పెద్ద అవార్డు గెలిచినప్పుడు ధరించాలని తాను నిర్ణయించుకున్నానని సాయిపల్లవి చెప్పారు. అందుకే జాతీయ అవార్డు గెలువాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. “ఏదో ఒకరోజు నేను అవార్డును గెలుచుకుంటానని అనుకున్నా. నేషనల్ అవార్డునే పెద్ద అవార్డుగా భావిస్తున్నా. కాబట్టి, నాకు నేషనల్ అవార్డుకు ఆ చీరతో సంబంధం ఉంది” అని సాయిపల్లవి తెలిపారు.
జాతీయ అవార్డు రావాలని తాను ఆశిస్తున్నా.. కానీ ఆ ఒత్తిడి తనకు లేదని సాయిపల్లవి అన్నారు. ప్రేక్షకులు తన పాత్రను అనుభూతి చెందితే చాలని, అదే తన పని అనుకుంటానని అన్నారు. అది కాకుండా వచ్చేది ఏదైనా తనకు బోనస్ లాంటిదేనని తెలిపారు.
సాయిపల్లవి నటించిన అమరన్ చిత్రం గతేడాది బ్లాక్‌బస్టర్ అయింది. శివ కార్తికేయన్ సరసన ఆ మూవీలో పల్లవి నటించారు. ఇందు రెబ్బా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి తన నటనతో మెప్పించారు. మరోసారి ప్రశంసలు అందుకున్నారు. నాగచైతన్యతో కలిసి సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలైంది. ఈ చిత్రం కూడా రూ.100కోట్లను దాటి సూపర్ హిట్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో సీతాదేవి పాత్ర చేస్తున్నారు పల్లవి. ఏక్ దిన్ మూవీ కూడా ఆమె లైనప్‌లో ఉంది.
సంబంధిత కథనం