Sai Pallavi: రియల్ లైఫ్ క్యారెక్టర్‌లో సాయి పల్లవి.. ఆహ్లాదకరంగా కమల్ హాసన్ అమరన్ ఫస్ట్ లుక్ (వీడియో)
Sai Pallavi As Indhu Rebecca Varghese In Amaran First Look: రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. కమల్ హాసన్ నిర్మిస్తోన్న అమరన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ముకుంద్ పాత్రలో హీరో శివ కార్తికేయన్ నటించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే!
Sai Pallavi Amaran First Look Released: మళ్లీ సినిమాలతో బిజీగా ఉంది సాయి పల్లవి. నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తోన్న సాయి పల్లవి నటించిన మరో చిత్రం అమరన్. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన 'అమరన్'కు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
రియల్ లైఫ్ క్యారెక్టర్స్
అమరన్ చిత్రాన్ని ఉలగ నాయగన్ కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. అమరన్ సినిమాలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌తో ఈ సినిమాను బయోపిక్ చిత్రంగా తీస్తున్నారు.
ఇందు రెబెక్కా వర్గీస్
ఇందు రెబెక్కా వర్గీస్‌గా సాయి పల్లవిని పరిచయం చేస్తూ మేకర్స్ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు. ఇది ముకుంద్, ఇందుల ఎమోషనల్ జర్నీని అద్భుతమైన గ్లింప్స్‌గా ప్రజెంట్ చేస్తోంది. రిపబ్లిక్ డే పరేడ్ సీక్వెన్స్‌తో ఈ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వంటి ప్రముఖ వ్యక్తులతో పాటు ముకుంద్‌ను సత్కరిస్తున్న రియల్ ఫుటేజీని ప్రజెంట్ చేయడం మనసుని హత్తుకుంది.
సాయి పల్లవి, శివ కార్తికేయన్ కెమిస్ట్రీ
ఇందు పాత్రలో సాయి పల్లవి కట్టిపడేసింది. తన ప్రజెన్స్, పెర్ఫార్మెన్స్‌తో ఇందు క్యారెక్టర్‌కు అథెంటిసిటీని తీసుకొచ్చింది. సాయి పల్లవి, శివ కార్తికేయన్ కెమిస్ట్రీ చాలా బాగుండి అదిరిపోయింది. ఇంట్రో వీడియో ప్రధానంగా సాయి పల్లవి క్యారెక్టర్‌పై ఫోకస్ చేసి చూపించారు. ఇందులో రియల్ లైఫ్‌లోని ఇందు రెబెక్కా వర్గీస్‌ను కూడా చూపించారు.
హత్తుకునే బీజీఎమ్
అమరన్ సాయి పల్లవి ఇంట్లో వీడియోలోని బీజీఎమ్ చాలా బాగుంది. ఫస్ట్ లుక్ మొత్తం చాలా ఆహ్లాదకరంగా, మనసుకు హత్తుకునేలా ఉంది. కాగా టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లుగా ఉన్నారు.
హీరో నితిన్ తండ్రి
అమరన్ మూవీ శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా రూపొందించారు. అమరన్ ఈ దీపావళికి అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
దీపావళి కానుకగా
ఇదిలా ఉంటే, ఇటీవల కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అందుకుంది. దీంతో నటనతో సినిమాలకు కాస్తా బ్రేక్ ఇస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించాడు. అలాగే తమిళ బిగ్ బాస్‌కు కూడా హోస్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో తమిళ బిగ్ బాస్ సీజన్ 8కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా రానున్నాడు.