RRR Fails to Overcome KGF2: ఆ విషయంలో ఆర్ఆర్ఆర్ కంటే కేజీఎఫ్-2నే రికార్డు.. ఎందులో అంటే?-rrr movies fails to surpass kgf 2 at the global box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Rrr Movies Fails To Surpass Kgf 2 At The Global Box Office

RRR Fails to Overcome KGF2: ఆ విషయంలో ఆర్ఆర్ఆర్ కంటే కేజీఎఫ్-2నే రికార్డు.. ఎందులో అంటే?

ఆర్ఆర్ఆర్-కేజీఎఫ్2
ఆర్ఆర్ఆర్-కేజీఎఫ్2

RRR Fails to Overcome KGF2: రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీపై అంతర్జాతీయంగా పలు పురస్కారాలు వస్తున్నప్పటికీ.. వసూళ్ల పరంగా మాత్రం కేజీఎఫ్2ను అధిగమించలేకపోయింది. ఈ సినిమా మొత్తం వసూళ్లు 1210 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు.

RRR Fails to Overcome KGF2: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది. అంతేకాకుండా గోల్డెన్ గ్లోబ్ లాంటి పలు అంతర్జాతీయ అవార్డులను కూడా కైవసం చేసుకుంది. ఆస్కార్ తుది నామినేషన్‌కు కూడా ఎంపికై ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెల్చుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. అలాంటి ఆర్ఆర్ఆర్ గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అగ్రస్థానాన్ని తృటిలో చేజార్చుకుంది. బాక్సాఫీస్ గ్లోబల్ కలెక్షన్ల పరంగా చూస్తే కేజీఎఫ్-2 సినిమా ఆర్ఆర్ఆర్ కంటే ముందు వరుసలో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా రూ.1230 కోట్లను కొల్లగొట్టి ఆల్ టైం అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. దంగల్(రూ. 1899 కోట్లు), బాహుబలి 2 ది కన్ క్లూజన్ (రూ.1800 కోట్లు)సినిమాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ విడుదలైనప్పుడు రూ.1189 కోట్లను సాధించగా.. మొత్తంగా లైఫ్ టైమ్ కలెక్షన్లు రూ.1200 నుంచి 1210 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కేజీఎఫ్-2తో పోలిస్తే కొద్ది అంతరంతో మూడో స్థానాన్ని కోల్పోయింది.

ఇప్పటికే జపాన్‌లో ఆర్ఆర్ఆర్ విడుదలై రూ.45 కోట్లను రాబట్టింది. దీని బట్టి చూస్తే మొత్తంగా రూ.1189 కోట్లుగా వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇక లైఫ్ టైమ్ కలెక్షన్ల పరంగా చూస్తే ఈ వసూళ్లు రూ.1200 నుంచి రూ.1210 కోట్లు వచ్చే అవకాశముంది. దీంతో కేజీఎఫ్- కంటే వెనకంజలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వసూళ్లు తగ్గినప్పటికీ ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు అత్యంత ఆదరాభిమానాలను చూపిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.