ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై మెరిసిన ఆర్ఆర్ఆర్ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మూవీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
లండన్ లోని ఫేమస్ రాల్ ఆల్బర్ట్ హాల్ లో లైవ్ కాన్సర్ట్ చేసిన ఫస్ట్ వీదేశీ మూవీ గా ‘బాహుబలి 2’ అప్పట్లో హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు బాహుబలి 2 తర్వాత ఆ ఛాన్స్ ఆర్ఆర్ఆర్ కే దక్కింది. ఈ రెండు సినిమాలకు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్న సంగతి తెలిసిందే. లండన్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఎంతో స్పెషల్ గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
రాయల్ ఆల్బర్ట్ హాల్ లో రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ప్రదర్శన ఇచ్చారు. ఈ ఈవెంట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఇక ఈ ఈవెంట్ కోసం ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకే స్టేజీ మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఊగిపోయారు. వీళ్లతో పాటు డైరెక్టర్ రాజమౌళి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ బ్రోమాన్స్ మరోసారి ఫ్యాన్స్ కు ట్రీట్ అందించింది. ఈ స్టేజీపైనే ఎన్టీఆర్ కు రామ్ చరణ్ అడ్వాన్స్ బర్త్ డే విషెష్ చెప్పారు. మే 20న తారక్ పుట్టిన రోజు. ఇక రామ్ చరణ్ డైట్ సీక్రెట్స్ ను ఎన్టీఆర్ బయటపెట్టారు.
బహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఆయన సినిమాల కోసం ఇతర దేశాల్లోని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఎస్ఎస్ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్)ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. లండన్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ ఈవెంట్లో మహేష్ బాబు కూడా పాల్గొంటారని వార్తలొచ్చాయి.
ఎస్ఎస్ఎంబీ 29 మూవీ నేపథ్యంలో ముందుగానే గ్లోబల్ ఆడియన్స్ కు మహేష్ బాబును ఇంట్రడ్యూస్ చేయాలని జక్కన్న ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. కానీ ఈవెంట్ కు మహేష్ బాబు రాలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబును ఒకే స్టేజీపై చూడాలన్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.
సంబంధిత కథనం