Ray Stevenson Passes Away: స్కాట్ దొర ఇక లేరు.. ఆర్ఆర్ఆర్ యాక్టర్ మృతి
Ray Stevenson Passes Away: ప్రముఖ హాలీవుడ్ నటుడు రే స్టీవెన్‌సన్ మృతి చెందారు. ఆర్ఆర్ఆర్ మూవీలో స్కాట్ దొరగా గుర్తింపు తెచ్చుకున్న రే స్టీవెన్‌సన్ ఇటలీలో కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణం తెలియాల్సి ఉంది.
Ray Stevenson Passes Away: చిత్రసీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్, శరత్ బాబు రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందగా.. తాజాగా మరో నటుడు కన్నుమూశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో విలన్‌గా తెలుగువారికి సుపరిచితమైన హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్ సన్ చనిపోయారు. ఆయన పుట్టిన రోజుకు మే 25 నలుగు రోజులుందనగా మృతి చెందారు. దీంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ సినిమాలో స్కాట్ దొర పాత్రలో రే తన నటనతో ఆకట్టుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
1964 మే 25న నార్త ఐర్లాండ్‌లో జన్మించిన రే పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. థోర్ చిత్రంలో అస్గార్డియన్ యోధుడిగా కనిపించారు. ఇదికాకుండా స్టార్ వార్స్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రే స్టీవెన్‌సన్ మరణానికి గల కారణం మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం క్యాసినో ఇన్ ఇశ్చియా అనే మూవీలో నటిస్తున్న ఆయన.. చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లారు. చిత్రీకరణ సమయంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.
రే స్టీవెన్‌సన్ అసలు పేరు రేమండ్ స్టీవెన్‌సన్. 1998లో ఆయన తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. థియరీ ఆఫ్ ఫ్లైట్ అనే చిత్రంతో తన నటనతో ఆకట్టుకున్నారు. 2008లో వచ్చిన ఔట్ పోస్ట్ సినిమాతో తొలిసారి లీడ్ యాక్టర్‌గా మెప్పించారు. అక్కడ నుంచి చాలా పాపులర్ మూవీస్, టెలివిజన్ సిరీస్‌లో నటించి ఆకట్టుకున్నారు. ఇందులో ఆర్ఆర్ఆర్, థోర్, డైవర్జెంట్ సిరీస్, వైకింగ్స్, స్టార్ వార్స్ యానిమేటెడ్ సిరీస్ లాంటి పాపులర్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్ నటుడు మరణంతో దర్శకుడు రాజమౌళి కూడా తన స్పందనను తెలియజేశారు. ట్విటర్ వేదికగా తన సంతాపం ప్రకటించారు. రే మరణం తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియజేస్తూ పోస్టు పెట్టింది. "ఈ వార్త నాకు షాకింగ్‌గా ఉంది. నమ్మలేకపోతున్నాను. సెట్స్‌లో చాలా శక్తిని, చైతన్యాన్ని తీసుకొచ్చాడు. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. రే ఆత్మకు శాంతి కలగలాని కోరుకుంటున్నాను" అని రాజమౌళి ట్వీట్ చేశారు.