Ranji Trophy: రంజీ బాట పట్టిన టీమిండియా స్టార్లు -ఢిల్లీ టీమ్‌లో కోహ్లి, పంత్ -ముంబై జట్టులో రోహిత్, జైస్వాల్
Ranji Trophy: టీమిండియా ప్లేయర్లు దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్నారు. బీసీసీఐ రూల్ కారణంగా పలువురు టీమిండియా స్టార్లు రంజీ టోర్నీ ఆడబోతున్నారు. ఢిల్లీ టీమ్ తరఫున కోహ్లి, పంత్ బరిలోకి దిగబోతుండగా...ముంబై జట్టులో రోహిత్ శర్మ, జైస్వాల్ స్థానం దక్కించుకున్నారు.
Ranji Trophy: లాంగ్ గ్యాప్ తర్వాత టీమిండియా క్రికెటర్లు రంజీ ట్రోఫీ ఆడబోతున్నారు. టీమిండియా క్రికెటర్లు తప్పనిసరిగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని ఇటీవలే బీసీసీఐ రూల్ పెట్టింది. ఈ రూల్ వల్ల కోహ్లి, రోహిత్‌తో పాటు టీమిండియా క్రికెటర్లు రంజీ ట్రోఫీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ - ముంబై టీమ్‌లోకి...
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ టోర్నీలో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ముంబై రంజీ టీమ్ తరఫున బరిలో దిగబోతున్నాడు. ఈ నెల 23 నుంచి జమ్ము కశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడనున్నాడు.
ఈ మ్యాచ్‌లో అజింక్య రహానే కెప్టెన్సీలో రోహిత్ ఆడబోతుండటం గమనార్హం. సోమవారం ప్రకటించిన ముంబై రంజీ టీమ్‌లో రోహిత్ శర్మతో పాటు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకున్నాడు. వీరిద్దరితో పాటు టీమిండియా క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్, శివమ్ దూబే ముంబై టీమ్‌కు ఎంపికయ్యారు.
ఢిల్లీ టీమ్‌లో విరాట్...
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కూడా రంజీ క్రికెట్‌లోకి పునరాగమనం చేయబోతున్నాడు. సొంత జట్టు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరుగనున్న మ్యాచ్‌కు కోహ్లి అందుబాటులో ఉండనున్నట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఢిల్లీ టీమ్ తరఫున రంజీ మ్యాచ్ ఆడబోతున్నాడు. జనవరి 23 నుంచి సౌరాష్ట్ర, ఢిల్లీ మధ్య రంజీ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పంత్ తన లక్‌ను పరీక్షించుకోనున్నాడు. ఇదే మ్యాచ్‌లో పంత్‌కు ప్రత్యర్థిగా సౌరాష్ట్ర తరఫున టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు.
పంజాబ్ తరఫున గిల్
శుభ్‌మన్ గిల్ కూడా రంజీ ట్రోఫీ ఆడటానికి సిద్ధమయ్యాడు. రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన పంజాబ్ టీమ్‌లో గిల్ పేరును అనౌన్స్‌చేశారు. సౌరాష్ట్రతో జరుగనున్న మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉంటాడని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.