Rocket Boys 2 Web Series Review: రాకెట్ బాయ్స్ -2 వెబ్ సిరీస్ రివ్యూ - బ‌యోపిక్ సిరీస్ ఎలా ఉందంటే-rocket boys season 2 web series telugu review streaming on sonyliv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rocket Boys Season 2 Web Series Telugu Review Streaming On Sonyliv

Rocket Boys 2 Web Series Review: రాకెట్ బాయ్స్ -2 వెబ్ సిరీస్ రివ్యూ - బ‌యోపిక్ సిరీస్ ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Mar 18, 2023 12:00 PM IST

Rocket Boys 2 Web Series Review: జిమ్ స‌ర్భా, ఇశ్వాక్‌సింగ్‌, రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన రాకెట్ బాయ్స్ -2 వెబ్‌సిరీస్ శుక్ర‌వారం సోనిలివ్ ఓటీటీలో రిలీజైంది.

రాకెట్ బాయ్స్ -2
రాకెట్ బాయ్స్ -2

Rocket Boys 2 Web Series Review: భార‌త అణుశాస్త్ర పితామ‌హుడు హోమీ జే బాబా అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌కు ఆద్యుడైన విక్ర‌మ్ సారాభాయ్ జీవితాల‌తో రూపొందిన బాలీవుడ్ వెబ్‌సిరీస్ రాకెట్ బాయ్స్‌. జిమ్ స‌ర్భా(Jim Sarbh), ఇశ్వాక్ సింగ్, రెజీనా (Regina Cassandra) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ వెబ్‌సిరీస్‌కు అభ‌య్ ప‌న్ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సోనిలివ్ (SonyLIV) ఓటీటీలో ఈ సిరీస్ రిలీజైంది. గ‌త ఏడాది రిలీజైన ఫ‌స్ట్ సీజ‌న్ ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. రాకెట్ బాయ్స్ సీజ‌న్ 2 శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సెకండ్ సీజ‌న్ ఎలా ఉందంటే...

ప్ర‌యోగాలు విఫ‌లం...

శాస్త్ర‌వేత్త‌లుగా పేరుతెచ్చుకునే క్ర‌మంలో హోమీ జే బాబా, విక్ర‌మ్ సారాభాయ్‌ల‌కు ఎదురైన ప‌రిణామాల‌తో ఫ‌స్ట్ సీజ‌న్ రూపొందింది. వారి ప‌రిశోధ‌న‌ల‌ను అడ్డుకునేందుకు శ‌త్రువులు ప‌న్నిన కుట్ర‌ల‌తో సెకండ్ సీజ‌న్‌ను తెర‌కెక్కించారు. అణుబాంబు త‌యారీలో హోమీ జే బాబా, రాకెట్ లాంఛింగ్‌లో విక్ర‌మ్ సారాభాయ్ చేసిన ప్ర‌యోగాలు విఫ‌ల‌మ‌వుతాయి.

ఆ ఫెయిల్యూర్స్ నుంచి వారు ఎలా విజ‌య‌తీరాల వైపు అడుగులు వేశారు? హోమీ ప్ర‌యోగాల్ని అడ్డుకోవ‌డానికి అమెరికాకు చెందిన సీఐఏ ఎలాంటి కుట్ర‌ల‌ను ప‌న్నింది? వారి ప్ర‌యోగాల‌పై నెహ్రూ మ‌ర‌ణంతో పాటు భార‌త రాజ‌కీయాలు ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించారు? బాబాను చంపింది ఎవ‌రు? హోమీ, విక్ర‌మ్ సారాభాయ్ దూర‌మైన భార‌త అణ్వాయుధ క‌ల‌ను అబ్ధుల్ క‌లామ్ ఎలా నెర‌వేర్చాడు? అన్న‌దే (Rocket Boys 2 Web Series Review)ఈ సిరీస్ క‌థ‌.

క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు...

దేశానికి గ‌ర్వ‌కార‌మైన ఇద్ద‌రు గొప్ప శాస్త్ర‌వేత్త‌ల జీవితాల్ని ఈ సిరీస్ ద్వారా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ద‌ర్శ‌కుడు అభ‌య్ ప‌న్ను ఆవిష్క‌రించారు. రాజ‌కీయ ఒత్తిడులు, శ‌త్రువుల‌ కుట్ర‌ల‌ను ఎదుర్కొంటూ ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లు దేశం కోసం సాగించిన పోరాటాన్ని స్ఫూర్తిదాయ‌కంగా ఈ సిరీస్‌లో చూపించారు. తొలి సీజ‌న్‌లో ఎక్కువ‌గా డ్రామాకు ఇంపార్టెన్స్ ఇస్తే సెకండ్ సీజ‌న్ మాత్రం థ్రిల్లింగ్‌గా న‌డిపించారు ద‌ర్శ‌కుడు.

అమెరికా కుట్ర‌లు...

ముఖ్యంగా హోమీ జే బాబా అణ్వాయుధ ప‌రీక్ష‌ల్ని అడ్డుకోవ‌డానికి అత‌డి అసిస్టెంట్ మాథూర్ ద్వారా సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కుట్ర‌లు ప‌న్న‌డం వారి ఎత్తుల‌ను త‌న తెలివితేట‌ల‌తో హోమీ జే బాబా ఎదుర్కొనే సీన్స్ ఉత్కంఠ‌ను పంచుతాయి. హోమీ బాబాను అడ్డుకోవ‌డానికి విక్ర‌మ్ అంత‌రిక్ష ప‌రీక్ష‌ల‌కు ఆటంకాల‌ను సృష్టించ‌డం, ఇద్ద‌రి మ‌ధ్య అపార్థాలు వ‌చ్చే సీన్స్‌ను స‌హ‌జంగా రాసుకున్నారు.

విక్ర‌మ్ అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌ను ఒక‌వైపు చూపిస్తూనే మ‌రోవైపు త‌న నాట్య‌క‌ళ ద్వారా అత‌డి భార్య మృణాళిని సారాభాయ్ స‌మాజం కోసం పాటుప‌డిన‌ట్లుగా ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ సీన్స్ అల్లుకున్న తీరు మెప్పిస్తుంది.

రాజ‌కీయ ప‌రిణామాలు...

ఈ శాస్త్ర‌వేత్త‌ల జీవితాల‌తో పాటు 1970ల కాలం నాటి రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఈ సిరీస్‌లో చూపించారు ద‌ర్శ‌కుడు. నెహ్రూ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌ర‌ణం త‌ర్వాత ఇందిరాగాంధీ నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ప్ర‌ధానిగా ప‌ద‌వి చేప‌ట్ట‌డం, అమెరికా నుంచి ఆమెకు ఎదురైన ఒత్తిళ్ల‌ను ఇందులో చ‌ర్చించారు.

నిదాన‌మే మైన‌స్‌...

ఇద్ద‌రు గొప్ప శాస్త్ర‌వేత్త‌ల జీవితాల్లోని తెలియ‌ని కోణాల్ని చూపించాల‌న్న ద‌ర్శ‌కుడి ఆలోచ‌న బాగుంది. కానీ క‌థ‌నాన్ని నెమ్మ‌దిగా న‌డిపించ‌డ‌మే ఈ సిరీస్‌కు పెద్ద లోటుగా మారింది. ఆరంభం నుంచి చివ‌రి ఎపిసోడ్ ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ క‌లుగుతుంది. క‌థ ఒక్క అడుగు కూడా ముందుకు క‌ద‌ల‌దు. హోమీ జే బాబా క్యారెక్ట‌ర్‌లో కాన్‌ఫ్లిక్ట్ బాగుంది. అదే ఆస‌క్తి విక్ర‌మ్ సారాభాయ్ పాత్ర‌లో లోపించింది. ఫ్యామిలీ డ్రామా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

పోటాపోటీగా...

హోమీ జే బాబాగా జిమ్ స‌ర్బా, విక్ర‌మ్ సారాభాయ్‌గా ఇశ్వాక్ సింగ్ న‌ట‌న బాగుంది. గొప్ప శాస్త్ర‌వేత్త‌ల పాత్ర‌ల్లో పోటీప‌డి న‌టించారు. వారి లుక్, ఆహార్యం విష‌యంలో తీసుకున్న జాగ్ర‌త్త‌లు బాగున్నాయి. మృణాళిని సారాభాయ్‌గా రెజీనా హుందాత‌నంతో కూడిన పాత్ర‌లో క‌నిపించింది.

Rocket Boys 2 Web Series Review- ఓపిక కావాల్సిందే..

చ‌రిత్ర‌ను, శాస్త్ర‌వేత్త‌ల జీవితాల్ని గురించి తెలుసుకోవాల‌నే కుతూహ‌లం ఉన్న వారిని రాకెట్ బాయ్స్ సిరీస్‌ మెప్పిస్తుంది. కాస్త ఓపిక‌తో చూడ‌టంతో పాటు సైంటిఫిక్ డైలాగ్స్ ఇబ్బందిపెడ‌తాయి.

IPL_Entry_Point