ఈ మధ్యకాలంలో థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ జాబితాలోకి నితిన్, శ్రీలీల నటించిన యాక్షన్ కామెడీ మూవీ రాబిన్‌హుడ్ చేరింది. ఈ మూవీ ఒకేసారి అటు టీవీ, ఇటు ఓటీటీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన రాబిన్‌హుడ్ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజైంది. కానీ రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.14 కోట్లే వసూలు చేసి ప్రొడ్యూసర్లకు భారీ నష్టం మిగిల్చింది. మూవీలో గెస్ట్ రోల్ పోషించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కాపాడలేకపోయాడు.
అయితే మే 10 నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అదే సమయానికి అటు జీ తెలుగులోనూ టెలికాస్ట్ అయింది. ఇప్పుడు జీ5 ఓటీటీలో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీయే వెల్లడించింది. తొలి ఐదు రోజుల్లోనే ఈ సినిమా ఈ మైలురాయిని చేరుకుంది.
నితిన్, వెంకీ కుడుముల కలిసి గతంలో భీష్మలాంటి మంచి హిట్ సినిమాను అందించారు. దీంతో ఈ రాబిన్‌హుడ్ పై మరింత ఎక్కువ అంచనాలే ఉన్నాయి. కానీ సినిమా ఏమాత్రం వాటిని అందుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర నిరాశ తప్పలేదు. ఈ సినిమాలో రామ్ అనే ఓ అనాథగా నితిన్ కనిపించాడు.
అనుకోని పరిస్థితుల్లో అతడు డబ్బున్న వాళ్ల దగ్గర దోచుకొని లేని వాళ్లకు పంచిపెట్టే రాబిన్‌హుడ్ లా మారిపోతాడు. నీరా (శ్రీలీల)తో కలిసి దొంగతనాలు చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయి డ్రగ్ డీలర్ తో తలపడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రామ్, నీరా ఏం చేయబోతున్నారన్నదే ఈ రాబిన్‌హుడ్ మూవీ స్టోరీ.
ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ అనే వార్త సినిమాకు మంచి మైలేజీయే తీసుకొచ్చింది. అంతేకాకుండా అదిదా సర్‌ప్రైజు పాట వివాదం కూడా సినిమాను జనాల నోళ్లలో నానేలా చేసింది. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం మేకర్స్ ఆశించిన ఫలితం రాలేదు. మొత్తానికి ఇప్పుడు ఓటీటీలో అయినా ఈ సినిమాను ప్రేక్షకుల ఆదరిస్తుండటం వాళ్లకు కాస్త ఊరట కలిగించే విషయం.
సంబంధిత కథనం