Rihanna at Anant Ambani wedding: అనంత్ అంబానీ పెళ్లిలో రిహానా పర్ఫార్మెన్స్.. మన ఊహకు కూడా అందనంత మొత్తం తీసుకుంటోందా?
Rihanna at Anant Ambani wedding: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలో ప్రముఖ సింగర్ రిహానా పర్ఫామ్ చేయబోతోంది. అయితే దీనికోసం ఆమె మన ఊహకు కూడా అందనంత మొత్తం వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Rihanna at Anant Ambani wedding: దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి అంటే మాటలు కాదు కదా. ఏ స్థాయిలో హడావిడి ఉంటుంది. ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి విషయంలోనూ అదే జరుగుతోంది. ఊహించినట్లే ఏర్పాట్లు మామూలుగా జరగడం లేదు. అంతేకాదు ఈ పెళ్లిలో ప్రముఖ బార్బేడియన్ సింగర్ రిహానా పర్ఫామ్ చేయబోతోంది.
రిహానా రెమ్యునరేషన్ హైలైట్
అనంత్ అంబానీ పెళ్లిలో పర్ఫామ్ చేయడానికి రిహానా ఇప్పటికే గుజరాత్ లోని జామ్‌నగర్ కు చేరుకుంది. వస్తూ వస్తూ ఆమె ఇండియాకు తన వెంట తెచ్చుకున్ లగేజీ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. మొత్తం నీ ఇల్లంతా సర్దుకొని వచ్చేశావా అంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియోలు చూసిన వాళ్లు రిహానాను ట్రోల్ చేస్తున్నారు.
ఇదే ఆశ్చర్యకరమైన విషయం అయితే.. పెళ్లిలో పర్ఫామ్ చేయడానికి రిహానా ఏకంగా 50 లక్షల పౌండ్లు (సుమారు రూ.52 కోట్లు) వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అనంత్ అంబానీ పెళ్లి మొత్తం ఖర్చు ఏకంగా 12 కోట్ల పౌండ్లు (సుమారు రూ.1256 కోట్లు)గా అంచనా వేస్తున్నారు. కేవలం పెళ్లిలో భోజనాల ఖర్చే 2 కోట్ల పౌండ్లు(సుమారు రూ.209 కోట్లు)గా లెక్కేస్తున్నారు.
అనంత్ అంబానీ పెళ్లి కోసం రిహానా జామ్ నగర్ చేరుకుంది. అయితే ఆమె కంటే ముందే ఆమె పంపిన లగేజీ ఇండియాలో అడుగు పెట్టింది. ఆ లగేజీ కూడా మామూలుగా లేదు. ఎయిర్ పోర్టు నుంచి పెళ్లి వేదికకు దానిని మోసుకుపోవడానికి ఒక్క ట్రక్కు సరిపోలేదు. దీంతో ఆ లగేజీ చూసి రిహానాను దారుణంగా ట్రోల్ చేశారు. గతంలో 2018లో అంబానీలు తమ కూతురు ఇషా పెళ్లి సమయంలో బియాన్సీతో పర్ఫామ్ చేయించారు. అప్పుడు కూడా భారీ మొత్తం ఇచ్చుకున్నారు.
సినిమా ఇండస్ట్రీ మొత్తం పెళ్లిలోనే..
అనంత్ అంబానీ పెళ్లి కోసం దేశంలోని సినిమా ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లనుంది. అతని పెళ్లికి ఆహ్వానం అందుకున్న వారిలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లతోపాటు అన్ని సినిమా ఇండస్ట్రీల ప్రముఖులు ఉన్నారు. షారుక్ ఖాన్, దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఐశ్వర్య రాయ్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, రామ్ చరణ్ లాంటి వాళ్లంతా ఈ పెళ్లికి వెళ్లనున్నారు.
ఇప్పటికే అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు బిల్ గేట్స్, గౌతమ్ అదానీ, కుమార మంగళం బిర్లాతోపాటు క్రికెటర్లు, రాజకీయవేత్తలు వచ్చారు. గురువారం (ఫిబ్రవరి 29) నుంచి జామ్ నగర్ లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా స్థానికంగా 51 వేల మందికి అన్న సేవ ఏర్పాటు చేశారు. ఇందులో అంబానీ కుటుంబం మొత్తం అతిథులకు స్వయంగా వడ్డించింది.
శుక్రవారం (మార్చి 1) పెళ్లి పండగ మొదలు కానుంది. యాన్ ఈవెనింగ్ ఇన్ ఎవర్‌లాండ్ పేరుతో ఈ ఈవెంట్ జరగనుంది. ఇందులో రిహానా పర్ఫామ్ చేయబోతోంది. చివరిసారి 2023 సూపర్ బౌల్ లో ఆమె పర్ఫామ్ చేసింది. ఏడాది తర్వాత ఆమె పర్ఫార్మెన్స్ వీడియోలు చూడటానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.