Richest Comedian In India More Than Prabhas Ranbir Kapoor: కపిల్ శర్మ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమెడియన్ అనేది చాలా మందికి తెలిసిన విషయమే. షోలు, స్టేజ్ యాక్ట్స్, సినిమా అప్పియరెన్స్‌లతో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు.
అయితే, ఇంత పేరు తెచ్చుకున్న కపిల్ శర్మ అత్యంత ధనవంతుడు కూడా అవుతాడని చాలా మంది అనుకున్నారు. కానీ, 'కింగ్ ఆఫ్ కామెడీ' అనే సింహాసనంపై కపిల్ మాత్రమే కాకుండా ఇతర బాలీవుడ్ తారలకు కూడా అందనంత దూరంలో హాయిగా కూర్చున్నాడు ఓ తెలుగు స్టార్ కమెడియన్.
అతనేవరో కాదు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం. టాలీవుడ్‌లో 'కింగ్ ఆఫ్ కామెడీ'గా పేరొందిన ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ఇండియాలోనే అత్యంత రిచెస్ట్ కమెడియన్‌గా గుర్తింపు పొందారు. ఆయన వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి ప్రపంచ రికార్డ్ కొట్టిన విషయం తెలిసిందే. ఇలా తన వెయ్యికిపైగా సినిమా కెరీర్‌లో బ్రహ్మానందం 60 మిలియన్ డాలర్ల సంపదను కూడబెట్టారని డీఎన్ఏ, మనీకంట్రోల్ వెల్లడించాయి.
అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 516 కోట్లకు పైగా నికర ఆస్తితో భారతదేశంలోనే అత్యంత ధనిక హాస్య నటుడిగా రికార్డ్ సృష్టించారు. కేవలం ఇతర కమెడియన్ల కంటే మాత్రమే కాకుండా యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ (రూ.350 కోట్ల నికర ఆస్తి), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (రూ. 300 కోట్ల నికర ఆస్తి), తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (రూ.400 కోట్లు) వంటి అగ్ర హీరోల కంటే బ్రహ్మానందం ధనవంతుడయ్యాడు.
అయితే, నికర ఆస్తుల విలువను బట్టి వారందరికంటే బ్రహ్మానందం అత్యంత ధనిక కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు. నికర విలువ అంటే.. ఆ వ్యక్తి లేదా సంస్థకు ఉన్న మొత్తం ఆస్తుల నుంచి వారు చెల్లించాల్సిన అప్పులు, ఖర్చులు తీసేస్తే వచ్చే మిగిలిన మొత్తం. ఇలా ప్రభాస్, రణ్‌బీర్ కపూర్, రజనీకాంత్ కంటే బ్రహ్మానందం అత్యంత ధనవంతుడిగా గుర్తింపు సాధించినట్లు బాలీవుడ్ మీడియా వెబ్‌సైట్స్ పేర్కొన్నాయి.
ఇండియాలోని ఇతర పాపులర్ కమెడియన్లలో ఎవరూ కూడా బ్రహ్మానందంకు దరిదాపుల్లో లేకపోయారు. కపిల్ శర్మ నికర విలువ రూ. 300 కోట్లు కాగా, భారతదేశంలోని మరే కమెడియన్ కూడా తమ నికర విలువతో రూ.100 కోట్లు దాటలేదు. ఇదిలా ఉంటే, బ్రహ్మానందం మొదట ఆంధ్రప్రదేశ్‌లో ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు.
80వ దశకంలో తన మిమిక్రీ స్కిల్స్‌తో రంగస్థల కళాకారుడిగా బ్రహ్మానందం సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1985లో బుల్లితెరపై 1987లో సినిమాల్లో అరంగేట్రం చేశారు. బ్రహ్మానందం కెరీర్‌ను మార్చేసిన సినిమా ఆహా నా పెళ్లంట. ఈ సినిమా తర్వాతే బ్రహ్మానందంకు కమెడియన్‌గా సినీ ఆఫర్స్ అధికంగా రావడం మొదలైంది.
ఇక 90వ దశకంలో నిర్మాతలు బ్రహ్మానందం ప్రాముఖ్యతను గుర్తించారు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ అందులో బ్రహ్మానందం కచ్చితంగా ఉండాల్సినంతగా పేరు తెచ్చుకున్నారు. ఓ దర్శకుడు, నిర్మాత లేదా హీరో తీసే ప్రతి రెండో లేదా మూడో తెలుగు సినిమాలో బ్రహ్మానందం నటించేవారు.
అలా బ్రహ్మానందం డిమాండ్ పెరగడంతో ప్రతి సంవత్సరం టాప్ హీరోల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం కలిగింది. 2012లో ఏ నటుడికీ లేని విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బ్రహ్మానందంను సత్కరించింది. 2020 నాటికి ప్రముఖ నటుడు ప్రేమ్ నజీర్‌ను అధిగమించి ఏ నటుడికీ దక్కని ఘనతను సొంతం చేసుకున్నాడు.
కాగా బ్రహ్మానందం తన 69 ఏళ్ల వయసులో కూడా నటనను కొనసాగిస్తున్నారు. ఇంతకుముందులా కాకుండా అరకొర చిత్రాలు చేస్తున్నారు. రీసెంట్‌గా తన కుమారుడు రాజా గౌతమ్‌తో బ్రహ్మా ఆనందం మూవీలో నటించారు. ఆహాలో బ్రహ్మా ఆనందం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం