RGV మాస్టర్ క్లాస్ థ్రిల్లర్ మూవీకి 25 ఏళ్లు - 15 రోజుల షూటింగ్, నో ఇంటర్వెల్.. ఇప్పుడు ఎక్కడ చూడొచ్చు-rgv masterclass horror thriller kaun movie completes 25 years this urmila matondkar movie shoot in 15 days you can watch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rgv Masterclass Horror Thriller Kaun Movie Completes 25 Years This Urmila Matondkar Movie Shoot In 15 Days You Can Watch

RGV మాస్టర్ క్లాస్ థ్రిల్లర్ మూవీకి 25 ఏళ్లు - 15 రోజుల షూటింగ్, నో ఇంటర్వెల్.. ఇప్పుడు ఎక్కడ చూడొచ్చు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 26, 2024 07:22 PM IST

Ram Gopal Varma - Kaun movie: రామ్‍గోపాల్ వర్మ (RGV) దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘కౌన్’కు 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆర్జీవీ కెరీర్లో ఈ మూవీ స్పెషల్‍గా నిలిచింది.

RGV మాస్టర్ క్లాస్ థ్రిల్లర్ మూవీకి 25 ఏళ్లు.. 15 రోజుల షూటింగ్.. నో ఇంటర్వెల్
RGV మాస్టర్ క్లాస్ థ్రిల్లర్ మూవీకి 25 ఏళ్లు.. 15 రోజుల షూటింగ్.. నో ఇంటర్వెల్

Kaun movie - RGV: భారత సినీ ఇండస్ట్రీలో వైవిధ్య దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ (RGV)కు ప్రత్యేక స్థానం ఉంటుంది. టాలీవుడ్‍తో పాటు బాలీవుడ్‍లోనూ సంచలనాలు సృష్టించారు ఆర్జీవీ. మాస్టర్ క్లాస్ టేకింగ్, అద్భుతమైన టెక్నిక్స్, విభిన్నమైన ఫిల్మ్ మేకింగ్‍తో బ్లాక్‍బాస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. రంగీల, సత్య, సర్కార్ సహా చాలా సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్‍లో సెన్సేషన్ అయ్యారు. ఈ క్రమంలోనే 1999లో కౌన్ అనే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు ఆర్జీవీ. ఆ చిత్రానికి నేటితో (ఫిబ్రవరి 26, 2024) 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ మూవీకి ప్రత్యేకతలు ఉన్నాయి.

కౌన్ చిత్రంలో ఊర్మిళా మతోంద్కర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీకి అనురాగ్ కశ్యప్ కథ అందించగా.. రామ్‍గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రయోగాత్మకంగా చాలా కొత్తగా చూపించారు ఆర్జీవీ. దీంతో చాలా ప్రశంసలు దక్కాయి. కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో కౌన్ భారీ వసూళ్లను దక్కించుకోకపోయినా.. ఫిల్మ్ మేకింగ్‍లో మాస్టర్ క్లాస్‍గా నిలిచిపోయింది. 1999 ఫిబ్రవరి 26వ తేదీన ఈ మూవీ రిలీజ్ అయింది.

15 రోజుల్లోనే షూటింగ్

కౌన్ సినిమా కోసం కేవలం 15 రోజులు మాత్రమే షూటింగ్ చేశారట రామ్‍గోపాల్ వర్మ. ఇంత తక్కువ టైమ్‍లో మూవీని చిత్రీకరించి అప్పట్లో అందరినీ ఆయన ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాను ఈ చిత్రానికి 15 రోజుల్లోనే షూటింగ్ చేశానని ఆర్జీవీ కూడా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.

కౌన్ సినిమా రన్‍టైమ్ కేవలం 94 నిమిషాలు మాత్రమే ఉంది. దీంతో ఈ మూవీకి ఇంటర్వెల్ కూడా పెట్టలేదు ఆర్జీవీ. ఇది కూడా అప్పట్లో చాలా మందిని సర్‌ప్రైజ్ చేసింది.

ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ఇద్దరు అపరిచిత వ్యక్తులు ప్రవేశించడం చుట్టూ కౌన్ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఉత్కంఠ భరితమైన సీన్లు, ఇంటెన్స్ కథనంలో ఈ మూవీ ఆద్యంతం థ్రిల్లింగ్‍గా ఉంటుంది. అప్పటి వరకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేసిన ఊర్మిలా మతోంద్కర్‌తో సైకలాజికల్ థ్రిల్లర్ చేయడం కూడా ఓ ప్రత్యేకతగా నిలిచింది. ఇలాంటి రోల్ ఎందుకు చేశారని నిర్మాతతో పాటు కొందరు తనను అడిగారని కూడా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఈ మూవీని చూస్తూ ప్రేక్షకులు ఉత్కంఠతో బిగుసుకుపోవడాన్ని తాను చూశానని కూడా అన్నారు.

కౌన్ మూవీలో మనోజ్ బాజ్‍పేయీ, సుశాంత్ సింగ్ కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందించగా.. మజర్ కర్మాన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ముకేశ్ ఉదేశి, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో రూ.4కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. వసూళ్ల పరంగా యావరేజ్‍గా నిలిచింది. అయితే, టెక్నికల్, టేకింగ్ పరంగా మాస్టర్ క్లాస్ మూవీగా ప్రశంసలు పొందింది.

ఇప్పుడు ఎక్కడ చూడొచ్చు

కౌన్ (1999) సినిమా ప్రస్తుతం యూట్యూబ్‍లో అందుబాటులో ఉంది. ఈ మూవీని యూట్యూబ్‍లో ఉచితంగా చూసేయవచ్చు. ఈ చిత్రానికి మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.

కౌన్ సినిమా తెలుగులో 'ఎవరు?' పేరుతో డబ్బింగ్ కూడా అయింది. కన్నడలో షాక్ పేరుతో రీమేక్ అయింది.

IPL_Entry_Point