Revu Movie Review: రేవు మూవీ రివ్యూ - లేటెస్ట్ తెలుగు రివేంజ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?-revu movie review telugu raw and rustic revenge thriller movie review and rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Revu Movie Review: రేవు మూవీ రివ్యూ - లేటెస్ట్ తెలుగు రివేంజ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Revu Movie Review: రేవు మూవీ రివ్యూ - లేటెస్ట్ తెలుగు రివేంజ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Aug 24, 2024 08:17 PM IST

Revu Movie Review: కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన రేవు మూవీ ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. వంశీరామ్ పెండ్యాల‌, అజ‌య్‌, స్వాతి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు హ‌రినాథ్ పులి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

రేవు మూవీ రివ్యూ
రేవు మూవీ రివ్యూ

Revu Movie Review: వంశీరామ్ పెండ్యాల‌, అజ‌య్‌, స్వాతి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన రేవు సినిమా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైంది. రివేంజ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీకి హ‌రినాథ్ పులి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన రేవు మూవీ ఎలా ఉందంటే?

ఆధిప‌త్య పోరు....

పాల‌రేవు ఊరికి చెందిన అంకులు(వంశీరామ్‌), గంగ‌య్య(అజ‌య్‌_ మ‌ధ్య చేప‌ల వేట‌లో ఎప్పుడూ పోటీ ఉంటుంది. ఒక‌రంటే మ‌రొక‌రికి ప‌డ‌దు. నిత్యం గొడ‌వ‌లు ప‌డుతుంటారు. ఇద్ద‌రు క‌లిసిమెలిసి ఉండాల‌ని పెద్ద‌లు ఎంత చెప్పిన వినిపించుకోరు. నాగేశు (యేపూరి హ‌రి) పెద్ద బోటు కొని అంకులు, గంగ‌య్య‌ల జీవ‌నాధారాన్ని దెబ్బ‌తీస్తాడు. నాగేశుకు కంటే పెద్ద బోటు కొనాల‌ని అంకులు అనుకుంటాడు.

కానీ ఆర్థిక స్థోమత స‌రిపోదు. దాంతో అంకులు సొంతంగా ఇంజిన్ ప‌డ‌వ త‌యారు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు అత‌డి ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? నాగేశును ఎదురించేందుకు శ‌త్రువులైన అంకులు, గంగ‌య్య ఎలా ఒక్క‌ట‌య్యారు? ఈ పోరాటంలో వారు ఏం కోల్పోయారు? బావ‌నే త‌న జీవితం అనుకున్న సామ్రాజ్యం (స్వాతి) జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌దే రేవు మూవీ క‌థ‌.

రా అండ్ ర‌స్టిక్‌...

ఇది వ‌ర‌కు రా అండ్ ర‌స్టిక్ క‌థ‌ల‌ను ఆర్ట్ సినిమాల‌కు ప‌రిగ‌ణించేవారు. కానీ ఇప్ప‌డు ఆడియెన్స్ టేస్ట్ మారింది. రా అండ్ ర‌స్టిక్ క‌థ‌లు కూడా బాక్సాఫీస్ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాల్ని అందుకుంటున్నాయి. రియ‌లిస్టిక్‌గా క‌థ‌ల్ని వెండితెర‌పై తీసుకొచ్చే ట్రెండ్ పెరిగిపోయింది. రేవు అలాంటి ప్ర‌య‌త్న‌మే.

మ‌త్స్య‌కారుల జీవితాల‌తో...

మ‌త్స్య‌కారుల జీవ‌న విధానాన్ని, వృత్తిప‌రంగా వారు ఎదుర్కొనే ఒడిదుడుల‌కు యాక్ష‌న్‌, రివేంజ్‌తో పాటు ఓ ల‌వ్‌స్టోరీని జోడించి ద‌ర్శ‌కుడు హ‌రినాథ్ పులి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సినిమా లొకేష‌న్స్‌, యాక్ట‌ర్లు, విజువ‌ల్స్ అన్ని చాలా నాచుర‌ల్‌గా ఉండేలా ద‌ర్శ‌కుడు జాగ్ర‌త్త‌ప‌డ్డాడు.

రేవులో హీరోల‌కు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల విష‌యంలో ద‌ర్శ‌కుడు సినిమాటిక్‌గా ఆలోచించ‌కుండా వాస్త‌విక కోణంలో మ‌త్స్య‌కారులుఎలాంటి అడ్డంకుల‌ను ఎదుర్కొంటార‌నే అంశాల‌ నుంచే స్ఫూర్తి పొందుతూ కొన్ని సీన్స్ రాసుకోవ‌డం బాగుంది.

రివేంజ్ డ్రామా...

ఫ‌స్ట్ హాఫ్ మొత్తం అంకులు, గంగ‌య్య జీవితాల, వారి మ‌ధ్య ఉండే గొడ‌వ‌ల చుట్టూ న‌డిపించారు ద‌ర్శ‌కుడు. చాలా డీటైలింగ్‌గా సీన్స్‌ను చూపిస్తూ వెళ్ల‌డంతో క‌థాగ‌మ‌నం నెమ్మ‌దిగా సాగిన ఫీలింగ్ క‌లుగుతుంది. సెకండాఫ్‌లో రివేంజ్ డ్రామాగా మారిన త‌ర్వాతే క‌థ‌లో స్పీడు పెరుగుతుంది. నాగేశుతో పాటు అత‌డి కొడుకులు వేసే ఎత్తుల‌ను అంకులు, గంగ‌య్య క‌లిసి తిప్పికొట్టే సీన్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప‌ర్వాలేద‌నిపిస్తాయి. క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను డైరెక్ట‌ర్ డిజైన్ చేసుకున్న తీరు ఆక‌ట్టుకుంటుంది.

ప్రెడిక్ట‌బుల్ స్క్రీన్‌ప్లే...

క‌థ కంటే నాచురాలిటీ, విజువ‌ల్స్‌తో రా అండ్ ర‌స్టిక్‌గా చెప్పడానికే ద‌ర్శ‌కుడు ఎక్కువ‌గా ఆరాట‌ప‌డిన‌ట్లుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జ‌ర‌గ‌బోతుంద‌న్న‌ది ఈజీగా గెస్ చేసేలా ఉంటుంది. ప్రెడిక్ట‌బుల్‌గా స్క్రీన్‌ప్లేను రాసుకున్న ఫీలింగ్ క‌లుగుతుంది. హీరోతో పాటు గంగులు పాత్ర‌ల‌కు మ‌రికొంత డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది.

పోటాపోటీ...

అంకులు పాత్ర‌లో వంశీరామ్ పెండ్యాల స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. నిజ‌మైన మ‌త్స్య‌కారుడిగా అల‌డి లుక్ , గెట‌ప్ క‌నిపిస్తాయి. అజ‌య్ కూడా న‌ట‌న‌లో వంశీకి పోటీగా క‌నిపించాడు. విల‌న్ పాత్ర‌కు యేపూరి హ‌రి న్యాయం చేశాడు. స్వాతి భీమిరెడ్డి డీ గ్లామ‌ర్ పాత్ర‌లో ఓకే అనిపించింది.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా...

రా అండ్ ర‌స్టిక్ సినిమాల్ని ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను రేవు మెప్పిస్తుంది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్న‌మైన అనుభూతిని అందిస్తుంది.

రేటింగ్‌: 2.75/5

టాపిక్