తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఫర్వాలేదనిపిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కార్తీక్ సుబ్బరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తో సూర్య మాట్లాడాడు. తాను గొప్ప నటుడిని కాదని ఈ సందర్భంగా అతడు అనడం గమనార్హం. తన తమ్ముడు కార్తీతోనూ తనను తాను పోల్చుకున్నాడు.
రెట్రో మూవీ ప్రమోషన్లలో భాగంగా కార్తీక్ సుబ్బరాజ్, సంతోష్ నారాయణన్ లతో సూర్య మాట్లాడాడు. ఒకప్పుడు కాక కాక, గజిని, సిల్లును ఒరు కాదల్ లాంటి వరుస హిట్స్ తో సూర్య కెరీర్ మలుపు తిరిగింది. అయితే ఈ సినిమాలు తనను నమ్మి డైరెక్టర్లు తీయడం తన అదృష్టమని సూర్య అనడం గమనార్హం. తనకు ఈ మాత్రం నటన రావడానికి కారణం డైరెక్టర్ బాల అని సూర్య చెప్పాడు. ప్రతి సినిమాలో తాను తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని అన్నాడు.
“నేను గొప్ప నటుడిని కాదు కార్తీక్. కొందరు నన్ను ఓవరాక్టింగ్ నటుడిని అని అంటారు. చాలా మందికి ఆ అభిప్రాయం ఉంది. కానీ నేను బాలా సర్ నుంచి నేర్చుకున్నదానికి కట్టుబడి ఉంటాను. నేను నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ప్రతిసారీ ఇది జరగకపోవచ్చు. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. మేయళగన్ (తెలుగులో సత్యం సుందరం) సినిమా తీసుకోండి. నేను కార్తీలా చేయలేను. నేను మేయళగన్ లా చేయలేను” అని సూర్య అన్నాడు.
మంచి నటుడిగా పేరుగాంచినా.. ఈ మధ్యకాలంలో సూర్య వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్నాడు. అతని గత సినిమా కంగువ డిజాస్టర్ గా మిగిలిపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ మూవీ అసలు వాటిని అందుకోలేకపోయింది. అయితే అందులో సూర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తాజాగా రెట్రో కూడా అంతే.
సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపిస్తున్నా.. ఇందులోనూ సూర్య నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. రెట్రో మూవీ తొలి మూడు రోజుల్లో రూ.60 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఇప్పుడతడు ఆర్జే బాలాజీ, వెంకీ అట్లూరిల డైరెక్షన్లో తన తర్వాతి రెండు సినిమాలు చేయబోతున్నాడు.
సంబంధిత కథనం