OTT Recent Releases: గతవారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు ఇవే.. ఓ వెబ్ సిరీస్ కూడా..
Recent OTT Telugu Releases: గత వారం ఓటీటీలో కొన్ని ఆసక్తికరమైన తెలుగు చిత్రాలు వచ్చాయి. ఎంతోకాలం నిరీక్షించిన హనుమాన్‍తో పాటు మరిన్ని చిత్రాలు అడుగుపెట్టాయి. ఓ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‍కు వచ్చింది.
Recent OTT Releases: ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‍లు వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులను అలరిస్తున్నాయి. గత వారం (మార్చి 17 - మార్చి 24) కూడా కొన్ని తెలుగు చిత్రాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. ఓ తెలుగు వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‍కు వచ్చింది. చాలాకాలంగా నిరీక్షించిన హనుమాన్ మూవీ కూడా గతవారమే ఓటీటీలోకి వచ్చింది. మరిన్ని కూడా అందుబాటులోకి వచ్చాయి. మార్చి నాలుగో వారంలో వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి వచ్చిన తెలుగు చిత్రాలు, సిరీస్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.
హనుమాన్
బ్లాక్ బస్టర్ సూపర్ హీరో సినిమా ‘హనుమాన్’ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 17వ తేదీన అడుగుపెట్టింది. ఆ ప్లాట్‍ఫామ్‍లో తెలుగులో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించారు. జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. రెండు నెలల తర్వాత ఈ మూవీ జీ5 ఓటీటీలోకి వచ్చింది.
చాలా రోజుల నిరీక్షణ తర్వాత జీ5 ఓటీటీలోకి హనుమాన్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను కూడా దాటేసింది. మరోవైపు, హనుమాన్ మూవీ హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. రెండు ప్లాట్‍ఫామ్‍ల్లోనూ ఈ మూవీ టాప్‍లో ట్రెండింగ్‍లో ఉంది.
భూతద్దం భాస్కర్ నారాయణ
భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రం కూడా గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా మార్చి 22వ తేదీన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. డిటెక్టివ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా నటించారు. పురుషోత్తమ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో మార్చి 1న రిలీజ్ అయింది. ఇప్పుడు, నాలుగు వారాల్లోనే భూతద్దం భాస్కర్ నారాయణ ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
ఆపరేషన్ వాలెంటైన్
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం కూడా మార్చి 22వ తేదీన సడెన్‍గా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్ హీరోయిన్‍గా నటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్‍డ్రాప్‍లో దేశభక్తి, యుద్ధ విమానాల విన్యాసాలతో ఈ మూవీ తెరకెక్కింది. మార్చి 1వ తేదీన ఆపరేషన్ వాలెంటైన్ థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, అనుకున్నస్థాయిలో కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది. దీంతో నాలుగు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
తులసీవనం వెబ్ సిరీస్
తులసీవనం వెబ్ సిరీస్ మార్చి మార్చి 21వ తేదీన ‘ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సిరీస్‍కు అనిల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. వీజీ సైన్మాస్ పతాకంపై ఈ సిరీస్‍ను నిర్మించడంతో మంచి బజ్ వచ్చింది. క్రికెటర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న యువకుడి చుట్టూ ఈ సిరీస్ స్టోరీగా ఉంటుంది. తులసీవనం సిరీస్‍లో అక్షయ్ లగుసాని, వెంకటేశ్ కాకుమాను, ఐశ్యర్య కీలకపాత్రలు పోషించారు.
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లెర్ చిత్రం మార్చి 20వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చింది. హాలీవుడ్ సినిమా ఓపెన్‍హైమర్ తెలుగు డబ్బింగ్ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో వచ్చింది బాలీవుడ్ మూవీ ఫైటర్.. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 21 నుంచి హిందీలో మాత్రమే స్ట్రీమ్ అవుతోంది.
టాపిక్