Rebel Movie Review: రెబెల్ రివ్యూ - జీవీ ప్ర‌కాష్ కుమార్‌, మ‌మితా బైజు కోలీవుడ్ మూవీ ఎలా ఉందంటే?-rebel review gv prakash kumar mamitha baiju tamil political action movie review amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rebel Movie Review: రెబెల్ రివ్యూ - జీవీ ప్ర‌కాష్ కుమార్‌, మ‌మితా బైజు కోలీవుడ్ మూవీ ఎలా ఉందంటే?

Rebel Movie Review: రెబెల్ రివ్యూ - జీవీ ప్ర‌కాష్ కుమార్‌, మ‌మితా బైజు కోలీవుడ్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 10, 2024 09:35 AM IST

Rebel Movie Review: ప్రేమ‌లు మూవీతో ఓవ‌ర్‌నైట్‌లో స్టార్‌గా మారిన మ‌మితా బైజు రెబెల్ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవ‌ల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది.

రెబెల్ మూవీ రివ్యూ
రెబెల్ మూవీ రివ్యూ

Rebel Movie Review: జీవీ ప్ర‌కాష్ కుమార్‌, మ‌మితా బైజు హీరోహీరోయిన్లుగా న‌టించిన త‌మిళ మూవీ రెబెల్ ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. కుల వివ‌క్ష నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు నిఖేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీతోనే ప్రేమ‌లు ఫేమ్ మ‌మితా బైజు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న రెబెల్‌ సినిమా ఎలా ఉందంటే?

క‌థిర్ పోరాటం...

క‌థిరేస‌న్ (జీవీ ప్ర‌కాష్ కుమార్‌), సెల్వ (ఆదిత్య భాస్క‌ర్‌) త‌ల్లిదండ్రులు మున్నార్ తేయాకు తోట‌ల్లో కూలీలుగా ప‌నిచేస్తుంటారు. పిల్ల‌లు త‌మ‌లాగే కూలీలుగా బ‌త‌క‌కూడ‌ద‌ని క‌థిర్‌, సెల్వ‌ల‌ను వారి త‌ల్లిదండ్రులు క‌ష్ట‌ప‌డి చ‌దివిస్తారు.

త‌ల్లిదండ్రుల ఆశ‌లు నిల‌బెడుతూ క‌థిరేస‌న్‌, సెల్వ‌ల‌కు పాల‌క్క‌డ్‌లోని ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో సీటు వ‌స్తుంది. ఎన్నో క‌ల‌ల‌తో పాల‌క్క‌డ్ వ‌స్తారు క‌థిర్, సెల్వ‌. పాల‌క్క‌డ్ ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో మ‌ల‌యాళీ స్టూడెంట్స్ అధిప‌త్యం కొన‌సాగుతుంటుంది. కాలేజీలో టీఎస్‌క్యూ , ఎస్ఎఫ్‌వై అనే స్టూడెంట్ యూనియ‌న్స్‌ మ‌ధ్య ఎప్పుడూ గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి.

కాలేజీ ఎన్నిక‌ల్లో ఏ యూనియ‌న్ గెలిస్తే వారు చెప్పిన‌ట్లే స్టూడెంట్స్ అంద‌రూ న‌డుచుకోవాల్సివ‌స్తుంది. టీఎస్‌క్యూ యూనియ‌న్ లీడ‌ర్ ఆంథోనీకి లోక‌ల్ ఎమ్మెల్యే స‌పోర్ట్ ఉండ‌టంతో రౌడీలా రెచ్చిపోతుంటాడు. క‌థిరేస‌న్‌, సెల్వ‌తో పాటు మున్నార్ నుంచి వ‌చ్చిన మిగిలిన స్టూడెంట్స్ ను ర్యాగింగ్ పేరుతో దారుణంగా అవ‌మానిస్తాడు ఆంథోనీ.

త‌మ‌తో పాటు హాస్ట‌ల్‌లో త‌మిళ స్టూడెంట్స్ ఉండ‌కూడ‌ద‌ని రూల్ పెడ‌తాడు ఆంథోనీ. ప్రిన్సిప‌ల్ కూడా అత‌డిని ఏం చేయ‌లేక‌పోతాడు. ఓ గొడ‌వ‌లో ఆంథోనీని ఎదిరిస్తాడు సెల్వ‌. కోపంతో సెల్వ‌ను చంపేస్తాడు ఆంథోనీ. త‌న‌కున్న ప‌లుకుబ‌డితో సెల్వ‌నే బిల్డింగ్‌పై నుంచి ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా దొంగ సాక్ష్యాలు సృష్టిస్తాడు.

సెల్వ‌ మ‌ర‌ణంతో ఆంథోనీపై ప‌గ‌ను పెంచుకున్న క‌థిర్ టీఎస్‌యూ పేరుతో సొంతంగా పార్టీని ఏర్పాటుచేస్తాడు. కాలేజీ ఎలెక్ష‌న్స్‌లో టీఎస్‌క్యూ , ఎస్ఎఫ్‌వైల‌తో పోటీప‌డ‌తాడు. ఈ ఎన్నిక‌ల్లో క‌థిర్ విజ‌యం సాధించాడా?

క‌థిర్ ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌టం స‌హించ‌ని అంథోనీతో పాటు ఎస్ఎఫ్‌వై లీడ‌చ్ చార్లి అత‌డికి ఎలాంటి అడ్డంకుల‌ను సృష్టించారు? క‌థిర్ చంపాల‌ని ఎందుకు అనుకున్నారు? ఈ పోరాటంలో క‌థిర్‌కు సారా మేరీ జాన్ (మ‌మితా బైజు) ఎలా అండ‌గా నిలిచింది? క‌థిర్‌కు పోటీగా ఎన్నిక‌ల్లో నిల‌బ‌డిన సారా అత‌డి మంచిత‌నాన్ని ఎలా అర్థం చేసుకుంది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

కుల వివ‌క్ష బ్యాక్‌డ్రాప్‌లో...

కుల వివ‌క్ష‌, సామాజిక అంత‌రాల‌తో మిగిలిన భాష‌ల‌తో పోలిస్తే కోలీవుడ్‌లో ఎక్కువ‌గా సినిమాలు వ‌స్తోంటాయి. వెట్రిమార‌న్‌, పా రంజిత్‌, మారి సెల్వ‌రాజ్‌తో పాటు ప‌లువురు ద‌ర్శ‌కుడు అణ‌గారిన వ‌ర్గాల స‌మ‌స్య‌లు, వారి వ్య‌థ‌ల‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తూ విజ‌యాల్ని అందుకున్నారు. రెబెల్‌తో డైరెక్ట‌ర్ నిఖేష్ ఆర్ ఎస్ అదే ప్ర‌య‌త్నం చేశాడు.

1980 కాలం నాటి కథ…

1980 కాలంలో కుల‌, భాష‌ప‌ర‌మైన వివ‌క్ష ఎలా ఉండేది. చ‌దువు కోసం అట్ట‌డుగు వ‌ర్గాల వారు ఎలాంటి క‌ష్టాలు ప‌డేవార‌న్న‌ది వాస్త‌విక కోణంలో రెబెల్ మూవీలో చూపించాడు డైరెక్ట‌ర్‌. స్టూడెంట్స్ యూనియ‌న్స్ పేరుతో విద్యార్థుల జీవితాల‌తో రాజ‌కీయ నాయ‌కులు ఎలా చెల‌గాటం ఆడుతారు, త‌మ ఉనికి, అధికారాన్ని కాపాడుకోవ‌డానికి నాయ‌కులు వేసే ఎత్తుల‌ను ఈ మూవీలో చ‌ర్చించారు.

త‌మ వ‌ర్గం వారిని బానిస బ‌త‌కుల నుంచి విముక్తి క‌ల్పించి స‌మాన‌మైన విద్యా అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డం కోసం అగ్ర వ‌ర్ణాల‌తో పాటు ప్ర‌భుత్వం చ‌ట్టాల‌తో ఓ సాధార‌ణ విద్యార్థి ఎలాంటి పోరాటం సాగించాడ‌న్న‌ది యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్ అంశాల‌తో రెబెల్ క‌థ‌ను రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌.

వ‌న్ సైడ్ ల‌వ్‌స్టోరీ...

క‌థిరేస‌న్, సెల్వ కుటుంబ నేప‌థ్యాన్ని చూపిస్తూ ఈ సినిమాను మొద‌లుపెట్టారు డైరెక్ట‌ర్‌. డిగ్రీ చ‌ద‌వ‌డం కోసం వారు పాల‌క్క‌డ్ రావ‌డం, అక్క‌డ ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌తో ఫ‌స్ట్ హాఫ్‌ను న‌డిపించారు. మ‌రోవైపు సారా మేరీ జాన్‌తో క‌థిరేస‌న్ వ‌న్ సైడ్ ల‌వ్‌స్టోరీని చూపించారు.

సెల్వ మ‌ర‌ణం, ఆంథోనీ అండ్ గ్యాంగ్ ఉంటున్న హాస్ట‌ల్‌పై క‌థిర్ ఎటాక్ చేసే సీన్స్ ఫ‌స్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. సెకండాఫ్ మొత్తం ఆంథోనీ, చార్లికి పోటీగా కాలేజీ ఎన్నిక‌ల్లో క‌థిర్ నిల‌బ‌డ‌టం, ఆ ఎన్నిక‌ల్లో క‌థిర్ గెల‌వ‌కుండా ప్ర‌త్య‌ర్థులు వేసే కుట్ర‌ల చుట్టూ న‌డిపించారు. ఎన్ని క‌ష్టాలు ఎదురైన క‌థిన్ త‌న ల‌క్ష్యాన్ని చేరుకునే సీన్‌తో సినిమా ఎండ్ అవుతుంది.

సందేశం బాగుంది కానీ...

రెబెల్ మూవీలో ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న సందేశం మంచిదే. కానీ చెప్పిన విధానంలోనే ఆస‌క్తి లోపించింది. సినిమా మొత్తం రిపీటెడ్ సీన్స్‌తో, సిల్లీ సీక్వెన్స్‌ల‌తో న‌డుస్తుంది. కాలేజీ ఎన్నిక‌ల సీన్స్ అయితే ఓపిక‌కు ప‌రీక్ష పెడ‌తాయి. విల‌న్స్ వేసే ఎత్తుల‌ను హీరో తిప్పికొట్టే సీన్స్ డైరెక్ట‌ర్‌ బ‌లంగా రాసుకోలేదు. ల‌వ్‌స్టోరీ సినిమా నిడివి పెంచ‌డానికే ఉప‌యోగ‌ప‌డింది. హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ను క‌థ‌లో కావాల‌నే ఇరికించిన‌ట్లుగా అనిపిస్తుంది.

జీవీ ప్ర‌కాష్ కుమార్ క‌ష్టం...

క‌థిర్ పాత్ర‌కు న్యాయం చేసేందుకు జీవీ ప్ర‌కాష్ కుమార్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఇష్ట‌మైన చ‌దువు కోసం ఎన్ని క‌ష్టాల‌నైనా ఎదురించే యువ‌కుడిగా త‌న న‌ట‌న‌తో మెప్పించాడు. యాక్ష‌న్ సీన్స్‌తో పాటు ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో అద‌ర‌గొట్టాడు. రెబెల్ మూవీతోనే మ‌మితా బైజు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె క్యారెక్ట‌ర్‌కు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేదు. క‌థిర్‌కు పోటీగా ఆంథోనీ పాత్ర‌ధారి విల‌నిజం బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. జీవీ ప్ర‌కాష్ కుమార్ అందించిన బీజీఎమ్ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది.

కోలీవుడ్ ఫ్యాన్స్‌కు...

రెబెల్ క‌థ బాగున్నా సినిమాను కంప్లీట్‌గా చూడ‌టానికి ఓపిక చాలానే ఉండాలి. కోలీవుడ్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ఫ్యాన్స్‌ను కొంత వ‌ర‌కు రెబెల్‌ మూవీ మెప్పిస్తుంది.

IPL_Entry_Point