Telugu OTT: అనుకున్న డేట్ కంటే రెండు రోజులు ముందే ఓటీటీలోకి అనసూయ యాక్షన్ డ్రామా మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telugu OTT: అనసూయ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన రజాకార్ మూవీ జనవరి 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం జనవరి 22 నుంచే ఈ మూవీని స్క్రీనింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తోన్నట్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది.
Telugu OTT: అనౌన్స్ చేసిన డేట్ కంటే రెండు రోజులు ముందే రజాకార్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. రజాకార్ మూవీ జనవరి 24న ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీని ఆహా గోల్డ్ యూజర్స్ 48 గంటల ముందు నుంచే చూడొచ్చని ఆహా ఓటీటీ ప్రకటించింది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్ల కోసం జనవరి 22 నుంచే ఈ మూవీని స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది.
అనసూయ ఇంద్రజ...
రజాకార్ మూవీలో అనసూయ, బాబీ సింహా, వేదిక, ఇంద్రజ, రాజ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు.
భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన అకృత్యాలను, మారణ కాండను ఆవిష్కరిస్తూ దర్శకుడు యాటా సత్యనారాయణ రజాకార్ మూవీని తెరకెక్కించాడు.
మార్చిలో థియేటర్లలో రిలీజ్...
గత ఏడాది మార్చిలో రజాకార్ మూవీ థియేటర్లలో రిలీజైంది. పది నెలల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వస్తోంది. షూటింగ్ దశ నుంచే రజాకార్ మూవీ అనేక వివాదాలను ఎదుర్కొంది. చరిత్రను వక్రీకరిస్తూ ఈ సినిమా తీశారంటూ కొందరు సినీ రాజకీయ వర్గాలకు చెందిన వ్యక్తులు ఆరోపించారు. ఈ సినిమాను రిలీజ్ చేయద్దంటూ కోర్టును ఆశ్రయించారు. సినిమాలో హింస ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.
ఎట్టకేలకు...
ఈ వివాదాల కారణంగా రజాకార్ ఓటీటీలో రిలీజ్ కావడం అనుమానమంటూ వార్తలొచ్చాయి. ఓటీటీ రిలీజ్‌డేట్‌పై మేకర్స్ కూడా ఇన్నాళ్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడంఈ పుకార్లకు బలాన్ని చేకూర్చింది. ఎట్టకేలకు రజాకార్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో పోచమ్మగా అనసూయ, చాకలి ఐలమ్మగా ఇంద్రజ, రాజన్నగా బాబీ సింహా కనిపించారు. ఖాసిం రజ్వీ పాత్రలో రాజ్ అర్జున్, వల్లభాయ్ పటేల్‌గా రాజ్ సప్రు కనిపించారు.
రజాకార్ల దురాగతాలు...
నిజాం పాలనలో ఖాసిం రజ్వీ రజాకార్లు ఓ వర్గం వారిని టార్గెట్ చేస్తూ ఎలాంటి దురాగతాలు, హింసలకు పాల్పడ్డారనే అంశాలతో యథార్థ ఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు యాటా సత్యనారాయణ రజాకార్ కథను రాసుకున్నాడు. తెలంగాణ సాయిధ పోరాటానికి ప్రతీకగా నిలిచిన భైరాన్‌పల్లి, పరకాల జెండా ఉద్యమంలాంటి సంఘటనలతో పాటు చాకలి ఐలమ్మ, శాంతవ్వ, రాజిరెడ్డి లాంటి పోరాట యోధుల జీవితాల్ని రజాకార్ మూవీలో చూపించారు.
రజాకార్ మూవీ కథ…
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంగీకరించడు. రజాకార్ల సాయంతో ఇండిపెండెంట్‌గానే హైదరాబాద్‌ను పాలించాలనుకుంటాడు. ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకర్లు హిందువులును ముస్లింలుగా మార్చేందుకు కుట్రలు పన్నుతారు.
నిజాం నవాబుతో పాటు ప్రధాని లాయక్ అలీ కూడా ఖాసీం రజ్వీని సపోర్ట్ చేస్తాడు. ఉర్దూ తప్ప మిగిలిన భాషలు మాట్లాడకూడదని కట్టడి విధిస్తారు. పన్నుల పేరుతో ప్రజలను పీడించడం మొదలుపెడతారు. రజాకర్లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, రాజిరెడ్డి, శాంతవ్వ తో పాటు చాలా మంది నాయకులు ఎలాంటి పోరాటం సాగించారు? రజాకర్ల కుట్రలను సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఎలా తిప్పికొట్టాడు.
నెహ్రూ అంగీకరించకపోయినా వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో ఏ విధంగా విలీనం చేశాడు? మతకల్లోలాలు సృష్టించాలని అనుకున్న ఖాసీం రజ్వీ కుట్రలను పటేల్ ఏ విధంగా అడ్డుకున్నాడు? అన్నదే రజాకర్ మూవీ కథ.