Ravi Teja - Karthik Ghattamaneni movie: హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా కొత్త సినిమాలను అంగీకరిస్తున్నాడు రవితేజ (Raviteja). ఇప్పటికే మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేనితో రవితేజఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. కార్తికేయ, ప్రేమమ్, నిన్నుకోరి, అ! సినిమాలతో టాలెంటెడ్ కెమెరామెన్ గా పేరుతెచ్చుకున్నాడు కార్తిక్ ఘట్టమనేని.
ఇటీవల విడుదలైన కార్తికేయ 2లో(Karthikeya 2) అతడి విజువల్స్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాకు కెమెరామెన్‌గా వ్యవహరిస్తూనే ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తించాడు. తాజాగా అతడు రవితేజకు ఓ కథను వినిపించినట్లు సమాచారం. కథ నచ్చడంతో రవితేజ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ స్టయిలిష్‌గా ఉంటుందని సమాచారం.
ఈ సినిమాకు ఈగల్ అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలిసింది. దర్శకుడిగా కార్తిక్ ఘట్టమనేనికి ఇది రెండో సినిమా.
నిఖిల్ హీరోగా నటించిన సూర్య వర్సెస్ సూర్య సినిమాతో కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ప్రయోగాత్మక కథాంశంతో రూపొందిన ఈ సినిమా మంచి రిజల్ట్‌ను సొంతం చేసుకున్నది. ప్రస్తుతం రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ధమాకాతో సినిమాల్లో నటిస్తున్నాడు.
టాపిక్