Asian Raviteja: మహేష్, బన్నీ బాటలో రవితేజ - మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ - థియేటర్ పేరు ఇదేనా?
Asian Raviteja: మహేష్‌బాబు, బన్నీ, విజయ్ దేవరకొండ బాటలోనే రవితేజ అడుగులు వేయబోతున్నాడు. థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఏషియన్ రవితేజ పేరుతో హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మిస్తున్నాడు.
Asian Raviteja: టాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరుగా థియేటర్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు. మల్టీప్లెక్స్‌లు ప్రారంభిస్తున్నారు. టాలీవుడ్ హీరోల్లో మొదటగా మహేష్‌బాబు ఏఎంబీ పేరుతో హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు. మహేష్ స్ఫూర్తితో అల్లు అర్జున్ ఏఏఏ పేరుతో థియేటర్ నిర్మించాడు. విజయ్ దేవరకొండ కూడా మహబూబ్‌నగర్‌లో ఏవీడీ థియేటర్‌ను రన్ చేస్తున్నాడు. ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ థియేటర్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు.
ఏషియన్ రవితేజ...
వీరి బాటలో మరో టాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తోన్నాడు. మాస్ మహారాజా రవితేజ కూడా థియేటర్ బిజినెస్‌లోకి రాబోతున్నాడు. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఓ మల్లీప్లెక్స్ థియేటర్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మల్టీప్లెక్స్‌కు ఏషియన్ రవితేజ పేర్లు కలిసి వచ్చేలా ఏఆర్ టీ సీనిమాస్ అనే పేరు పెట్టబోతున్నట్లు తెలిసింది. మొత్తం ఆరు స్క్రీన్స్‌తో ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ను మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఏషియన్ రవితేజ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఏషియన్ సంస్థతో కలిసి రవితేజ ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఏషియన్ రవితేజ గురించి తొందరలోనే మాస్ మహారాజా రవితేజ అఫీషియల్ అనౌన్స్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈగల్ మిక్స్‌డ్ టాక్...
ఈగల్ మూవీతో ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. పన్నెండు రోజుల్లో 23. 48 కోట్ల వసూళ్లను రాబట్టింది. టాక్‌తో సంబంధం లేకుండా లాభాలను సొంతం చేసుకున్నది.
సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది...
అక్రమ ఆయుధాలను అడ్డుకుంటూ పత్తి రైతులకు, చేనేత రంగానికి తోడ్పాటు నందించే సహదేవ వర్మ అనే యువకుడిగా, కాంట్రాక్ట్ కిల్లర్‌గా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో రవితేజ కనిపించాడు. కామెడీ టైమింగ్‌తో కూడిన పాత్రలకు భిన్నంగా సీరియస్ రోల్‌లో రవితేజ నటించాడు. ఈగల్‌లో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకావాల్సిన ఈ మూవీ నిర్మాతల మధ్య ఒప్పందాల కారణంగా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈగల్ మూవీకి సీక్వెల్ కూడా రాబోతోంది.
మిస్టర్ బచ్చన్...
ఈగల్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తోన్నాడు రవితేజ. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన హిందీ మూవీ రైడ్‌కు రీమేక్‌గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతోంది. ఈగల్‌ను ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ మిస్టర్ బచ్చన్ సినిమాను నిర్మిస్తోంది. మిస్టర్ బచ్చన్‌లో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో షాక్, మిరపకాయ్ సినిమాలు రూపొందాయి. దాదాపు పదమూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తోన్నారు.
ప్రొడ్యూసర్‌గా...
ఓ వైపు హీరోగా నటిస్తూనే ప్రొడ్యూసర్‌గా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు రవితేజ. అతడు నిర్మాతగా వ్యవహరించిన సుందరం మాస్టర్ మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో వైవా హర్ష హీరోగా నటిస్తోన్నాడు.