Ravi Teja Ravanasura Glimpse: రావణాసుర గ్లింప్స్ వచ్చేసింది.. స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన మాస్ మహారాజా
Ravi Teja Ravanasura Glimpse: రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాను ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందీ చిత్రబృందం.
Ravi Teja Ravanasura Glimpse: మాస్ మహారాజా రవితేజ నెల గ్యాప్‌లో రెండు విజయాలను అందుకున్నాడు. గత నెలలో వచ్చిన ధమాకా సినిమా సూపర్ సక్సెస్ అందుకోగా.. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి పక్కన చేసిన వాల్తేరు వీరయ్య చిత్రం అదిరిపోయే వసూళ్లను సాధించింది. ప్రస్తుతం మరో హిట్‌పై దృష్టిపెట్టాడు రవితేజ. అతడు నటిస్తోన్న తాజా చిత్రం రావణాసుర. టాలీవుడ్ యంగ్ దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా రవితేజ అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. రావణాసుర సినిమాకు సంబంధించి గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ఈ ప్రత్యేక వీడియోలో రవితేజ అదరగొట్టాడు. స్టైలిష్ లుక్‌లో కనిపించడమే కాకుండా తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓ అపార్ట్మెంట్‌లో ఓ యువతిని చంపగా.. బ్లాక్ సూట్ ధరించిన మన మాస్ మహారాజా లోపల నుంచి బయటకు వచ్చి సిగార్ వెలిగిస్తున్నట్లున్న ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది. ఈ గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.
ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మాన్యూయేల్ నటిస్తోంది. ఈమెతో పాటు పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రావు రమేష్, మురళీ కృష్ణ, సంపత్ రాజ్, నితిన్ మెహతా తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.
అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్షన్ వర్ధన్ రామేశ్వర్-భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రావణాసుర సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికను సిద్ధం చేస్తోంది.