Ravi Teja Eagle: రవితేజకు తప్పని కష్టాలు.. ఫిలీం చాంబర్‌కు ఈగల్ నిర్మాతల లేఖ-ravi teja eagle producers letter to film chamber about solo release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja Eagle: రవితేజకు తప్పని కష్టాలు.. ఫిలీం చాంబర్‌కు ఈగల్ నిర్మాతల లేఖ

Ravi Teja Eagle: రవితేజకు తప్పని కష్టాలు.. ఫిలీం చాంబర్‌కు ఈగల్ నిర్మాతల లేఖ

Sanjiv Kumar HT Telugu

Ravi Teja Eagle Makers Letter To Film Chamber: రవితేజ ఈగల్ మూవీకి రిలీజ్ డేట్ విషయంలో కష్టాలు ఇంకా తప్పేలా లేవు. అందుకే సోలో రిలీజ్ డేట్ కోసం ఫిలీం చాంబర్ పెద్దలకు ఈగల్ నిర్మాతలు లేఖ రాశారు.

రవితేజకు తప్పని కష్టాలు.. ఫిలీం చాంబర్‌కు ఈగల్ నిర్మాతల లేఖ

Eagle Makers Letter: ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ విడుదలయ్యాయి. వీటీతోపాటు రిలీజ్ కావాల్సిన ఈగల్ మూవీ వాయిదా పడింది. ఆ సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిక్వెస్ట్ చేస్తే రవితేజ ఈగల్ మూవీ నిర్మాతలు తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో సంక్రాంతికి డ్రాప్ అయి తర్వాత సోలో రిలీజ్ డేట్‌కు విడుదల చేసేలా ప్రయత్నిస్తానని దిల్ రాజు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో రవితేజ ఈగల్ మూవీ టీమ్ ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంది.

కానీ, అదే ఫిబ్రవరి 9కి సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌గా వస్తోన్న యాత్ర 2 చిత్రాలు రిలీజ్ కానున్నట్లు ప్రకటించాయి. దీంతో సిద్ధు జొన్నలగడ్డ క్రేజీయెస్ట్ మూవీ టిల్లు స్క్వైర్ వెనక్కి తగ్గి ఆ డేట్‌ను వదులుకుంది. అయితే ఫిబ్రవరి 9న రిలీజ్ చేద్దామనుకున్న ఈగల్ మూవీకి రెండు చిత్రాలు పోటీ వచ్చాయి. ఈ నేపథ్యంలో సోలో రిలీజ్ డేట్ గురించి ఫిల్మ్ ఛాంబర్‌కు ఈగల్ నిర్మాతలు లేఖ రాశారు.

తమకు ఇచ్చిన సోలో రిలీజ్ డేట్ హామీ గురించి లేఖలో ఈగల్ మేకర్స్ ప్రస్తావించినట్లు సమాచారం. 2024 జనవరి 13న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈగిల్ సినిమా విడుదలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని అధికారికంగా ప్రస్తావించేందుకు తాను ఈ లేఖ రాస్తున్నట్లు నిర్మాత తన లేఖలో పేర్కొన్నారు.

"ఛాంబర్ పెట్టిన మీటింగ్‌లో నిర్మాతల్లో ఒకరు సినిమాను వాయిదా వేసుకోవాలని కోరారు. దాంతో ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నాం. ఛాంబర్ నుంచి హామీ తీసుకోవడం ద్వారా మాకు సోలోగా డేట్ దొరుకుతుందని భావించాం. ప్రెస్ మీట్ లో చాంబర్ అంగీకరించిన విధంగా జరుగుతుంది అనుకున్నాం. కానీ, దురదృష్టవశాత్తు మేము అనుకుంటున్న ప్రతి డేట్‌కు ఎక్కువ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని పెద్దలు గమనించాలని, మాకు సోలో రిలీజ్ డేట్ కేటాయించేలా చూడాలని అభ్యర్తిస్తున్నాం" అని నిర్మాతలు కోరినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే మరోసారి ఇండస్ట్రీలో ఈగల్ రిలీజ్ డేట్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సంక్రాంతికి వాయిదా వేసుకున్న ఈగల్ మూవీకి మరోసారి ఇతర సినిమాల నుంచి పోటీ తప్పడం లేదు. తాజాగా ఊరు పేరు బైరవకోన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఫిబ్రవరి 9న ఈగల్ మూవీ ఉంది కదా అనే ప్రశ్న సందీప్ కిషన్‌కు ఎదురైంది.

"మా సినిమా హారర్ అండ్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కింది. సంక్రాంతికి విడుదల చేస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనుకున్నాం. కానీ, సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతుండడంతో కరెక్ట్ కాదనుకుని వాయిదా వేసుకున్నాం. ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ కూడా టిల్లు స్కైర్ నిర్మాత నాగవంశీతో మాట్లాడాకే అనౌన్స్ చేశాం. రవితేజ గారంటే మాకు అమితమైన అభిమానం ఉంది. నేను కూడా ఆయన అభిమానినే" అని సందీప్ కిషన్ అన్నాడు.

"సోలో రిలీజ్ డేట్ గురించి వారు అయితే మమ్మల్ని ఇప్పటివరకు సంప్రదించలేదు. ఈ రిలీజ్ డేట్ మాకు చాలా ముఖ్యం. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే దీని గురించి చర్చిస్తాం" అని సందీప్ కిషన్ తెలిపాడు. కాగా యాత్ర 2 సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.