Eagle OTT Streaming: ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన రవితేజ ఈగల్ - రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
Eagle OTT Streaming: రవితేజ ఈగల్ మూవీ ఓటీటీలో రిలీజైంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ ఓటీటీలలో ఈగల్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Eagle OTT Streaming: రవితేజ ఈగల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైంది. శుక్రవారం (మార్చి 1) అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ ద్వారా ఈ మాస్ యాక్షన్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐదు భాషల్లో రవితేజ మూవీ రిలీజైంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులో మాత్రమే చూడొచ్చు. ఫిబ్రవరి 9న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇరవై రోజుల్లోనే ఈగల్ మూవీ ఓటీటీలోకి రావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్...
ఈగల్ మూవీకి సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్యథాపర్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. రవితేజ యాక్టింగ్, ఎలివేషన్స్ బాగున్నా దర్శకుడు రాసుకున్న కథ మాత్రం రొటీన్‌గా ఉందనే విమర్శలొచ్చాయి.
ప్రీ రిలీజ్ బిజినెస్....కలెక్షన్స్...
రవితేజకు మాస్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ కారణంగా ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 21 కోట్లకు అమ్ముడుపోయాయి. తొలిరోజు ఆరు కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ కారణంగా ఆ తర్వాత డ్రాప్ అయ్యింది. ఓవరాల్‌గా ఫుల్ థియేట్రికల్ రన్‌లో 24 కోట్ల వరకు కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. నిర్మాతలకు ఈ మూవీ మోస్తారు లాభాలను మిగిల్చింది.
ఈగల్ మూవీ కథ ఇదే...
ఈగల్ నెట్‌వర్క్ పేరుతో సహదేవ వర్మ (రవితేజ) అక్రమ ఆయుధాలు సరఫరా చేసే వారి అంతు చూస్తుంటాడు. తలకోన అడవుల్లో పత్తి మిల్లు నడుపుతూ చేనేత రైతులకు సహాయపడుతుంటాడు. సీబీఐ నుంచి నక్సలైట్ల వరకు ఎందరికో టార్గెట్‌గా మారిన సహదేవవర్మకు తెలుసుకోవాలని జర్నలిస్ట్ నళినీ(అనుపమ పరమేశ్వరన్) తలకోన అడువులకు వస్తుంది.
ఆమె అన్వేషణలో సహదేవవర్మ గురించి ఏ తెలిసింది? విదేశాల్లో కాంట్రాక్ట్ కిల్లర్‌గా పనిచేసే సహదేవవర్మ ఇండియాకు వచ్చిన ఈగల్ నెట్‌వర్క్‌ను ఎందుకు రన్ చేస్తున్నాడు? సహదేవవర్మ భార్య రచనను (కావ్య థాపర్) ఎవరు చంపారు అన్నదే ఈ మూవీ కథ.
ఈగల్ 2 యుద్ధకాండ….
ఈగల్ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. ధమాకా తర్వాత ఈ బ్యానర్‌లో రవితేజ చేసిన మూవీ ఇది. ఈగల్ మూవీకి సీక్వెల్ కూడా తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు ప్రకటించాడు. ఈగల్ 2 యుద్ధకాండ పేరుతో సెకండ్ పార్ట్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించాడు. ఫస్ట్ పార్ట్ కు మిక్స్‌డ్ రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో ఈగల్ సీక్వెల్ ఉంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈగల్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. సంక్రాంతికి నాలుగు స్ట్రెయిట్ సినిమాలు రావడంతో ఫిబ్రవరి 9కి వాయిదాపడింది. సూర్య వర్సెస్ సూర్యతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ఈగల్‌లో తిరిగి మెగాఫోన్ పట్టాడు.