Rashmika Mandanna: అభిమానితో వీడియో కాల్‍లో మాట్లాడిన రష్మిక.. ఆమెపై అమితాబ్ ప్రశంసలు: వీడియో
Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన్న.. తన అభిమానితో వీడియో కాల్‍లో మాట్లాడారు. కౌన్ బనేగా క్రోర్‌పతి 15 షోలో ఇది జరిగింది. ఆ వివరాలివే.

Rashmika Mandanna: పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‍లో ఫుల్ పాపులర్ అయ్యారు హీరోయిన్ రష్మిక మందన్న. అప్పటి వరకు టాలీవుడ్‍లో టాప్ హీరోయిన్‍గా ఉన్న ఆమె.. ఆ మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యారు. రష్మిక హీరోయిన్‍గా నటించిన యానిమల్ సినిమా ఇటీవల డిసెంబర్ 1న రిలీజై భారీ బ్లాక్‍బాస్టర్ దిశగా దూసుకెళుతోంది. కాగా, తాజాగా ఓ అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చారు రష్మిక. వీడియో కాల్‍లో మాట్లాడారు.
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి 15 (KBC 15) గేమ్ షోకు మహారాష్ట్ర నాందేడ్ నుంచి ప్రమోద్ భాస్కే అనే కంటెస్టెంట్ వచ్చారు. తనకు రష్మిక అంటే ఎంతో ఇష్టమని ఆయన అమితాబ్‍కు చెప్పారు. సోషల్ మీడియాలో తాను చేసిన పోస్టులకు మూడుసార్లు రష్మిక రిప్లై కూడా కూడా ఇచ్చారని ప్రమోద్ తెలిపారు. దీంతో రష్మిక మందన్నతో వీడియో కాల్ ఏర్పాటు చేశారు అమితాబ్.
తన అభిమాని ప్రమోద్‍తో వీడియో కాల్‍లో మాట్లాడారు రష్మిక. ట్విట్టర్లో ఇంతకు ముందు ఈయనకు రిప్లై ఇచ్చారంట కదా అని రష్మికకు అమితాబ్ గుర్తు చేశారు. రష్మికను చూడగానే ప్రమోద్ చాలా సంతోషించారు. “ఎలా ఉన్నారు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని రష్మికతో వీడియో కాల్‍లో తెలుగులో ప్రమోద్ అన్నారు. దీంతో నవ్వుతూ “నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అని రష్మిక అన్నారు.
స్వయంగా కలవాలని తాను ఎంతో వేచిచూస్తున్నానని రష్మికకు చెప్పారు ప్రమోద్. దీంతో ఏదో ఒకరోజు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నట్టు రష్మిక కూడా చెప్పారు. తన మొబైల్, వాట్సాప్ డీపీ, ల్యాప్‍టాప్ వాల్ పేపర్‌గానూ మీ ఫొటోనే పెట్టుకున్నానని రష్మికతో ప్రమోద్ చెప్పారు. దీంతో సో స్వీట్ అంటూ రష్మిక ఆనందించారు. తప్పకుండా మిమ్మల్ని కలుస్తానని అన్నారు. లవ్ యూ సోమచ్ అని ప్రమోద్ అంటే.. లవ్ యూ సోమచ్ అని రష్మిక అన్నారు. 2016లో కిరిక్ పార్టీ సినిమా నుంచి రష్మిక అంటే చాలా ఇష్టమని ప్రమోద్ చెప్పారు.
యానిమల్ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారని రష్మికను ప్రశంసించారు అమితాబ్ బచ్చన్. తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. అమితాబ్‍కు థ్యాంక్స్ చెప్పారు రష్మిక. ఈ వీడియో కాల్‍కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
యానిమల్ సినిమాలో రణ్‍బీర్ కపూర్ సరసన గీతాంజలి పాత్రలో హీరోయిన్‍గా చేశారు రష్మిక. ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప 2: ది రూల్ సినిమాలో నటిస్తున్నారు రష్మిక. రెయిన్‍బో, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.