Rasha Thadani Says Tamannaah Vijay Varma Godparents: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కేజీఎఫ్ 2 నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ ఇటవలే హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. రాషా తడానీ బాలీవుడ్ అరంగేట్రం చేసిన సినిమా ఆజాద్.
ఆజాద్ మూవీతో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్ కూడా కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆజాద్ మూవీ థియేటర్లలో విడుదలై ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవల ఫిల్మ్ ఫేర్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాషా తడానీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ ఇంటర్వ్యూలో బ్రేకప్ జంట తమన్నా భాటియా, విజయ్ వర్మలతో తాను పంచుకున్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పుకొచ్చింది రాషా తడానీ. వారిద్దరిని దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు అంటూ ప్రస్తావించింది ఈ బ్యూటిఫుల్ యంగ్ హీరోయిన్ రాషా తడానీ. ఇంటర్వ్యూలో తమన్నాతో పంచుకున్న 'ప్రత్యేకమైన బంధం' గురించి హోస్ట్ అడిగారు.
దాంతో తమన్నా, తాను ఎలా కలుసుకున్నారో, పరిచయం వెనుక ఉన్న కథను రాషా తడానీ చెప్పుకొచ్చింది. ''నిజానికి ఇది చాలా ఫన్నీ స్టోరీ. మేము ఒకరి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లాం. అక్కడ ఒక సింగర్ లైవ్‌లో ప్రదర్శన ఇస్తున్నారు. స్టేజ్ దగ్గర ఆయన పాటలకు నేను డ్యాన్స్ చేస్తున్నాను. ఆమె (తమన్నా భాటియా) కూడా అలాగే డ్యాన్స్ చేస్తోంది'' అని వివరించింది రాషా తడానీ.
''అలా డ్యాన్స్ చేస్తూ మేమిద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. తర్వాత ఇద్దరం కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించాం. దానికి పెద్ద సమయం కూడా పట్టలేదు. అలా చూడగానే ఇలా డ్యాన్స్ చేశాం. తర్వాత నాకు తమన్నాతో ఎంతో అనుబంధం ఏర్పడింది. తమన్నా, విజయ్ వర్మ నాకు చాలా త్వరగా అత్యంత సన్నిహితులు అయ్యారు. తమన్నా లేకుండా నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు'' అని రాషా తడానీ తెలిపింది.
''ప్రస్తుతం తమన్నా, విజయ్ నాకు అత్యంత సన్నిహితులు. ఒకరకంగా చెప్పాలంటే వారు నాకు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులాంటివారు'' అని రాషా తడానీ ఊహించనివిధంగా కామెంట్స్ చేసింది. అంతేకాకుండా, రీసెంట్‌గా రాషా 20వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో జరిగిన బర్త్ డే పార్టీకీ తమన్నా కూడా హాజరైంది. అలాగే, నిర్మాత ప్రగ్యా కపూర్ హోలీ పార్టీలో రాషాతో కలిసి తమన్నా సందడి చేసింది.
ఇదిలా ఉంటే, రాషా తడానీ హిందీ డెబ్యూ మూవీ ఆజాద్ జనవరి 17న థియేట్రికల్‌గా విడుదలై మార్చి 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఆజాద్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ రాషా తడానీ, అమన్ దేవగన్ నటనకు మంచి రివ్యూలు వచ్చాయి. ఇక ఉయ్ అమ్మ పాటలో రాషా తడానీ డ్యాన్స్‌తో తెగ ట్రెండ్ అయింది.
తమన్నా ప్రస్తుతం తెలుగులో 'ఓదెల 2' చిత్రంలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. ఇదే కాకుండా డేరింగ్ పార్ట్నర్స్ అనే ఓటీటీ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది తమన్నా. ఇక విజయ్ వర్మ చివరిసారిగా మర్డర్ ముబారక్, ఐసీ 814: ది కాందహార్ హైజాక్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఉల్ జలూల్ ఇష్క్ సినిమాలో నటిస్తున్నాడు.
మరోవైపు తమన్నా, విజయ్ వర్మ విడిపోయారని, అయితే మంచి స్నేహితులుగా కొనసాగాలని యోచిస్తున్నారని ఇటీవలే పింక్ విల్లా పేర్కొంది. దీంతో ఇతర సెలబ్రిటీ జంటలాగే తమన్నా, విజయ్ కపుల్ కూడా బ్రేకప్ చెప్పుకున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
సంబంధిత కథనం