Ranbir Kapoor | తన ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో చెప్పిన రణ్‌బీర్ కపూర్!
ఓ టాప్ హీరోకి మరో ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ఉండటం విశేషమే. ఆ హీరో ఎవరో తెలుసుకోవాలని అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ కూడా తనకు నచ్చిన టాలీవుడ్ హీరో ఎవరో చెప్పాడు.
బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు రణ్‌బీర్ కపూర్. దివంగత రిషీ కపూర్ తనయుడైన అతడు.. మంగళవారం వైజాగ్ వచ్చాడు. తన లేటెస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర ప్రమోషన్ కోసం అతడు విశాఖపట్నం రావడం విశేషం. ఈ మూవీ రిలీజ్‌కు మరో వంద రోజులు ఉన్న సందర్భంగా వైజాగ్‌లోనే మూవీ టీజర్ రిలీజ్ చేశాడు. అతనితోపాటు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, తెలుగులో ఈ మూవీని సమర్పిస్తున్న దర్శకధీరుడు రాజమౌళి కూడా ఉన్నారు.
టీజర్ రిలీజ్ తర్వాత ఈ ముగ్గురూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీ ఫేవరెట్ తెలుగు యాక్టర్ ఎవరు అని యాంకర్ అడగగా.. రణ్‌బీర్ కాసేపు మౌనంగా ఉన్నాడు. ఈలోపు అక్కడే ఉన్న అభిమానులు అతడు ఎవరి పేరు చెబుతాడో అని ఆసక్తిగా ఎదరు చూశారు. చివరికి తన ఫేవరెట్ హీరో డార్లింగ్ ప్రభాస్ అని రణ్‌బీర్ చెప్పడంతో హాల్ అంతా ఫ్యాన్స్ కేరింతలతో మార్మోగిపోయింది.
"నాకు నా డార్లింగ్ ప్రభాస్ అంటే ఇష్టం. అతడు నాకు మంచి ఫ్రెండ్. అందరూ గ్రేట్ యాక్టర్లే. కానీ ఒక్కరినే ఎంచుకోవాలంటే మాత్రం అతడు నా డార్లింగ్ ప్రభాసే" అని రణ్‌బీర్ చెప్పాడు. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌కు.. ఇప్పుడు నార్త్‌లోనూ చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు హిందీలోనూ రిలీజ్ అయ్యాయి.
ఇక బ్రహ్మాస్త్ర విషయానికి వస్తే ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లోనూ అతడు కనిపించాడు. నాగార్జునతోపాటు అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కూడా ఈ మూవీలో నటించారు. సెప్టెంబర్ 9న రిలీజ్ కానున్న బ్రహ్మాస్త్ర ట్రైలర్.. జూన్ 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో తన భార్య ఆలియాతో కలిసి రణ్‌బీర్ తొలిసారి నటించాడు.
సంబంధిత కథనం