Animal: ‘యానిమల్’ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చేసింది.. ఆ రోజే రిలీజ్
Animal: రణ్‍బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ చిత్రం విడుదలపై క్లారిటీ వచ్చింది. మందుగా ప్రకటించిన తేదీనే రీలీజ్ కానుంది.
Animal Movie: అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్‍లో ప్రస్తుతం ‘యానిమల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్‍బీర్ కపూర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. హై యాక్షన్ ఇంటెన్సిటీ మూవీగా యానిమల్ తెరకెక్కుతోంది. రణ్‍బీర్ లుక్ అదిరిపోయేలా ఉంది. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ యానిమల్ సినిమా విడుదల వాయిదా పడుతుందని ఇటీవల కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం ఆలస్యమవుతోందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా యానిమల్ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
యానిమల్ మూవీ విడుదల గురించి ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ నేడు ట్వీట్ చేశారు. ముందు నిర్ణయించిన తేదీ అయిన ఈ ఏడాది ఆగస్టు 11నే ఈ చిత్రం విడుదలవుతుందని స్పష్టం చేశారు. రూమర్లను నమ్మొద్దని సినీ అభిమానులకు చెబుతూ ట్వీట్ చేశారు.
“రణ్‍బీర్ కపూర్ యానిమల్ షెడ్యూల్ ప్రకారమే వస్తుంది. వాయిదా పడలేదు. రూమర్లను నమ్మొద్దు. రణ్‍బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కలిసి తొలిసారి చేసిన యానిమల్ మూవీ తప్పకుండా ఆగస్టు 11వ తేదీన థియేటర్లలోకి వస్తుంది” అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దీంతో ఆగస్టు 11వ తేదీన యానిమల్ విడుదల కావడం కచ్చితమని తేలిపోయింది. దీంతో పుకార్లకు చెక్ పడినట్టయింది.
యానిమల్ మూవీలో రణ్‍బీర్ సరసన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 11వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో యానిమల్ విడుదల కానుంది. భూషణ్ కుమార్ (టీ సిరీస్), మురాద్ ఖెతానీ (సినీ 1 స్టూడియోస్), ప్రణయ్ రెడ్డి వంగా (భద్రకాళి పిక్చర్స్) సంయుక్తంగా ఈ యానిమల్ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా, అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాలీవుడ్‍లో కబీర్ సింగ్‍గా తెరకెక్కించి 2019లో హిట్ సాధించారు డైరెక్టర్ సందీప్ వంగా. కబీర్ సింగ్‍లో షాహిద్ కపూర్ హీరోగా నటించారు.
మరోవైపు, ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీనే ఆక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఓ మై గాడ్ 2 (OMG 2) మూవీ విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు యానిమల్, ఓ మై గాడ్ 2 పోటీపడనున్నాయి.