Brahmastra Movie Review: బ్రహ్మాస్త్ర మూవీ రివ్యూ - విజువల్ వండర్ గా తెరకెక్కిన సినిమా ఎలా ఉందంటే-ranbir kapoor alia bhatt brahmastra movie review nagarjuna amitabh bachchan
Telugu News  /  Entertainment  /  Ranbir Kapoor Alia Bhatt Brahmastra Movie Review Nagarjuna Amitabh Bachchan
నాగార్జున
నాగార్జున (Twitter)

Brahmastra Movie Review: బ్రహ్మాస్త్ర మూవీ రివ్యూ - విజువల్ వండర్ గా తెరకెక్కిన సినిమా ఎలా ఉందంటే

09 September 2022, 12:29 ISTHT Telugu Desk
09 September 2022, 12:29 IST

Brahmastra Movie Review: ర‌ణ్‌భీర్‌క‌పూర్‌,అలియాభ‌ట్ జంట‌గా న‌టించిన చిత్రం బ్ర‌హ్మాస్త్ర‌. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో నేడు రిలీజైంది. దేశ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ సినిమా ఎలా ఉందంటే...

Brahmastra Movie Review: ఈ ఏడాది బాలీవుడ్ లో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. మైథలాజికల్ ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రియల్ లైఫ్ కపుల్ ర‌ణ్‌భీర్‌క‌పూర్‌, అలియాభట్ జంటగా నటించారు. ఈ జంట పెళ్లి తర్వాత విడుదలైన మొదటి సినిమా ఇదే. దాదాపు ఐదేళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ నిర్మించారు.

బాలీవుడ్ తో పాటు తెలుగులో నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజ్ కు ముందే ఎన్నో వివాదాలతో ఈ సినిమా హాట్ టాపిక్ గా నిలిచింది. పరాజయాలతో డీలా పడిన బాలీవుడ్ ను గట్టెక్కించే సినిమా ఇదని ఇండస్ట్రీ వర్గాలు బ్రహ్మాస్త్రపై బోలేడు ఆశలు పెట్టుకున్నాయి. వారి అంచనాల్ని ఈ సినిమా నిలబెట్టిందా? బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందా లేదా అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...

శివ, ఇషా ప్రేమాయణం...

శివ, ఇషా ప్రేమాయణం...

శివ (రణ్ భీర్ కపూర్) ఓ అనాథ. డీజేగా పనిచేస్తుంటాడు. ఓ పార్టీలో ఈషాను (అలియా భట్) కలుస్తాడు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. శివకు అగ్నితో అనుబంధం ఉంటుంది. తరచుగా కొన్ని కలలు అతడిని వెంటాడుతుంటాయి. వాటిలో దేవ్, జునూర్ (మౌని రాయ్) తో పాటు మరికొందరు అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తులు బ్రహ్మాస్త్రాన్ని చేజిక్కించుకొనే క్రమంలో తమకు అడ్డువచ్చిన వారందరిని చంపుతుంటారు.

దేవ్ మనుషుల్ని అడ్డుకునే క్రమంలో సైంటిస్ట్ మోహన్ భార్గవ్ చనిపోతాడు. మోహన్ భార్గవ్ ఎవరు? ఈ అతీంద్రియ శక్తులకు వ్యతిరేకంగా పోరాడే సంకల్పంలో శివ భాగస్వామిగా ఎందుకు మారాల్సివచ్చింది.అమిత్ శెట్టి (నాగార్జున) గురు (అమితాబ్ బచ్చన్) తో శివకు ఉన్న సంబంధం ఏమిటి? మూడు ముక్కలుగా విభజించబడిన బ్రహ్మాస్త్ర ఎవరి దగ్గర ఉంది. శివ, ఇషా ప్రేమకథకు ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయన్నదే ఈ చిత్ర కథాంశం.

సూపర్ హీరో కథతో..

హాలీవుడ్ తో పోలిస్తే ఇండియన్ స్క్రీన్ పై సూపర్ హీరో కథాంశాలతో చాలా తక్కువ సినిమాలొచ్చాయి. ఈ జానర్ లో రూపొందిన చిత్రమే బ్రహ్మాస్త్ర. భారతీయ పురాణాలకు ప్రేమకథ, యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించారు.

బ్రహ్మాస్త్రం కోసం పోరాటం..

అంత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని చేజిక్కించుకోవాలని కొన్ని అతీంద్రియ శక్తులు ప్రయత్నిస్తుంటాయి. ఆ అదృశ్య శక్తులను ఎదురించి పురాతన శక్తులను కాపాడుతున్న కొన్ని అస్త్రాలతో కలిసి శివ సాగించిన పోరాటం నేపథ్యంలో బ్రహ్మాస్త్ర కథను రాసుకున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. మైథలాజికల్ పాయింట్ ను భారీ గ్రాఫిక్స్ హంగులతో తెరపై ఆవిష్కరించారు. చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుంది. ఈ సినిమాలో అదే చూపించారు.

షారుఖ్ ఎంట్రీతో...

షారుఖ్ ఖాన్ గెస్ట్ ఎంట్రీతో బ్రహ్మాస్త్ర ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. శివ, ఇషాల ప్రేమకథతో సినిమా సరదాగా సాగిపోతుంటుంది. మరోవైపు జునూర్ బృందం బ్రహ్మాస్త్రం కోసం అన్వేషించే అంశాలతో సినిమా ఆసక్తిని పంచుతుంది. గ్రాఫిక్స్ మిళితం చేస్తూ వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. గురుజీ తో సహాయంతో బ్రహ్మాస్త్రాన్ని శివ ఎలా కాపాడాడో ద్వితీయార్థంలో చూపించారు.

నిడివి మైనస్...

2 గంటల 45 నిమిషాల నిడివితో ఈ సినిమాను రూపొందించారు. చాలా చోట్ల సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే శివ, ఇషాల ప్రేమకథ ఆసక్తికరంగా మలచలేకపోయారు. సెకండాఫ్ లో శివ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆకట్టుకోవు. కథలోని మలుపులు ఊహలకు అందే విధంగా ఉంటాయి. కథలో చాలా ట్విస్ట్ లు పెట్టిన దర్శకుడు వేటిని రివీల్ చేయకుండా సెకండ్ పార్ట్ లో చూడాల్సిందే అంటూ ముగించడం నిరాశ పరిచింది. చాలా చోట్ల సినిమా లాజిక్స్ కు దూరంగా సాగుతుంది.

ర‌ణ్‌భీర్‌ అలియా కెమిస్ట్రీ హైలైట్

శివ పాత్రలో రణ్ భీర్ కపూర్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. సూపర్ హీరో తరహా పాత్రలో చక్కటి నటను కనబరిచాడు. రణ్ భీర్, అలియా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు బలంగా నిలిచింది. అమిత్ శెట్టిగా నాగార్జున పవర్ ఫుల్ రోల్ లో కనిపించాడు.

తెలుగు ప్రేక్షకులను అతడి పాత్ర అలరిస్తుంది. అమితాబ్ బచ్చన్ పాత్ర నిడివి తక్కువే అయినా తన డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అదరగొట్టేశారు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో మౌనీ రాయ్ కనిపించింది. ఎనిమిదేళ్ల పాటు శ్రమించి అయాన్ ముఖర్జీ ఈ సినిమాను రూపొందించారు. కానీ అతడికి కష్టానికి పూర్తి స్థాయిలో ఫలితం దక్కలేదనే చెప్పాలి. కథ కంటే గ్రాఫిక్స్ పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. తాను అనుకున్న కథను అర్థవంతంగా చెప్పడంలో సఫలం కాలేకపోయారు. .

విజువల్స్ ఓకే కానీ...

యాక్టింగ్ పరంగా, టెక్నికల్ గా సినిమా బాగున్నా కథ, కథనాల విషయంలో డిసపాయింట్ చేస్తుంది. అవేవి పట్టించుకోకుండా రణ్ భీర్ అలియా కెమిస్ట్రీ, విజువల్స్ కోసం చూస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు.