Rana Daggubati: చట్టానికి లోబడే ఆ పని చేశా.. ఏ తప్పూ చేయలేదు: రానా దగ్గుబాటి వివరణ
Rana Daggubati: రానా దగ్గుబాటి వివరణ ఇచ్చాడు. తాను చట్ట వ్యతిరేక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానన్న ఆరోపణల నేపథ్యంలో తన టీమ్ ద్వారా అతడు ఓ ప్రకటనను విడుదల చేశాడు. అందులో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు.
Rana Daggubati: టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా దిగి వస్తున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు వివరణ ఇస్తున్నారు. తాజాగా రానా టీమ్ అతనిపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చింది. చట్టానికి లోబడే ఆ ఒప్పందం కుదుర్చుకున్నట్లు గురువారం (మార్చి 20) ఓ ప్రకటన విడుదల చేశారు.
రానా దగ్గుబాటి ప్రకటన ఇదీ..
ప్రతిభ ఆధారిత గేమ్స్ ఉన్న సంస్థతోనే రానా దగ్గుబాటి ఒప్పందం కుదుర్చుకున్నట్లు అతని టీమ్ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఇది 2017లోనే ముగిసిందని కూడా చెప్పంది. ఇలాంటి గేమ్స్ చట్టపరంగా అనుమతి ఉన్న ప్రాంతాలకే అతని ఎండార్స్‌మెంట్ పరిమితమని కూడా స్పష్టం చేసింది.
“ప్రతిభ ఆధారిత గేమ్స్ సంస్థతో రానా దగ్గుబాటి ఒప్పందం కుదర్చుకున్నాడు. ఇది 2017లోనే ముగిసింది. ఆన్‌లైన్ లో ప్రతిభ ఆధారిత గేమ్స్ కు చట్టపరంగా అనుమతి ఉన్న ప్రాంతాలకే అతని ఎండార్స్‌మెంట్ పరిమితమైంది. ఒప్పందాలు కుదుర్చుకునే ముందే రానా టీమ్ వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. చట్టపరమైన సమీక్ష తర్వాతే ఆ ఒప్పందం కుదుర్చుకున్నాడు. చట్టానికి లోబడే ఈ పని చేశాడు” అని అతని టీమ్ ఆ ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం కేసులు
రానా దగ్గుబాటి సహా 25 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు చట్టవ్యతిరేక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారంటూ తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అలాంటి తప్పుడు అభిప్రాయాలు కలగకూడదన్న ఉద్దేశంతోనే తాము ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆన్‌లైన్ గేమ్స్ కు గ్యాంబ్లింగ్ తో సంబంధం లేదని సుప్రీంకోర్టు కూడా గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆ ప్రకటనలో రానా టీమ్ తెలిపింది.
తెలంగాణ పోలీసులు రానా దగ్గుబాటితోపాటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి లాంటి వాళ్లపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. 32 ఏళ్ల వ్యాపారవేత్త పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
తప్పు చేశా.. క్షమించండి: ప్రకాష్ రాజ్
అటు ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎఫ్ఐఆర్ నమోదైన మరో నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించాడు. తాను 9 ఏళ్ల కిందట ఈ తప్పు చేశానని, క్షమించమని అడిగాడు. అందరినీ ప్రశ్నించే తాను సమాధానం ఇవ్వాల్సిందే అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో అతడు మాట్లాడుతూ.. తెలియక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానని, కొన్నాళ్ల తర్వాత అది తప్పని తెలిసి దూరంగా ఉన్నట్లు చెప్పాడు. 2016లో ఇది జరిగినట్లు తెలిపాడు.
సంబంధిత కథనం