ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక ఇతిహాసం 'రామాయణం' సినిమా నుంచి మొదటి అధికారిక గ్లింప్స్‌ను (Ramayana First Glimpse) దర్శకుడు నమిత్ మల్హోత్రా విడుదల చేశాడు. రణబీర్ కపూర్, యశ్ రామరావణ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలోని అద్భుతమైన విజువల్స్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఈ ఎవర్ గ్రీన్ కథను వెండితెరపై ఎలా చూపిస్తారనే ఉత్సాహాన్ని మరింత పెంచాయి. 'ఆదిపురుష్' లాంటి చేదు అనుభవం తర్వాత, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి అనడంలో సందేహం లేదు.
గురువారం (జులై 3) నాడు, నమిత్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటిస్తున్న 'రామాయణం' సినిమా మొదటి గ్లింప్స్‌ను పంచుకున్నాడు. వీడియోను షేర్ చేస్తూ, అతడు ఇలా రాశాడు. "పదేళ్ల ఆశయం. ఎవర్‌గ్రీన్ గొప్ప ఇతిహాసాన్ని ప్రపంచానికి తీసుకురావాలనే అకుంఠిత దీక్ష.
రామాయణాన్ని అత్యంత భక్తి, శ్రద్ధలతో సమర్పించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ నిపుణుల సహకారంతో వచ్చిన ఫలితం. ఇది ఆరంభం మాత్రమే. రామ v/s రావణుడి అమర గాథను మనం ఇప్పుడు జరుపుకుందాం. మన నిజం. మన చరిత్ర" అనే క్యాప్షన్ తో టైటిల్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశాడు.
ఈ వీడియోలో యశ్‌ను రావణుడిగా తీవ్రమైన, కోపంగా ఉన్న లుక్‌లో చూపిస్తే, రణబీర్ కపూర్‌ను శ్రీరాముడిగా ప్రశాంతంగా, సంయమనంతో ఉన్నట్లుగా చూపించారు. అలాగే బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు కూడా ఈ గ్లింప్స్‌లో కనిపించడం సినిమా భారీ పౌరాణిక నేపథ్యాన్ని సూచిస్తుంది. శక్తివంతమైన విజువల్స్‌తో పాటు, రణబీర్ విల్లు, బాణంతో చేసే విన్యాసాలు కనిపించడం, రాముడు, రావణుల మధ్య జరగబోయే మహా యుద్ధానికి సన్నాహాలుగా ఉన్నాయి.
రణబీర్, యశ్ లుక్స్ అభిమానులను ఆకట్టుకోగా, ఈ వీడియోలోని వీఎఫ్‌ఎక్స్ (VFX) అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక అభిమాని "3000 కోట్లు లోడింగ్..." అని కామెంట్ చేయగా, మరొకరు "ఈ కళాఖండాన్ని చూడటానికి వేచి ఉండలేను" అని రాశారు. ఇంకొక అభిమాని "హాలీవుడ్ దీని ముందు ఏమీ కాదు" అని పేర్కొన్నారు. వేరొకరు "ఎంత అద్భుతమైన VFX" అని వ్యాఖ్యానించారు.
ఈ సినిమాకు ఇద్దరు ఆస్కార్ విన్నర్స్ హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటం మరో హైలైట్. దాని ప్రభావం ఈ గ్లింప్స్ వీడియోలో స్పష్టంగా కనిపించింది. బీజీఎం మరో లెవెల్లో ఉంది. ఆ వీడియోకు తగినట్లుగా ఈ మ్యూజిక్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఐమ్యాక్స్ ఫార్మాట్లో తీస్తుండటంతో థియేటర్లో ఈ బీజీఎం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతోంది.
నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం మూవీలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు.
మొదటి గ్లింప్స్‌ను విడుదల చేసిన తర్వాత, 'రామాయణం' బృందం ఒక 7 నిమిషాల నిడివి గల విజువల్ షోరీల్‌ను కూడా ప్రదర్శించనుంది. ఈ రామాయణం మూవీ వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కాబోతోంది.
సంబంధిత కథనం