Ramanna Youth Movie Review: రామన్న యూత్ రివ్యూ - అభయ్ బేతిగంటి పొలిటికల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Ramanna Youth Movie Review: అభయ్ బేతిగంటి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా రామన్న యూత్. యూత్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...

Ramanna Youth Movie Review: బలగం, దసరాతో పాటు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ఈ నేపథ్యంలో వచ్చిన మరో సినిమా రామన్న యూత్. పెళ్లిచూపులు ఫేమ్ అభయ్ బేతిగంటి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 15న) థియేటర్లలో విడుదలైంది.
రామన్న యూత్ సినిమాలో అమూల్యరెడ్డి, తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, అనీల్ గీలా ప్రధాన పాత్రల్లో నటించారు. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన అభయ్ బేతిగంటి ప్రేక్షకుల్ని మెప్పించాడా? లేదా? అన్నది చూద్దాం...
రాజు లక్ష్యం...
రాజు (అభయ్ బేతిగంటి) ఎలాంటి బరువుబాధ్యతలు లేని యువకుడు. స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. పొలిటికల్ లీడర్ కావాలన్నది అతడి కల. ఓ మీటింగ్‌లో రాజును అప్యాయంగా పలకరిస్తాడు సిద్ధిపేట ఎమ్మెల్యే రామన్న. ఎమ్మెల్యే మాటలతో రాజు పొంగిపోతాడు.
తనతో పాటు తన తండ్రి గురించి ఎమ్మెల్యేకు బాగా తెలుసునని భ్రమపడతాడు. ఎమ్మెల్యేపై అభిమానంతో అతడి పేరు మీద రామన్న యూత్ అసోసియేషన్‌ను ఏర్పాటుచేస్తాడు. ఊరిలో దసరా పండుగ సందర్భంగా పెద్ద ఫ్లెక్సీ పెట్టిస్తాడు రాజు. ఆ ఫ్లెక్సీ సాఫీగా సాగిపోతున్న రాజు జీవితంలో ఎలాంటి గందరగోళాన్ని సృష్టించింది.
రాజుపై ఊరి సర్పంచ్ (తాగుబోతు రమేష్) తమ్ముడు మహిపాల్ (టాక్సీవాలా విష్ణు) ఎందుకు ద్వేషాన్ని పంచుకున్నాడు? సర్పంచ్ అండ లేకుండా డైరెక్ట్‌గా ఎమ్మెల్యేను కలుస్తానని మహిపాల్‌తో ఛాలెంజ్ చేసిన రాజు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా? ఎమ్మెల్యేను కలవడం కోసం హైదరాబాద్ వచ్చిన రాజు ఎందుకు జైలుపాలయ్యాడు? స్వప్న( అమూల్యరెడ్డి)ను ప్రేమించిన రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నదే రామన్న యూత్ సినిమా కథ.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్...
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రామన్న యూత్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అభయ్ బేతిగంటి. పల్లెటూళ్లలో రాజకీయాలు ఎలా ఉంటాయి? తమ స్వార్థం కోసం యువతను నాయకులు ఎలా వాడుకుంటున్నారు? నాయకుల మాటలు, మాయలో పడి యువతరం తమ జీవితాల్ని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారన్నది సీరియస్‌గా కాకుండా కామెడీతో సున్నితంగా రామన్న యూత్ సినిమాలో చూపించారు అభయ్.
కామెడీ వర్కవుట్...
తెలంగాణ నేటివిటీ ఈ సినిమాకు ప్లస్సయింది. పల్లెటూళ్లలోని యూత్ లైఫ్‌స్టైల్‌ను, వారి ఆలోచనల తీరును అభయ్‌తో పాటు అతడి ఫ్రెండ్స్ అనీల్ గీలా, జగన్ యోగిబాబు, బన్నీ అభిరామ్ పాత్రల ద్వారా రియలిస్టిక్‌గా చూపించారు. వారి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ థియేటర్లలో నవ్వులను పూయిస్తాయి.
డైలాగ్స్ విషయంలో సినిమాటిక్‌గా కాకుండా సహజంగా ఉండేలా జాగ్రత్త పడ్డ తీరు బాగుంది. ఎక్కడ ఓ సినిమా చూస్తున్న ఫీల్ కాకుండా పల్లె జీవితాన్ని వాస్తవిక కోణంలో కొంత వరకు చూపించగలిగారు దర్శకుడు.
పాయింట్ మంచిదే కానీ...
రామన్న యూత్ ద్వారా దర్శకుడు అభయ్ చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. నాయకులు కావాలనే భ్రమలో ఇబ్బందులు పడే చాలా మంది యువత జీవితాల స్ఫూర్తితో కామన్ పాయింట్‌తో రామన్న యూత్ కథ రాసుకున్నాడు. కానీ తాను అనుకున్న మెసేజ్‌ను కన్వీన్సింగ్‌గా ఆడియెన్స్ చెప్పడంలో కాస్తంత తడబడ్డాడు.
ఎమ్మెల్యేను కలవాలని రాజు చేసే ప్రయత్నాల్లో ఎమోషన్స్, సంఘర్షణ సరిగా పండలేదు. కమర్షియల్ హంగుల కోసం మధ్యలో లవ్ స్టోరీని మధ్యలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కూడా ఊహలకు అందేలానే ఉంటుంది.
తన ఆలోచనల నుంచి…
ఈ సినిమాకు తానే దర్శకుడు కావడం వల్ల రాజు పాత్రలో అభయ్ ఒదిగిపోయాడు. తన ఆలోచనల నుంచి పుట్టిన ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో ఫన్, సెకండాఫ్‌లో ఉద్వేగభరితంగా సాగే పాత్రలో చక్కటి నటననకు కనబరిచాడు. రాజు స్నేహితుల్లో అనీల్ గీలా కామెడీ టైమింగ్ బాగుంది. రాజకీయాల మాయలో యువత పడొద్దని మంచి చెప్పే సర్పంచ్‌గా తాగుబోతు రమేష్, ఎమ్మెల్యే రామన్నగా శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్‌లో టాక్సీవాలా విష్ణు కనిపించాడు.
టైమ్‌పాస్...
రామన్న యూత్ సింపుల్ మెసేజ్‌తో తెరకెక్కిన తెలంగాణ బ్యాక్‌డ్రాప్ మూవీ. కామెడీ పరంగా ఫుల్ టైమ్‌పాస్ చేస్తుంది.
రేటింగ్: 2.5/5