Rama Ayodhya: అయోధ్య రామమందిరంపై తెలుగు మూవీ - డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్!
Rama Ayodhya: అయోధ్యలోని రామ మందిరంపై తెలుగులో ఓ డాక్యుమెంటరీ మూవీ రాబోతోంది. రామ అయోధ్య పేరుతో తెరకెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Rama Ayodhya: అయోధ్య రామమందిరంపై తెలుగులో డాక్యుమెంటరీ మూవీ రాబోతుంది. ఈ డాక్యుమెంటరీ మూవీకి రామ అయోధ్య అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ డాక్యుమెంటరీ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ అయోధ్య స్ట్రీమింగ్ వివరాలను ఆహా ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది.
ఏప్రిల్ 17 నుంచి...
శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17 నుంచి ఆహా ఓటీటీలో రామ అయోధ్య డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. బాలసుందరం శ్రీ రామమందిరం. ఈ శ్రీరామనవమికి అయోధ్య రామయ్య మీ ఇంటికి అంటూ ట్వీట్ చేస్తూ రామ అయోధ్య స్ట్రీమింగ్ వివరాలను ఆహా ఓటీటీ వెల్లడించింది.
రామ అయోధ్య డాక్యుమెంటరీ మూవీకి నేషనల్ వార్డ్ విన్నర్ సత్య కాశీ భార్గవ రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా వ్యవహరించారు. కృష్ణ దర్శకత్వం వహించాడు.గతంలో కిట్టు అనే యానిమేటేడ్ మూవీతో సత్యకాశీ భార్గవ గతంలో నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. శ్రీమాన్ రామా పేరుతో ఓ యానిమేటెడ్ మూవీని రూపొందించాడు.
ప్రపంచానికి తెలియని విషయాలు…
అయోధ్య రామ మందిరం గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఈ రామ అయోధ్య మూవీలో రచయిత సత్య కాశీ భార్గవ, డైరెక్టర్ కృష్ణ కలిసి చూపించబోతున్నారు. శ్రీరాముడిని జన్మభూమిగా పేరొందిన అయోధ్య పట్టణ విశేషాలతో పాటు హిందువులకు ఆ నగరంతో ముడిపడిన భక్తి బంధాన్ని రామ అయోధ్యలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే అయోధ్య రామ మందిరం నిర్మాణ విశేషాలను క్షుణ్ణంగా ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలిసింది.
రామ మందిరం ప్రత్యేకతలు...
అయోధ్య రామ మందిరం నిర్మాణంలోని ప్రత్యేకతలు, తీసుకున్న జాగ్రత్తలు, ఆలయ సౌందర్యం, విశిష్టత అన్నింటిని ఈ డాక్యుమెంటరీ మూవీలో దర్శకనిర్మాతలు చర్చించనున్నట్లు సమాచారం. అయోధ్య రామ మందిరాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని అందించే డాక్యుమెంటరీ మూవీ ఇదని మేకర్స్ చెబుతున్నారు.
జనవరిలో ప్రాణ ప్రతిష్ట...
అయోధ్య రామ మందిరానికి ఈ ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ట జరిగింది. ఈ ఆలయ్యంలో 51 అడుగుల పొడవైన బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధాని మోదీ సహ దేశంలోని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తొలిరోజు ఏకంగా ఐదు లక్షలకుపైగా భక్తులు రామ మందిరాన్ని దర్శించుకున్నారు. రామ మందిర నిర్మాణానికి 2020లో భూమి పూజ చేశారు. మొత్తం 2.77 ఏకరాల విస్తీర్ణంలో రెండు అంతస్థులతో రామ మందిరాన్ని నిర్మించారు. ఇనుము వాడకుండా పూర్తిగా సంప్రదాయ శైలిలో ఈ అలయాన్ని నిర్మించారు.