Double Ismart: డిజాస్టర్ అయిన తెలుగు సినిమాకు హిందీలో యూట్యూబ్‍లో భారీ వ్యూస్!
Double Ismart: థియేటర్లలో డిజాస్టర్ అయిన కొన్ని తెలుగు చిత్రాలు.. హిందీ డబ్బింగ్‍లో దుమ్మురేపుతుంటాయి. యూట్యూబ్‍లో భారీ వ్యూస్ సాధిస్తుంటాయి. ఇదే మరోసారి రిపీట్ అయింది. ఓ ప్లాఫ్ మూవీకి హిందీలో భారీ వ్యూస్ దక్కుతున్నాయి.
తెలుగు సినిమాలకు ఉత్తరాదిలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందుకే తెలుగు చిత్రాలు.. ఇతర భాషల్లోనూ డబ్బింగ్ అయి దేశవ్యాప్తంగా దుమ్మురేపుతున్నాయి. టాలీవుడ్‍లో పాన్ ఇండియా రేంజ్ చిత్రాల సంఖ్య పెరిగిపోతోంది. ఇండియా మొత్తం టాలీవుడ్‍వైపే చూస్తోంది. అయితే, డిజాస్టర్ అయిన కొన్ని తెలుగు చిత్రాలు కూడా హిందీ డబ్బింగ్‍లో యూట్యూబ్‍లో సత్తాచాటుతుంటాయి. గతంలోనూ కొన్ని సినిమాల విషయంలో ఇలా జరిగింది. ప్లాఫ్ అయిన చిత్రాలకు హిందీ డబ్బింగ్‍లో భారీ వ్యూస్ దక్కాయి. ఇప్పుడు మరోసారి ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా విషయంలో అదే రిపీట్ అయింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం హిందీ డబ్బింగ్ యూట్యూబ్‍లో ఓ భారీ మైల్‍స్టోన్ దాటి ఆశ్చర్యపరిచింది.
100 మిలియన్ వ్యూస్ క్రాస్
డబుల్ ఇస్మార్ట్ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్.. ఆర్‌కేడీ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానెల్‍లో 100 మిలియన్ (10 కోట్లు) వ్యూస్ దాటేసింది. తాజాగా ఈ మార్క్ అధిగమించింది. ఏకంగా మిలియన్‍కు పైగా లైక్స్ ఉన్నాయి. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ చిత్రం యూట్యూబ్‍లో మాత్రం ఈ రేంజ్‍లో అదరగొడుతోంది. ఆ ఛానెల్‍లో గత నెల డిసెంబర్ 11న డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ అప్‍లోడ్ అయింది. అప్పుడే 100 మిలియన్ వ్యూస్ దాటి అవాక్కయ్యేలా చేసింది.
భారీ బాక్సాఫీస్ డిజాస్టర్
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో రామ్ పోతినేని హీరోగా నటించారు. 2019లో వచ్చి బ్లాక్‍బస్టర్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి రీమేక్ కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గతేడాది 2024 ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజైంది. పాన్ ఇండియా రేంజ్‍లో విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి భారీ పరాజయం ఎదురైంది. ముందు నుంచి ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
డబుల్ ఇస్మార్ట్ సినిమా సుమారు రూ.90కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనా. ఈ సినిమా మొత్తంగా దాదాపు రూ.18కోట్ల కలెక్షన్లలనే దక్కించుకోగలిగింది. అల్ట్రా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ప్రొడ్యూజ్ చేశారు. లైగర్ మూవీతో భారీ నష్టపోయిన పూరికి డబుల్ ఇస్మార్ట్ మరింత ఎదురుదెబ్బ కొట్టింది.
డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్‍గా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజత్ దత్ విలన్ పాత్ర చేశారు. షాయాజీ షిండే, అలీ, బానీ, మకరంద్ దేశ్‍పాండే, ఝాన్సీ, ఉత్తేజ్, టెంపర్ వంశీ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.
డబుల్ ఇస్మార్ట్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీలో జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం