Ram Nri Review: రామ్ ఎన్ఆర్ఐ రివ్యూ - బిగ్‌బాస్ అలీ రెజా ఫ్యామిలీ డ్రామా మూవీ ఎలా ఉందంటే?
Ram Nri Review: బిగ్‌బాస్ అలీ రెజా, సీతానారాయణన్ జంటగా నటించిన రామ్ ఎన్ఆర్ఐ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఎన్ లక్ష్మీనందా దర్శకత్వం వహించాడు.

ఎన్ఆర్ఐ కథ…
రామ్ అలియాస్ రామచంద్ర (అలీ రెజా) ఓ ఎన్ఆర్ఐ. తల్లిదండ్రులు, స్నేహితులు చాలా మంది ఉన్నా ఒంటరిగానే ఫీలవుతాడు. అనుబంధాలు, ఆప్యాయతల్ని వెతుక్కుంటూ అమెరికా నుంచి కోనసీమ...కృష్ణపురంలోని తాతయ్య (విజయ్ చందర్), అమ్మమ్మ (గీతాంజలి) ఇంటికొస్తాడు. స్రవంతి (సీతా నారాయణన్) అనే బ్యాంక్ ఎంప్లాయ్‌తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు రామ్.
మామయ్యతో (సూర్య) ఓ జరిగిన గొడవలో అతడి తల్లిదండ్రుల గురించి షాకింగ్ నిజం బయటపడుతుంది? అదేమిటి? నిజమైన సంతోషం డబ్బులో లేదనే నిజం రామ్ ఎలా తెలుసుకున్నాడు? స్రవంతితో రామ్ ప్రేమాయాణానికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అన్నదే రామ్ ఎన్ఆర్ఐ మూవీ కథ.
డబ్బులోనే ఆనందం...
నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది డబ్బు వెంట పరిగెడుతూ ఫ్యామిలీ విలువల్ని, అనుబంధాలను విస్మరిస్తోన్నారు. సొంతవాళ్లకు కొద్ది పాటు టైమ్ కూడా కేటాయించలేకపోతున్నారు. డబ్బులోనే ఆనందం ఉందని నమ్ముతున్నారు. కానీ అవన్నీ అపోహలనీ కన్నవాళ్లతో పుట్టిన ఊరిలో కష్టసుఖాల్ని పంచుకుంటూ జీవితాన్ని వెళ్లదీయడంలోనే అసలైన సంతోషం దాగిఉంటుందనే పాయింట్‌తో దర్శకుడు ఎన్ లక్ష్మీనందా ఈ మూవీని తెరకెక్కించాడు. తాము పుట్టిన ఊరి కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి చేయాలనే సందేశాన్ని ఇచ్చారు.
కుటుంబ విలువలకు కామెడీ, లవ్‌స్టోరీ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ డైరెక్టర్ ఈ కథను రాసుకున్నారు. నవ్విస్తూనే తాను చెప్పాలనుకున్న మెసేజ్‌ను చూపించారు. కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగుతుంది. అక్కడక్కడ ఒకటి రెండు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా చాలా వరకు క్లీన్ కామెడీతో ఈ మూవీ సాగుతుంది.
అమెరికాలో మొదలై కోనసీమలో ఎండ్...
రామ్ అమెరికా లైఫ్‌తోనే ఈ మూవీ మొదలై కోనసీమ జర్నీతో డైరెక్టర్ ఈ మూవీని ఎండ్ చేశాడు. అమెరికాలో తల్లిదండ్రుల నిరాదరణకు గురైన రామ్ తనలో తాను పడే సంఘర్షణ చుట్టూ ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. రామ్ కోనసీమలో అడుగుపెట్టినప్పటినుంచే అసలైన కథ మొదలవుతుంది.
ఒంటరితనంతో ఫీలవుతోన్న రామ్‌లో ఎలా మార్పు వచ్చింది, స్రవంతితో అతడి ప్రేమాయణం సరదాగా మొదలై ఎలా సీరియస్ మోడ్‌లోకి వెళ్లిందన్నది డ్రామా, రొమాన్స్ కలగలిపి చెప్పాడు డైరెక్టర్. సెకండాఫ్‌లో హీరో క్యారెక్టర్‌కు సంబంధించి వచ్చే ట్విస్ట్ బాగుంది. కథ ఎమోషనల్ టర్న్ తీసుకోవడానికి దర్శకుడు ఆ మలుపును చక్కగా వాడుకున్నాడు. రొటీన్ క్లైమాక్స్‌తో డైరెక్టర్ ఈ మూవీని ఎండ్ చేశాడు.
ప్రెడిక్టబుల్ స్క్రీన్‌ప్లే...
ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ప్రెడిక్టబుల్ స్క్రీన్‌ప్లేతో కొన్ని చోట్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. రామ్‌కు, అతడి గ్రాండ్ పేరెంట్స్‌కు మధ్య ఎమోషన్స్, ఆ బాండింగ్ ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది.
కామెడీ టైమింగ్...
రామ్ పాత్రలో అలీ రెజా యాక్టింగ్ ఒకే. పల్లెటూరికి వచ్చిన ఎన్ఆర్ఐ పాత్రలో నవ్విస్తూనే ఎమోషన్స్ పడించాడు. సీతానారయణన్ గ్లామర్ పరంగా మెప్పించింది. కానీ యాక్టింగ్‌లో అంతగా పరిణతి చూపించలేకపోయింది. సీనియర్ నటులు విజయ్ చందర్, గీతాంజలి తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. హీరోతో వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ బాగున్నాయి. సూర్య, జయవాణి, ఫణితో పాటు మిగిలిన వారు పర్వాలేదనిపించారు. శ్రవణ్ మ్యూజిక్‌లో ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
మెసేజ్ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్
రామ్ ఎన్ఆర్ఐ మెసేజ్‌తో కూడిన ఫ్యామిలీ డ్రామా మూవీ. కుటుంబ వర్గాలను కొంత వరకు ఈ మూవీ మెప్పిస్తుంది.
రేటింగ్: 2.5/5