RGV Jail Sentence: రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు.. ఆ పని చేయకపోతే మరో మూడు నెలలూ జైల్లోనే..
RGV Jail Sentence: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష విధించింది ముంబై కోర్టు. 2018లో అతనిపై నమోదైన కేసులో ఇప్పుడు శిక్ష పడటం గమనార్హం. అయితే అతడు అదనంగా మరో మూడు నెలలు కూడా జైలు శిక్ష ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది.
RGV Jail Sentence: రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య మరోసారి తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ మధ్యే సత్య రీరిలీజ్ సందర్భంగా అతడు ఎక్స్ అకౌంట్ ద్వారా చేసిన రెండు భారీ పోస్టులు వైరల్ కాగా.. ఇప్పుడు ఓ చెక్ బౌన్స్ కేసులో అతనికి మూడు నెలల జైలు శిక్ష పడటం కూడా సంచలనం రేపుతోంది. గురువారం (జనవరి 23) ఓ ముంబై కోర్టు అతనికి మూడు నెలల శిక్ష విధించింది.

ఆర్జీవీకి జైలు శిక్ష
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2018నాటి ఓ చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్నాడు. మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే సంస్థ ద్వారా 2018లో ఆర్జీవీపై చెక్ బౌన్స్ కేసు పెట్టారు. దీనికి సంబంధించి తాజాగా కోర్టు తన తీర్పు చెప్పింది. నిజానికి 2022లోనే వర్మను దోషిగా ముంబై కోర్టు తేల్చింది. అయితే అప్పుడు రూ.5 వేల పూచీకత్తుతో బెయిల్ సంపాదించాడు. కొవిడ్ సమయంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న రామ్ గోపాల్ వర్మ తన ఆఫీసు కూడా అమ్ముకున్నాడు.
అంతకుముందే నమోదైన చెక్ బౌన్స్ కేసు ఇది. ఈ కేసులో అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఆర్జీవీని దోషిగా తేల్చింది. ఫిర్యాదుదారుకు రూ.3.72 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ ఆ మొత్తం చెల్లించలేకపోతే అతడు అదనంగా మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించే ప్రమాదం కూడా ఉంది. మరి ఈ శిక్షపై ఆర్జీవీ ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఆర్జీవీ సిండికేట్ మూవీ
ఇక ఈ మధ్యే సత్య రీరిలీజ్ సందర్భంగా ఎమోషనల్ అయిన రామ్ గోపాల్ వర్మ.. ఇక నుంచి ఓ కొత్త వర్మను చూస్తారని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే సిండికేట్ పేరుతో తన కెరీర్లోనే అతిపెద్ద మూవీ తీయబోతున్నట్లు బుధవారం (జనవరి 22) ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ""అత్యంత భయానక జంతువు కేవలం మనిషి మాత్రమే" సత్య ఫిల్మ్ కన్ఫెషన్ నోట్ కు కొనసాగింపుగా నేను ఇప్పటి వరకూ లేనంత అతిపెద్ద మూవీని తీయాలనుకుంటున్నాను.
ఈ సినిమా పేరు సిండికేట్. ఇది అసలు ఇండియా ఉనికినే ప్రశ్నార్థకం చేయాలని చూసే ఓ సంస్థపై తీస్తున్న మూవీ" అంటూ ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది కూడా తన సుదీర్ఘ పోస్టులో అతడు వివరించాడు.
ఈ భూమ్మీద మనిషిని మించిన భయానక జంతువు మరొకటి లేదన్న సందేశంతోనే ఈ సిండికేట్ మూవీ మొదలవుతుందని కూడా అతడు తెలిపాడు. ఇండియాను ఓ కొత్త ఇండియాతో భర్తీ చేయాలన్నదే ఈ సిండికేట్ లక్ష్యమని, ఇదొక భయానక మూవీ అని కూడా రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశాడు. ఈ మూవీలో నటించబోయే నటీనటులు, ఇతర వివరాలను త్వరలోనే అనౌన్స్ చేస్తానని కూడా అతడు చెప్పాడు.