Ram Gopal Varma: ఆ తెలుగు స్టార్ హీరో డబ్బులిచ్చి తన సినిమా థియేటర్లలో ఆడించాడన్న ఆర్జీవీ.. ఆ హీరో అతడే అంటూ కామెంట్స్
Ram Gopal Varma: ఓ తెలుగు స్టార్ హీరో తన సినిమాను థియేటర్లలో ఆడించడానికి తన సొంత డబ్బులు పెట్టాడంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ హీరో ఎవరన్న చర్చ నడుస్తోంది.
Ram Gopal Varma: తన సినిమాలతోనే కాదు వివాదాస్పద కామెంట్స్, ట్వీట్స్, ఇంటర్వ్యూలతోనూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అతడు ఈ మధ్య గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలపై స్పందించాడు. అలాగే సినిమాల్లో ప్రొడ్యూసర్లు ఇక లేరని, కార్పొరేట్లు రాజ్యమేలుతున్నాయన్న చర్చపై స్పందిస్తూ ఓ హీరోపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆ హీరో ఎవరు?
తెలుగుతోపాటు హిందీలోనూ ఎన్నో సంచలన హిట్ సినిమాలు అందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యే గలాటా ప్లస్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ఇండియన్ సినిమా గురించి ఎన్నో అంశాలపై స్పందించాడు. మైథలాజికల్ సినిమాలు, మలయాళ సినిమాలు మారిన తీరు, స్టార్ డైరెక్టర్లులాంటి అంశాలపై అతడు మాట్లాడాడు. ఈ సందర్భంగా సినిమాల్లో ప్రొడ్యూసర్లు పోయి కార్పొరేట్లు వచ్చిన తీరుపైనా ఆర్జీవీ స్పందించాడు.
నిజానికి ఒక్క తెలుగు సినిమాలోనే ఇప్పటికీ వ్యక్తులు ప్రొడ్యూసర్లుగా ఉన్నారని, బాలీవుడ్, హాలీవుడ్ లలో కార్పొరేట్ కంపెనీలే సినిమాలను నిర్మిస్తున్నాయని అతడు చెప్పాడు. తెలుగులో ఇక్కడి హీరోలు కార్పొరేట్లను ఇష్టపడరని, అందుకే ఇక్కడ ఇంకా ప్రొడ్యూసర్లు ఉన్నట్లు అతడు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా దానికి కారణమేంటో కూడా అతడు వివరించాడు.
"ఓసారి ఓ తెలుగు హీరో సినిమాను బాంబే నుంచి ఓ కార్పొరేట్ కంపెనీ వచ్చి నిర్మించింది. ఒక దశలో ఆ సినిమా వసూళ్లు పడిపోయాయి. థియేటర్లలో నుంచి సినిమాను తీసేయాలని ఆ కంపెనీ భావించింది. కానీ అది తమ హీరోకు అవమానం అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో సదరు హీరోనే ఆ కార్పొరేట్ కంపెనీకి ఫోన్ చేసి తన సొంత డబ్బులతో ఆ సినిమాను ఒక దశ వరకు నడిపిస్తానని చెప్పాడు" అని ఆర్జీవీ అనడం గమనార్హం. దీంతో ఆ హీరో ఎవరు అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. అతడు ప్రభాసే అని పలువురు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
మలయాళం అంటే సెక్స్ సినిమాలే అనేవాళ్లు
ఇక ఇదే ఇంటర్వ్యూలో మలయాళ సినిమా ఎదిగిన తీరును కూడా ఆర్జీవీ ప్రశంసించాడు. ఒకప్పుడు ఆ ఇండస్ట్రీ అంటే కేవలం సెక్స్ సినిమాలే అనేవాళ్లని ఈ సందర్భంగా అతడు అనడం విశేషం. "వరుసగా కొన్ని ఊహించని సినిమాలు వచ్చి హిట్ అయితే అది మొత్తాన్ని మార్చేస్తుంది.
ఒకప్పుడు మలయాళం సినిమా అంటే సెక్స్ సినిమాలే అనుకునే వాళ్లం. నేను విజయవాడలో ఇంజినీరింగ్ చదివే రోజుల్లో మలయాళం సినిమాలు చూసేవాన్ని కాదు. ఎందుకంటే అందులో ఏ ఇండస్ట్రీలోనూ ఉండని సెక్స్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం బెస్ట్ సినిమాలు మలయాళం ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయి" అని ఆర్జీవీ అన్నాడు.
ఇదే ఇంటర్వ్యూలో హాలీవుడ్ లాంటి సినిమాలను మన వాళ్లు ఎందుకు తీయలేకపోతున్నారనే అంశంపై అతడు స్పందించాడు. అంతేకాదు పురాణ, ఇతిహాసాల సినిమాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని కూడా అతడు చెప్పాడు.