డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే.. వివాదాస్పద సినిమాలు, సెన్సేషనల్ ట్వీట్లు, అదుపులేని కామెంట్లు అని ప్రస్తుత తరానికి చెందిన యూత్ చాలా మంది అనుకుంటుంటారు. ఆయనను అలాగే చూస్తుంటారు. అయితే ఒకప్పుడు భారత సినీ ఇండస్ట్రీ ట్రెండ్‍నే మార్చేసిన ఘనత ఆర్జీవీ సొంతం. గతంలో ఏదైనా రంగంలో గణనీయమైన మార్పులకు నాంది పలికిన వారిని ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‍స్టర్) అని ఇప్పటి తరం పిలుస్తుంటుంది. ఇది ఆర్జీవీకి సరిగ్గా సూటవుతుంది. ఒకరకంగా ఇండియన్ ఇండస్ట్రీలోనే సినిమాలు తీసే పద్ధతిలో దశనే మార్చేశారు ఈ రామ్ గోపాల్ వర్మ. టాలీవుడ్‍తో పాటు బాలీవుడ్‍ను షేక్ చేశారు. ఆర్జీవీ పేరు అనేది బ్రాండ్‍లా మారి మారుమోగిపోయింది. ఆయన గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి.
తెలుగు సినిమా చరిత్రలో ‘శివ’ ఓ రెవల్యూషన్ అని చెప్పవచ్చు. తన తొలి సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. 1989లో నాగార్జున హీరోగా ఆర్జీవీ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. రియాలిటీకి దగ్గరగా కాలేజీ గొడవలతో తెలుగులో సినిమా రావడం అదే తొలిసారి. ఈ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్, స్టైలిష్ యాక్షన్ అప్పట్లో అందరికీ కొత్త అనుభూతిని పంచాయి. అంతకు ముందెప్పుడూ చూడని సినిమాను చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది. ఈ సినిమాలో చాలా సీన్లు ఐకానిక్‍గా నిలిచిపోయాయి. సౌండ్ డిజైన్ విషయంలో ఆర్జీవీ తన ముద్రను బలంగా వేశారు.
శివ చిత్రం తర్వాత తెలుగు సినిమాల తీరే మారిపోయింది. అంతలా ఆ మూవీ ప్రభావాన్ని చూపింది. చాలా మంది యువ దర్శకులు ఈ చిత్రంతో ఇన్‍ఫ్లుయెన్స్ అయ్యారు. శివ ఓ సినిమాలానే కాకుండా ఓ రెవల్యూషన్‍లా చాలా మంది పరిగణిస్తారు. నాగార్జునకు కూడా ఈ మూవీ స్టార్ హీరో ఇమేజ్ తీసుకొచ్చింది. భారత సినీ చరిత్రలో శివ ఓ పాఠంలో, క్లాసిక్‍గా నిలిచిపోయింది. తొలి సినిమాతోనే ఇండియా వ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మ అనే పేరు మారుమోగింది. హిందీలోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు ఈ డైరెక్టర్.
వెంకటేశ్‍తో ఆర్జీవీ తెరకెక్కించిన క్షణక్షణం (1991) కూడా బ్లాక్‍బస్టర్ సాధించింది. ఆ తర్వాత ద్రోహి, రాత్ చిత్రాలతో బాలీవుడ్‍లోనూ హవా చూపారు ఆర్జీవీ. బాలీవుడ్ మూవీ రాత్ (1992)తో హారర్ జానర్లో కొత్త తరహా స్టైల్‍ను ఇండియన్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గాయం, గోవింద గోవింతతో తెలుగులో తన విజయాలను ఆర్జీవీ కంటిన్యూ చేశారు.
ఆమిర్ ఖాన్, ఊర్మిళ మతోంద్కర్ హీరోహీరోయిన్లుగా ఆర్జీవీ తెరకెక్కించిన రంగీలా (1995) అప్పట్లో బాలీవుడ్‍ను షేక్ చేసింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ హిందీ జనాలను ఊపేసింది. రామ్‍గోపాల్ వర్మ కెరీర్లో సత్య (1998) మూవీ చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రంతో ముంబై అండర్ వరల్డ్ గురించి జనాలకు ధైర్యంగా చూపించారు ఆర్జీవీ. ఫిల్మ్ మేకింగ్‍తో క్రైమ్ చిత్రాల్లో తన మార్క్ నరేషన్, టేకింగ్‍తో ఆశ్చర్యపరిచారు. జేడీ చక్రవర్తి, ఊర్మిళ మతోంద్కర్, మనోజ్ బాజ్‍పేయి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ బ్లాక్‍బస్టర్ సాధించింది.
మోహన్‍లాల్, అజయ్ దేవ్‍గన్, మనీషా కొయిరాల ప్రధాన పాత్రల్లో ఆర్జీవీ తెరకెక్కించిన కంపెనీ (2002) కూడా అప్పట్లో ఓ సెన్సేషనే. హారర్ మూవీ భూత్ కూడా ప్రేక్షకులను భయపెట్టి హిట్ అయింది. ఈ మూవీలో ఆర్జీవీ వాడిన కెమెరా టెక్నిక్స్, సౌండ్ డిజైన్ ప్రత్యేకంగా నిలిచాయి. ఇండియాలోనే టాప్ డైరెక్టర్ స్థాయికి ఆర్జీవీ చేరుకున్నారు. అప్పట్లోనే బాలీవుడ్‍ను ఏలేశారు. ఆయన స్టార్ డమ్ తారస్థాయికి చేరింది.
అమితాబ్ బచ్చన్‍తో రామ్ గోపాల్ వర్మ చేసిన సర్కార్ (2005) ఓ సంచలనమే. అప్పటి వరకు అలాంటి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇండియన్ సినిమాలో రాలేదు. ఈ చిత్రంలోని పొలిటికల్ డ్రామా, పవర్ కోసం జరిగే మోసాలు, క్రైమ్ అదిరిపోయాయి. సుభాష్ నగ్రే అలియాజ్ సర్కార్ పాత్రలో అమితాబ్ యాక్టింగ్ పవర్‌ఫుల్ యాక్టింగ్, ఆర్జీవీ టేకింగ్ వారెవా అనిపించాయి. ఈ చిత్రంలో అన్ని థీమ్స్ ఆసక్తికరంగా చూపించారు ఆర్జీవీ. ఈ సినిమాలోనూ నరేషన్, సీన్ సెట్టింగ్స్, స్టేజింగ్, స్క్రీన్‍ప్లే అన్నీ అప్పటికి కొత్తదనంతోనే ఉంటాయి. ఈ మూవీ అల్టిమేట్ క్లాసిక్‍గా నిలిచింది. భారతీయ సినిమాలో గాడ్‍ఫాదర్ అని సర్కార్‌ను పరిగణిస్తారు సినీ జనాలు.
సర్కార్ తర్వాత ఆర్జీవీకి మళ్లీ అలాంటి సక్సెస్ దక్కలేదు. వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. 2006లో మోహిత్ అహ్లావత్‍తో ఆర్జీవీ హిందీలో చేసిన శివ రీమేక్ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత నిశ్శబ్ద్, ఆగ్, డార్లింగ్ పెద్దగా ఆడలేదు. అమితాబ్‍తోనే చేసిన సర్కార్ రాజ్ మోస్తరు హిట్ కొట్టింది. కానీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్‍లో ఆర్జీవీకి మరిన్ని ఎదురుదెబ్బలు ఎదురయ్యాయి.
సుమారు ఐదేళ్ల తర్వాత రక్తచరిత్ర (2010)తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. రాయలసీమ ఫ్యాక్షన్ చుట్టూ నిజజీవిత ఘటనలతో తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఆర్జీవీ మళ్లీ ట్రాక్‍లోకి వచ్చినట్టే కనిపించారు. రక్తచరిత్ర 2 కూడా పర్వాలేదనిపించింది. ఎన్ని బెదిరింపులు ఎదురైనా డేరింగ్, డ్యాషింగ్‍గా రక్త చరిత్రను తెరకెక్కించారు ఆర్జీవీ.
రక్తచరిత్ర తర్వాత రామ్ గోపాల్ వర్మకు మరో హిట్ దక్కలేదు. సత్య 2, సర్కార్ 3, కిల్లింగ్ వీరప్పన్, ఆఫీసర్ లాంటి చిత్రాలు విజయం సాధించలేకపోయాయి. అందులోనూ వివాదాస్పదమైన కొన్ని చిత్రాలు చేశారు ఆర్జీవీ. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, ఆమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ పొలిటికల్ చిత్రాలు చేశారు. ఇవన్నీ డిజాస్టర్ అయ్యాయి. టోటల్‍గా ట్రాక్ తప్పేశారు ఆర్జీవీ. మరికొన్ని కాంట్రావర్సీ చిత్రాలతోనూ ప్రయోగాలు చేశారు. చివరగా గతేడాది వ్యూహం అనే పొలిటికల్ మూవీ చేశారు ఆర్జీవీ.
రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ సరిగా శ్రద్ధ పెట్టి సినిమా తీస్తే బ్లాక్‍బస్టర్ కొడతారనే నమ్మకం ఆయన అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీలోనూ బలంగా ఉంది. దర్శకులు రాజమౌళి, పూరి జగన్నాథ్, సందీప్ రెడ్డి వంగా సహా చాలా మంది ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒకప్పుడు తన ఫిల్మ్ మేకింగ్ ఒరిజినాలిటీ, నరేషన్, కెమెరా యాంగిల్స్, రా యాక్షన్ సీన్లు, ఇంటెన్స్ డ్రామాతో మెప్పించిన ఆర్జీవీ.. మళ్లీ ఫామ్‍లోకి వస్తారని చాలా మంది సినీ అభిమానుల్లో ఇంకా ఈ ఆశ మిగిలే ఉంది. మరి ఆ దిశగా ఆర్జీవీ ఆలోచిస్తారేమో చూడాలి.
సంబంధిత కథనం