Pawan Kalyan: పేరు ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు - గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ కామెంట్స్
సినిమాలు తీసేవాళ్లే చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలని, సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్లు సినీ పరిశ్రమ గురించి మాట్లడవద్దని ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఇతర హీరోలను ద్వేషించమని అన్నయ్య చిరంజీవి మాకు ఎప్పుడూ చెప్పలేదని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఫలానా హీరో సినిమా పోవాలి అనే సంస్కృతి మా ఇంట్లో కనిపించదని తెలిపాడు. రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఏం, హీరో పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌తో పాటు శంకర్, దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...
సోషల్ మెసేజ్ విత్ ఎంటర్‌టైన్‌మెంట్...
నేను చాలా తక్కువ సినిమాలు థియేటర్‌కు వెళ్లి చూశాను. శంకర్ తీసిన జెంటిల్‌మెన్ సినిమాను చెన్నైలో బ్లాక్‌లో టికెట్ కొనుక్కొని థియేటర్‌లో చూశా. అప్పటికి నేను యాక్టర్ అవుతానని కూడా అనుకోలేదు. శంకర్ తీసిన ప్రేమికుడు సినిమా చూడటానికి ఎవరూ తోడు లేకపోతే మా అమ్మమ్మతో కలిసి సినిమా చూశా. అన్ని వయసుల వారికి ఆకట్టుకునే సినిమాలు చేస్తుంటారు శంకర్. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆయన సినిమాల్లో బలమైన సోషల్ మెసేజ్ ఉంటుంది.
తెలుగు సినిమాల మాదిరిగా...
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయిలో చాటిచెప్పిన దర్శకుల్లో శంకర్ ఒకరు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్ వైపు చూడటానికి కారకుల్లో శంకర్ ఒకరు. శంకర్ తమిళ డబ్బింగ్ సినిమాలను తెలుగు మూవీస్ మాదిరిగా తమ గుండెల్లో పెట్టుకొని టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించారు. డైరెక్ట్‌గా శంకర్ తెలుగు సినిమా చేస్తే బాగుండేదని నేను ఎప్పుడూ కోరుకునేవాణ్ణి. గేమ్ ఛేంజర్ సినిమా చేయడం ఆనందంగా ఉంది.
పేరు ఉంది కానీ డబ్బులు లేవు...
దిల్ రాజు నాతో వకీల్‌సాబ్ సినిమా చేశారు. వకీల్‌సాబ్ సినిమా చేసేటప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నా. నాకు పేరు ఉంది. కానీ నా దగ్గర డబ్బులు లేవు. మార్కెట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నాతో సినిమా చేశారు. వకీల్ సాబ్ సినిమాఈ రోజు జనసేన పార్టీ నడపటానికి ఇంధనంగా పనిచేస్తుంది. .
రామ్‌చరణ్ నాకు తమ్ముడు...
రామ్‌చరణ్ పుట్టినప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. మా ఇంటి దైవం హనుమంతుడి పేరు వచ్చేలా నాన్నగారు చరణ్‌కు పేరు పెట్టారు. చిరంజీవి నాకు పితృ సమానులు. వదిన నాకు తల్లితో సమానం. చరణ్‌ను నేను తమ్ముడిలా భావిస్తాను. చిన్నప్పుడు చరణ్‌ను బాగా ఏడిపించేవాడిని.రామ్‌చరణ్ చాలా క్రమశిక్షణతో పెరిగాడు. చరణ్ మంచి డ్యాన్సర్. కానీ మా ముందు డ్యాన్స్ చేయడం ఎప్పుడూ చూడలేదు. తనలో ఇంత ప్రతిభ, సమర్థత ఉందని మేము ఊహించలేదు.
బెస్ట్ యాక్టర్ అవార్డు...
రంగస్థలం సినిమాలో చరణ్ నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. గొప్పగా నటించాడు. భవిష్యత్తులో తప్పకుండా ఉత్తమ నటుడు అవార్డు వస్తుందనే నమ్మకముంది. చిరంజీవి తగ్గ వారసుడు చరణ్. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు.
ఊతం ఆశ్రయం...
చిరంజీవి ఒక్కడు పెరిగి మా అందరికి ఆశ్రయం, ఊతం ఇచ్చారు. ఈ రోజు నేను మారుమూలు ప్రాంతాలకు కూడా వెళ్లడానికి చిరంజీవి ఇచ్చిన ఊతమే కారణం. చిరంజీవి మా కోసం ఎంతో కష్టపడ్డారు. షూటింగ్‌లలో చిరంజీవి ఎన్నోసార్లు గాయపడ్డాడు. ఆయన కష్టం చూసి గిల్టీగా ఫీలయ్యేవాడిని. ఒక్కోసారి షూటింగ్ నుంచి వచ్చిన అన్నయ్య షూస్ విప్పి చూస్తే పాదాలు వాచిపోయి ఉండేవి. తండ్రి పడిన కష్టాన్ని చూసి పెరిగాడు చరణ్.
అందరూ బాగుండాలి...
ఓ హీరోను ద్వేషించమని మా అన్నయ్య ఎప్పుడూ మాకు చెప్పలేదు. ఈ హీరో సినిమా పోవాలి అనే సంస్కృతి మా ఇంట్లో కనిపించదు. అందరూ బాగుండాలని మేము కోరుకుంటాం. మేము బాగుండాలి...వాళ్లు బాగుండకూడదని ఎప్పుడు అనుకోము. రామ్‌చరణ్ కూడా అలాంటి వాతావరణంలోనే పెరిగాడు.సినిమా బడ్జెట్‌లు ఎక్కువైపోయాయి. గేమ్ ఛేంజర్ సినిమాను మూడేళ్లు తీశారు. ఈ సినిమాను ఎంకరేజ్ చేయడానికి గెస్ట్‌గా వచ్చాను. కానీ అభిమానులకు చిన్న దెబ్బ తగిలిన నా గుండెకు గాయమవుతుంది. అందుకే సినిమా ఫంక్షన్స్ చేసుకోవడానికి వెనుకాడుతాను. ఆనందం ఎప్పుడూ విషాదం కాకూడదు. హీరోను చూడటం కంటే అందరూ క్షేమంగా ఉండటమే నాకు ముఖ్యం.
సినిమాలు తీసేవాళ్లే...
సినిమాలు తీసేవాళ్లే చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్లు సినీ పరిశ్రమ గురించి మాట్లాడవొద్దు. సినిమా టికెట్ట కోసం హీరోలు రావాల్సిన అవసరం లేదు. నిర్మాతలు వచ్చిన మేము ఇచ్చేస్తాం. హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాల్సిన పనిలేదు. మేము అంత లో లెవల్ వ్యక్తులం కాదు అని గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ అన్నాడు