Game Changer: గేమ్ ఛేంజర్‌లో రామ్‍చరణ్ పాత్రకు స్ఫూర్తి ఆ డేరింగ్ ఆఫీసరే! 14వేల మంది అభ్యర్థులపై అనర్హత వేటు
Game Changer Movie: గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్ పాత్రను ఓ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్ఫూర్తితో మేకర్స్ తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. సినిమాలో ఈ క్యారెక్టర్.. ఆ అధికారి జీవితంలో జరిగిన విషయాల్లో చాలా పోలికలు ఉన్నాయి. ఆ డేరింగ్ ఆఫీసర్ ఎవరంటే..
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం హైప్ మధ్య రిలీజ్ అయింది. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం (జనవరి 10) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో ఐఏఎస్ రామ్‍నందన్, అప్పన్న పాత్రలను చెర్రీ చేశారు. తండ్రీకొడుకుల పాత్రలు పోషించారు. అయితే, భారత ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసిన ఓ డేరింగ్ దిగ్గజ ఆఫీసర్ స్ఫూర్తిగా రామ్‍నందన్ పాత్రను రాసుకున్నట్టు అర్థమైంది. ఈ పాత్రకు.. ఆ అధికారి నిజజీవితానికి చాలా పోలికలు ఉన్నాయి. ఆ వివరాలు ఇవే..
ఆ అధికారి జీవితం స్ఫూర్తితోనే!
గేమ్ ఛేంజర్ చిత్రంలో ఐపీఎస్‍గా ఉండే రామ్‍నందన్ (రామ్‍చరణ్).. ఆ తర్వాత ఐఏఎస్ అయి కలెక్టర్‌గా నియమితుడు అవుతాడు. శక్తివంతమైన రాజకీయ నాయకులను ఢీకొంటాడు. అనంతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అవుతాడు. భారత మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ జీవితంలో ఇలాంటివే జరిగాయి. తొలుత మధురై కలెక్టర్‌గా పని చేసిన టీఎన్ శేషన్.. ఆ తర్వాత ఏకంగా భారత ఎన్నికల సంఘానికి చీఫ్ కమిషనర్ స్థాయికి ఎదిగార. 1990ల్లో ఎన్నికల వ్యవస్థలో అనేక మార్పులు చేసి ప్రక్షాళన తీసుకొచ్చారు. ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలతో డేరింగ్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సంఘం పవర్ ఏంటో పూర్తిస్థాయిలో చాటిచెప్పారు. గేమ్ ఛేంజర్ మూవీలో కలెక్టర్‌గా ఉండే రామ్‍నందన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అవుతాడు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు.
ఎవరు టీఎన్ శేషన్?
1933లో తమిళనాడులో (అప్పట్లో మద్రాసు ప్రెసిడెన్సీ).. టీఎన్ శేషన్ జన్మించారు. ఆయన పూర్తి పేరు తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్. 1953లో మద్రాస్ పోలీస్ సర్వీసెస్‍లో ఉత్తీర్ణత సాధించినా.. అందులో జాయిన్ అవలేదు శేషన్. 1954లో యూపీఎస్‍సీ సివిల్స్ సర్వీసెస్ పరీక్ష క్లియర్ చేశారు. 1955లో తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా ట్రైనింగ్ పొందారు. చాలా జిల్లాలకు కలెక్టర్‌గా పని చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
14వేల మందిపై అనర్హత.. కఠిన నిబంధనలు
1990లో భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు టీఎన్ శేషన్. 1996 వరకు ఆ పదవిలో ఉన్నారు. సీఈసీగా ఆయన చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చారు. ఓటర్లకు డబ్బు, మద్యం పంచడం, ప్రచారం కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం, కులం, వర్గం ఫీలింగ్‍ను వాడుకోవడం లాంటి వాటిని కట్టడి చేసేందుకు కఠిన రూల్స్ ప్రవేశపెట్టారు. ప్రచారం కోసం ముందస్తుగా తీసుకోవాల్సిన అనుమతులను ఫిక్స్ చేశారు. కొన్ని కారణాలతో ఏకంగా 1992లో బిహార్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలనే రద్దు చేసేశారు శేషన్. తన పదవీ కాలంలో సమాచారం తప్పుగా ఇచ్చిన సుమారు 14వేల మంది అభ్యర్థులపై అనర్హత వేటు విధించారు శేషన్. ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చినందుకు గాను 1996లో రామన్ మెగససే అవార్డును ఆయన పొందారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని నిక్కచ్చిగా అమలు చేసి.. పవర్ చూపిన డేరింగ్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు శేషన్.
గేమ్ ఛేంజర్ చిత్రంలోనూ రామ్‍నందన్.. ముందు కలెక్టర్ అవుతాడు. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయి ఎన్నికల తీరు మార్చేందుకు కృషి చేస్తాడు. టీఎన్ శేషన్ జీవితాన్ని ఈ పాత్రకు స్ఫూర్తిగా తీసుకున్నట్టు అర్థమవుతోంది. అయితే, డైరెక్టర్ శంకర్ ఈ విషయంపై ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. అయితే, ఓ మధురై కలెక్టర్ స్ఫూర్తితో రామ్‍చరణ్ పాత్ర ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీలో విలన్‍గా చేసిన ఎస్‍జే సూర్య చెప్పారు.
సంబంధిత కథనం