Peddi Ram Charan Look: ఈ పెద్ది అచ్చూ పుష్ప లాగే ఉన్నాడే: రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌ఫై ఫ్యాన్స్ రియాక్షన్ వైరల్
Peddi Ram Charan Look: ఈ పెద్ది అచ్చూ పుష్పలాగే ఉన్నాడే అని అంటున్నారు సోషల్ మీడియాలో అభిమానులు. రామ్ చరణ్ 16వ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టడంతోపాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలుసు కదా. అభిమానులకు చరణ్ బర్త్ డే గిఫ్ట్ ఇది.
Peddi Ram Charan Look: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 40వ పుట్టిన రోజు అయిన గురువారం (మార్చి 27) అభిమానులకు ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన 16వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టడం, ఫస్ట్ లుక్ లో చరణ్ అచ్చూ పుష్పలో అల్లు అర్జున్ లాగే ఉండటంతో అభిమానులు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు.
పెద్దిలో చరణ్.. పుష్పలో అల్లు అర్జున్
రామ్ చరణ్ తన గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత 16వ సినిమాలో బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఈ పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ ఆర్సీ16గా పిలిచిన ఈ మూవీ టైటిల్ ను గురువారం (మార్చి 27) రిలీజ్ చేశారు. రంగస్థలం మూవీ తర్వాత రామ్ చరణ్ మరోసారి రస్టిక్, రగ్గ్‌డ్ లుక్ లో కనిపిస్తున్న సినిమా ఇదే. అయితే అతని లుక్ అచ్చూ పుష్పలో అల్లు అర్జున్ లాగే ఉండటం అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఒకదాంట్లో అతడు అచ్చూ పుష్పలో అల్లు అర్జున్ లాగా.. మరోదాంట్లో కేజీఎఫ్ ఛాప్టర్ 1లో యశ్ లాగా కనిపిస్తున్నాడు. నాకు ఒక్కడికేనా మీకు కూడా పుష్ప, కేజీఎఫ్ ఛాప్టర్ 1 పోస్టర్లు గుర్తుకు వచ్చాయా అంటూ ఓ అభిమాని ట్వీట్ చేయడం విశేషం. పుష్ప వైబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయని మరో ఫ్యాన్ రాశాడు.
బావ, బావమరిది సేమ్ సేమ్
ఇక మరికొందరైతే బావ, బావమరిది సేమ్ సేమ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఓ అభిమాని అయితే పెద్ది, పుష్ప పోస్టర్లలోని రామ్ చరణ్, అల్లు అర్జున్ ముఖాలను సగంసగం చేసి పెట్టడం విశేషం. ఇందులో ఇద్దరూ దాదాపు ఒకేలా కనిపిస్తున్నారు.
పుష్పలాగే పెద్దిలోనూ రామ్ చరణ్ అదే ఇంటెన్సిటీతో కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పెద్ది సినిమాను కూడా సుకుమార్ రైటింగ్స్ నిర్మాతల్లో ఒకరిగా ఉండటం వల్లే ఇద్దరి లుక్స్ దాదాపు ఒకేలా ఉన్నాయని మరో అభిమాని గుర్తు చేశాడు.
పుష్ప లుక్కే కాపీ కదా..
అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ వాదన మరోలా ఉంది. పుష్ప కంటే ముందే రామ్ చరణ్ రంగస్థలం మూవీలో ఈ రస్టిక్ లుక్ లో కనిపించాడని, పుష్పలో అల్లు అర్జున్ లుక్ దాని నుంచి వచ్చిందే అని చరణ్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. చిట్టి బాబు (రంగస్థలంలో చరణ్ పాత్ర పేరు) నుంచే పుష్ప లుక్ వచ్చింది కదా అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
సుకుమార్ కు అసిస్టెంట్, నేషనల్ అవార్డు విన్నర్ అయిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ పెద్ది మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తుండగా.. వెంకట సతీష్ కిలారు మూవీని నిర్మిస్తున్నాడు. ఈ పెద్ది మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. వీళ్లే కాకుండా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
సంబంధిత కథనం