Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో మెగా పవర్ స్టార్
Ram Charan: రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో మెగా పవర్ స్టార్ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.
Ram Charan: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ప్రతిష్టాత్మక అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్ లో సభ్యుడయ్యాడు. గురువారం (నవంబర్ 2) ఈ విషయాన్ని అకాడెమీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది టాలెంటెడ్ నటీనటులు ఇప్పటికే ఇందులో ఉన్నారు.
టాలీవుడ్ నుంచి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఈ అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్ లో ఉన్నాడు. కొన్ని వారాల కిందటే తారక్ కు ఇందులో చోటు దక్కింది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా చేరడం విశేషం. తాజాగా ఇందులో చరణ్ తోపాటు లాషానా లించ్, లూయిస్ కూ టిన్ లోక్ లాంటి వాళ్లు కూడా చేరారు. తారక్, చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీకి హాలీవుడ్ లో ఎన్నో ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే.
యాక్టర్స్ బ్రాంచ్ లో కొత్త నటీనటులను పేర్లను అనౌన్స్ చేసిన సందర్భంగా వాళ్లకు సంబంధించిన చిన్న వీడియోలను ది అకాడెమీ తన ఇన్‌స్టా పోస్ట్ లో షేర్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీలో సీతారామ రాజు వేషంలో చరణ్ ఉన్న వీడియోను అకాడెమీ పోస్ట్ చేయడం విశేషం. చరణ్ తోపాటు మరో ఏడుగురికి తాజాగా యాక్టర్స్ బ్రాంచ్ లో చోటు దక్కింది.
అక్టోబర్ 18న యాక్టర్స్ బ్రాంచ్ లోకి కొత్త సభ్యులను అకాడెమీ ఆహ్వానించిన సమయంలో ఆ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. అప్పుడే చరణ్ కూడా చోటు దక్కాల్సిందని అతని అభిమానులు అన్నారు. మొత్తానికి రెండు వారాల వ్యవధిలోనే చెర్రీ కూడా అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్ లోకి వచ్చేశాడు. ఈ ఇద్దరూ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ హాలీవుడ్ లోని ఎందరికో నచ్చగా.. ఇందులో నాటునాటు పాటకు ఆస్కార్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.
చరణ్ ఫ్యాన్స్ ఖుష్
అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్ లో రామ్ చరణ్ కు చోటు దక్కిన ఆనందంలో అతని ఫ్యాన్స్ ఉన్నారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచీ వాళ్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్.. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి కోసం ఇటలీ వెళ్లిన విషయం తెలిసిందే.