Game Changer on TV: టీవీలోకి వచ్చేసిన గేమ్ ఛేంజర్.. ఫ్యాన్స్ షాక్.. తీవ్రంగా స్పందించిన ప్రొడ్యూసర్
Game Changer on TV: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ పైరేటెడ్ వెర్షన్ అప్పుడే ఓ టీవీ ఛానెల్లోకి రావడం అభిమానులను, మూవీ టీమ్ ను షాక్ కు గురి చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగైదు రోజుల్లోనే ఇలా జరగడంతో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ తీవ్రంగా స్పందించాడు.
Game Changer on TV: గేమ్ ఛేంజర్ మూవీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ సినిమాకు తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు రావడంతోపాటు పైరసీ పెద్ద సమస్యగా మారింది. తాజాగా ఈ మూవీ పైరేటెడ్ వెర్షన్ ఏకంగా ఓ లోకల్ టీవీ ఛానెల్లో టెలికాస్ట్ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ తీవ్రంగా స్పందిస్తూ ట్వీట్ చేశాడు.
టీవీలో గేమ్ ఛేంజర్
గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో రిలీజైన విషయం తెలుసు కదా. అయితే ఈ సినిమా అసలు అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర కూడా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ఇది చాలదన్నట్లు మూవీకి పైరసీ పెద్ద సవాలుగా మారింది.
ఆన్‌లైన్లో లీకవడం కాదు కదా.. ఈసారి ఏకంగా ఓ లోకల్ టీవీ ఛానెలే మూవీని టెలికాస్ట్ చేయడం షాక్ కు గురి చేస్తోంది. ఏపీ లోకల్ టీవీ అనే ఛానెల్లో మూవీ హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్ టెలికాస్ట్ అయింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఆన్‌లైన్లో వైరల్ అయ్యాయి. దీనిపై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ ట్వీట్ చేశాడు.
కఠిన చర్యలు తీసుకోవాలి
"ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నాలుగైదు రోజుల కిందట థియేటర్లలో రిలీజైన సినిమాను లోకల్ కేబుల్ ఛానెల్స్, బస్సుల్లో టెలికాస్ట్ చేయడం చాలా ఆందోళనకర పరిణామం. సినిమా అంటే కేవలం హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు చెందినది కాదు. ఇది ఎన్నో వేల మంది మూడు, నాలుగేళ్ల శ్రమ, అంకితభావం, కలలకు చెందినది.
ఈ సినిమాల సక్సెస్ పై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల జీవితాల గురించి ఆలోచించండి. ఇలాంటివి వాళ్లకు కీడు చేస్తాయి. భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీని ప్రశ్నార్థకం చేస్తాయి. ఇప్పటికైనా ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. సినిమాకు మంచి భవిష్యత్తు కోసం అందరం కలిసి గళమెత్తాల్సిన అవసరం ఉంది" అని అతడు అన్నాడు.
గత శుక్రవారం (జనవరి 10) గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీకి పెద్దగా పాజిటివ్ రివ్యూలు రాలేదు. అయితే తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఇండియాలో ఇప్పటి వరకూ రూ.100 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. అయితే మూవీ థియేటర్లలో రిలీజైన తొలి రోజే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్లో లీకైంది. దీనిపై ప్రొడ్యూసర్ దిల్ రాజు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. కానీ ఇప్పుడు ఏకంగా టీవీ ఛానెల్లోనూ టెలికాస్ట్ చేయడం షాక్ కు గురి చేస్తోంది.