Ram Charan furious: డైరెక్టర్ శంకర్‌పై రామ్ చరణ్ అసంతృప్తితో ఉన్నాడా? గేమ్ ఛేంజర్ సంగతేమైంది?
Ram Charan furious: డైరెక్టర్ శంకర్‌పై రామ్ చరణ్ అసంతృప్తితో ఉన్నాడా? గేమ్ ఛేంజర్ ఎంతకీ ముందుకు సాగకపోవడంతో చెర్రీ నిరాశగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Ram Charan furious: రామ్ చరణ్ అసలు ఎక్కడున్నాడు? అతని నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి? ఇంతకీ డైరెక్టర్ శంకర్ ఏం చేస్తున్నాడు? చెర్రీ అభిమానుల మదిలో ప్రస్తుతం మెదులుతున్న ప్రశ్నలు ఇవే. గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ నెలలుగా సా...గుతూనే ఉంది. ఈ ప్రాజెక్ట్ మొదలై ఏకంగా రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ 40 రోజుల షూటింగ్ పెండింగ్ లోనే ఉంది.
దీంతో డైరెక్టర్ శంకర్ పై రామ్ చరణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియన్ సినిమా మెచ్చే ఎన్నో గొప్ప సినిమాలు అందించిన శంకర్ తో సినిమా అంటే మొదట్లో చరణ్ ఎంతో ఉత్సాహం చూపాడు. కానీ మెల్లగా అది కాస్త నీరుగారిపోతోంది. గేమ్ ఛేంజర్ అడుగు ఎంతకీ ముందుకు పడటం లేదు. ఒకే సమయంలో అటు కమల్ హాసన్ తో ఇండియన్ 2 కూడా చేస్తున్న శంకర్.. తన దృష్టి మొత్తం ఆ సినిమాపైనే ఉంచినట్లు కనిపిస్తోంది.
రామ్ చరణ్ అసంతృప్తి?
ఓవైపు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్, మరోవైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2.. రెండు భారీ ప్రాజెక్టులే. ఒకేసారి రెండు పడవలపై కాళ్లు పెట్టాడు డైరెక్టర్ శంకర్. అయితే క్రమంగా గేమ్ ఛేంజర్ పై ఉన్న అడుగు తీసి అది కూడా ఇండియన్ 2పైనే పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఇదే రామ్ చరణ్ అసంతృప్తికి కారణమైనట్లు అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే సంక్రాంతి టార్గెట్ ఇప్పటికే మిస్ అయింది. ఇక సమ్మర్ హాలిడేస్ కు మూవీని తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా షూటింగ్ మొత్తం త్వరగా పూర్తయితేనే సాధ్యమవుతుంది. "ఇప్పుడు రామ్ చరణ్ సమ్మర్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతి టార్గెట్ మిస్ అవడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశ చెందారనడంలో సందేహం లేదు. షూటింగ్ లో తరచూ ఆలస్యం జరుగుతుండటం దీనికి కారణం" అని చెర్రీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
చరణ్ మిగతా ప్రాజెక్ట్‌ల సంగతేంటి?
ఇండియన్ 2 కారణంగా శంకర్ తరచూ గేమ్ ఛేంజర్ షూటింగ్ ను పెండింగ్ లో పెడుతూ వస్తున్నాడు. కొన్నాళ్లుగా రామ్ చరణ్ గాయపడటంతో షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమా షూటింగ్ ముందుకు సాగకపోవడంతో మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ చెర్రీ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబుతో మూవీ పెండింగ్ లో పడిపోయింది.
ఇది కూడా చరణ్ అసంతృప్తికి కారణమవుతోంది. నిజానికి నెలలో చెరో 15 రోజులు గేమ్ ఛేంజర్, ఇండియన్ 2కు ఇవ్వాలన్నది శంకర్ ప్లాన్. కానీ అది కాస్త పూర్తిగా ఇండియన్ 2వైపే మళ్లినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కమల్ హాసన్ గతేడాది విక్రమ్ తో సూపర్ డూపర్ హిట్ అందుకోవడంతో ఇండియన్ 2ను త్వరగా పూర్తి చేయాలని శంకర్ చూస్తున్నాడు.
మూవీ వర్గాల ప్రకారం.. ఇప్పటికే గేమ్ ఛేంజర్ 40 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఇప్పటికే రూ.90 కోట్ల భారీ బడ్జెట్ తో పాటల చిత్రీకరణ పూర్తయింది. మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి కనీసం సమ్మర్ లో అయినా రిలీజ్ చేయాలని చెర్రీ ఆశిస్తున్నాడు. ఈ సినిమా హిట్టయితే తన రెండేళ్ల శ్రమ, ఎదురు చూపులు ఫలిస్తాయన్న ఆశతో చరణ్ ఉన్నాడు.