Ram Charan: ఆత్మహత్య చేసుకుంటానంటూ రామ్‍చరణ్ అభిమాని బెదిరింపు.. డెడ్‍లైన్ కూడా..
Ram Charan Fan: ఆత్మహత్య చేసుకుంటానంటూ రామ్‍చరణ్ అభిమాని ఒకరు ఓ లెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ కావాలని వేడుకున్నారు. చస్తే ఆత్మలా చూస్తానంటూ ట్వీట్ చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం కోసం ఆయన అభిమానులు ఏంతగానో ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో చాలా కాలం ఎలాంటి అప్‍డేట్లు రాకపోవటంతో ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 10వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రమోషన్లు కూడా షురూ అయ్యాయి. ట్రైలర్ గురించి అఫీషియల్ అప్‍డేట్ రాకపోవడంతో కొందరు అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. అయితే, ఓ అభిమాని మాత్రం ఏకంగా తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగారు. ఆ వివరాలివే..
ట్రైలర్ ఇవ్వకపోతే ఆత్మహత్య
గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ అప్‍డేట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఈశ్వర్ అనే రామ్‍చరణ్ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈశ్వర్ డీహెచ్‍ఎఫ్‍సీ అనే హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు. గేమ్ ఛేంజర్ మేకర్స్‌ను ఉద్దేశిస్తూ రిప్ లెటర్ అంటూ రాసుకొచ్చారు.
ఈనెల ఆఖరు కల్లా గేమ్ ఛేంజర్ ట్రైలర్ అప్‍డేట్ ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆ అభిమాని తన లేఖలో పేర్కొన్నారు. “ఈశ్వర్.. చరణ్ అన్న ఫ్యాన్ చింతిస్తూ రాయునది ఏమనగా.. సినిమాకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీరు ట్రైలర్ అప్‍డేట్ ఇవ్వట్లేదు. కనీసం అభిమానులను పట్టించుకోవడం లేదు. ఈ నెలాఖరు కల్లా మీరు ట్రైలర్ అప్‍డేట్ ఇవ్వకపోతే.. న్యూఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేసుకుంటున్నా” అని ఆ అభిమాని రాసుకొచ్చారు. చరణ్ అన్న భక్తులు ఈశ్వర్ అని రాశారు.
చస్తే ఆత్మలా చూస్తా
న్యూఇయర్ కల్లా గేమ్ ఛేంజర్ ట్రైలర్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఆ ఫ్యాన్.. చస్తే ఆత్మలా చూస్తానని లెటర్ పోస్ట్ చేశారు. “బతికి ఉంటే అందరితో చూస్తా. చస్తే ఆత్మలా చూస్తా. ఇదంతా నీ చేతుల్లోనే ఉంది. జై చరణ్” అంటూ గేమ్ ఛేంజర్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‍కు ట్యాగ్ చేశారు.
ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ట్రైలర్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అనడం ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పిచ్చి పనులు చేసి హీరోలకు చెడ్డ పేరు తీసుకురావొద్దని కొందరు అంటున్నారు. కొంప ముంచొద్దు అంటూ సూచిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అతిపెద్ద కటౌట్, పెద్ద ఈవెంట్లతో ఇంత ప్రమోషన్లు చేస్తుంటే ఇంకేంటి అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 30న వస్తుందనే రూమర్లు వస్తున్నాయి. అయితే, మూవీ టీమ్ ఇప్పటి వరకు అప్‍డేట్ ఇవ్వలేదు. ఇటీవలే డల్లాస్‍లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఓ భారీ ఈవెంట్‍కు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. రికార్డుస్థాయిలో అతిపెద్ద రామ్‍చరణ్ కటౌట్.. విజయవాడలో ఏర్పాటు కానుంది. దీన్ని కూడా ఓ ఈవెంట్‍గా డిసెంబర్ 29న జరగనుంది.
గేమ్ ఛేంజర్ సినిమా పొలిటికల్ యాక్షన్ మూవీగా శంకర్ తెరకెక్కించారు. రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా చేశారు. ఈ మూవీని దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. జనవరి 10న తెలుగుతో పాటు తమిళం, హిందీలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్ ఈ మూవీలో కీలకపాత్రలు చేశారు.
సంబంధిత కథనం