Rakul Preet Singh Wedding: గోవాలో రకుల్ ప్రీత్ పెళ్లి.. మోదీ చెప్పినందుకేనా?
Rakul Preet Singh Wedding: టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానీని ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. అయితే ఆమె డెస్టినేష్ వెడ్డింగ్ కాస్తా గోవాలో జరగడానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Rakul Preet Singh Wedding: నటి రకుల్ ప్రీత్ సింగ్, నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్ల పెళ్లి ఫిబ్రవరి 22న గోవాలో జరగనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. పింక్విల్లా రిపోర్టు ప్రకారం, ఈ జంట మొదట విదేశాల్లో వివాహం చేసుకోవాలని అనుకున్నారు.

కానీ చివరి నిమిషంలో లొకేషన్ ను ఇండియాకు మార్చాలని నిర్ణయించడం విశేషం. అయితే దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ గతంలో సెలబ్రిటీలకు చేసిన సూచనే అని వార్తలు వస్తున్నాయి.
గోవాలో రకుల్ ప్రీత్ పెళ్లి
పింక్ విల్లా రిపోర్ట్ ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు మొదట మిడిల్ ఈస్ట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని తెలిసింది. దీనికోసం దాదాపు ఆరు నెలల పక్కా ప్లానింగ్ వేశారు. అప్పటి వరకూ అంతా సవ్యంగానే సాగింది. అయితే గతేడాది డిసెంబర్లో భారత ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వీళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది.
డబ్బున్న వాళ్లు, సెలబ్రిటీలు తన జీవితాల్లో ముఖ్యమైన ఈవెంట్లను ఇండియా వేదికగానే జరుపుకోవాలని మోదీ అప్పట్లో కోరారు. లక్షద్వీప్ వెళ్లి మోదీ చేసిన ఫొటోషూట్ తర్వాత మాల్దీవ్స్ మంత్రులు చేసిన కామెంట్స్, తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలు అక్కడి వెకేషన్లను రద్దు చేసుకోవడం తెలిసిందే.
ఇప్పుడు రకుల్, జాకీ భగ్నానీ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి.. పెళ్లిని గోవాకు షిఫ్ట్ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ లోనే వీళ్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు వాళ్ల సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
రకుల్ పెళ్లి వివరాలు..
ఈ నెల మొదట్లో.. ముంబైలో అయోధ్య రామమందిరాన్ని పోలిన రథంలో రకుల్, జాకీ భగ్నానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ టూర్ తర్వాత రకుల్, జాకీ తమ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. రకుల్ సంప్రదాయ ఆకుపచ్చ రంగు దుస్తుల్లో ఉండగా, జాకీ పసుపు రంగు కుర్తా పైజామా ధరించారు.
'రామమందిర రూపంలో ఉన్న ఈ రథంతో మంత్రముగ్ధులయ్యాను' అంటూ జాకీ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి హిందీ, సౌత్ సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు ఎంతో మంది హాజరుకానున్నారు. ఫిబ్రవరి 22న వీళ్ల పెళ్లి గోవాలో జరగబోతోంది.
34 ఏళ్ల రకుల్ ప్రీత్ సింగ్ 2011లో కెరటం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తర్వాత 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో పేరు సంపాదించింది. 2014 నుంచి 2017 వరకు లౌక్యం, కరెంటు తీగ, కిక్ 2, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, స్పైడర్ లాంటి సినిమాలతో తెలుగులో టాప్ హీరోలతో నటించింది.
రెండేళ్లుగా హిందీ ఇండస్ట్రీలో బిజీ అయింది. అటాక్, రన్ వే 34, ఛత్రీవాలీ, ఐ లవ్ యూలాంటి సినిమాలు చేసింది. కొన్నాళ్లుగా జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్.. మొత్తానికి అతన్ని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది.