Rajinikanth: తాను కండక్టర్‌గా పని చేసిన బస్ డిపోకు రజనీకాంత్
Rajinikanth: తాను కండక్టర్‌గా పని చేసిన బస్ డిపోకు వెళ్లాడు సూపర్ స్టార్ రజనీకాంత్. సినిమాల్లోకి రాక ముందు కర్ణాటకలో అతడు బస్ కండక్టర్ గా పని చేసిన విషయం తెలిసిందే.
Rajinikanth: సిల్వర్ స్క్రీన్ పై సూపర్ స్టార్ అయినా బయట మాత్రం అత్యంత సాధారణ వ్యక్తిలాగానే ఉంటాడు రజనీకాంత్. సినిమాల్లో తప్ప బయట ముఖానికి అసలు మేకప్ వేయడు. చాలా సాదాసీదాగా కనిపిస్తాడు. అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిస్తాడు. తాజాగా మరోసారి అదే పని చేశాడు. తాను ఒకప్పుడు బస్ కండక్టర్ గా పని చేసిన డిపోకు వెళ్లాడు.

అయితే అంతకుముందు అతడు కర్ణాటకలో బస్ కండక్టర్ గా పని చేశాడన్న విషయం తెలుసు కదా. సుమారు 50 ఏళ్ల కిందట తాను కండక్టర్ గా పని చేసిన ఆ డిపోకు ఈ మధ్యే రజనీ వెళ్లి అక్కడి వాళ్లను ఆశ్చర్యానికి గురి చేశాడు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డిపోకు వెళ్లిన రజనీ.. అక్కడి డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందితో ఫొటోలు దిగాడు.
సూపర్ స్టార్ వచ్చాడన్న విషయం తెలుసుకొని అక్కడికి అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు. వాళ్లతోనూ రజనీ సెల్ఫీలు దిగడం విశేషం. అప్పట్లో బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ గా ఉన్న ఈ డిపోలో రజనీ బస్ 10ఎలో కండక్టర్ గా పని చేసేవాడు. బస్ లో టికెట్లు ఇచ్చే తీరుతోపాటు తన స్టైల్స్ తో ప్రయాణికులను ఆకట్టుకునేవాడు.
నిజానికి ఆ బస్సు నడిపే డ్రైవర్ రాజ్ బహదూర్ ప్రోత్సాహంతోనే రజనీ సినిమాల వైపు చూశాడు. మళ్లీ ఇన్నేళ్లకు అదే డిపోకు రజనీ రావడం అక్కడి వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు అతడు వస్తున్నట్లు అధికారులతోపాటు ఎవరికీ తెలియకపోవడం విశేషం. శివాజీ రావ్ గైక్వాడ్ గా కర్ణాటకలో జన్మించి.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును రజనీకాంత్ గా మార్చుకున్నాడు.