Rajinikanth on Kantara: కాంతారా ఓ మాస్టర్‌పీస్.. నాకు గూస్‌బంప్స్ తెప్పించింది: రజనీకాంత్
Rajinikanth on Kantara: కాంతారా ఓ మాస్టర్‌పీస్.. నాకు గూస్‌బంప్స్ తెప్పించింది అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ కొనియాడాడు. బుధవారం (అక్టోబర్ 26) ట్విటర్ ద్వారా అతడు రిషబ్ శెట్టికి కంగ్రాట్స్ చెప్పగా.. తన కల నిజమైందంటూ రిషబ్ రిప్లై ఇచ్చాడు.
Rajinikanth on Kantara: కాంతారా మూవీపై ప్రముఖల ప్రశంసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఈ మూవీ ఓ మాస్టర్‌పీస్ అని అనడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసిన ఈ కన్నడ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ ఇప్పటికే రూ.200 కోట్లకుపైగా రాబట్టిన విషయం తెలిసిందే.
ట్రెండింగ్ వార్తలు
ఈ సినిమాను చూసిన రజనీకాంత్ కూడా కాంతారాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బుధవారం (అక్టోబర్ 26) ట్విటర్ ద్వారా రజనీ స్పందించాడు. "తెలిసిన వాటి కంటే తెలియనవే ఎక్కువ.. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ కంటే మంచిగా ఎవరూ చెప్పలేరేమో. కాంతారా, నాకు గూస్‌బంప్స్ తెప్పించింది. ఓ రైటర్, డైరెక్టర్, యాక్టర్‌గా రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్. ఇండియన్ సినిమాలో మాస్టర్ పీస్ అయిన ఈ మూవీలో పని చేసిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు" అని రజనీకాంత్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ చూసి ఉబ్బితబ్బిబ్బయిన కాంతారా స్టార్ రిషబ్ శెట్టి వెంటనే రజనీకాంత్‌కు రిప్లై ఇచ్చాడు. తన కల నిజమైందని అతడు అన్నాడు. "డియర్ రజనీకాంత్ సర్, ఇండియాలో మీరు అతిపెద్ద సూపర్‌స్టార్. నా చిన్నతనం నుంచీ మీకు అభిమానిని. మీ ప్రశంస నా కల నిజమవడంలాంటిది. ఇలాంటి మరెన్నో స్థానిక కథలను తీసేలా మీరు నాలో స్ఫూర్తి నింపారు. థ్యాంక్యూ సర్" అని రిషబ్ శెట్టి ట్వీట్ చేశాడు.
ఇంతకుముందు తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఈ మూవీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. మైండ్ బ్లోయింగ్ మూవీ అని, కచ్చితంగా చూడాలని ధనుష్ ట్వీట్ చేశాడు. అంతకుముందు ప్రభాస్ కూడా కాంతారాను ఆకాశానికెత్తాడు. తాను కాంతారాను రెండోసారి చూశానని, క్లైమ్యాక్స్ అద్భుతమని, కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అని ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నాడు.
అటు రానా దగ్గుబాటి కూడా ఈ కాంతారా మూవీ గురించి కొన్ని రోజుల కింద ట్వీట్ చేశాడు. కాంతారా అత్యద్భుతమైన సినిమా అని అతడు అన్నాడు. కన్నడలో సెప్టెంబర్ 30న ఈ సినిమా రిలీజై సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో అక్టోబర్ 14న హిందీలో, అక్టోబర్ 15న తెలుగు, తమిళంలలోనూ రిలీజ్ చేశారు. తెలుగులోనూ కాంతారా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.