Lal Salaam OTT: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి ర‌జ‌నీకాంత్ లాల్‌స‌లామ్ - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?-rajinikanth lal salaam ott release date kollywood sports action drama movie to premiere on sun nxt ott from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lal Salaam Ott: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి ర‌జ‌నీకాంత్ లాల్‌స‌లామ్ - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?

Lal Salaam OTT: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి ర‌జ‌నీకాంత్ లాల్‌స‌లామ్ - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Aug 24, 2024 09:43 AM IST

Lal Salaam OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడు నెల‌ల త‌ర్వాత ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సెప్టెంబ‌ర్‌లో ఈ మూవీ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు చెబుతోన్నారు. లాల్ స‌లామ్ మూవీకి ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.

లాల్ స‌లామ్  ఓటీటీ
లాల్ స‌లామ్ ఓటీటీ

Lal Salaam OTT: ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ మూవీ ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి రాబోతోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడు నెల‌ల త‌ర్వాత ఓటీటీ ఆడియెన్స్ ముందుకు ఈ మూవీ వ‌స్తోంది. లాల్‌స‌లామ్ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌తో పాటు స‌న్ నెక్స్ట్ ఓటీటీ సొంతం చేసుకున్నాయి. రిలీజ్ త‌ర్వాత సినిమా డిజాస్ట‌ర్ కావ‌డం, షూటింగ్‌ ఫుటేజీ మిస్స‌యిందంటూ డైరెక్ట‌ర్ ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వాయిదాప‌డుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

స‌న్ నెక్స్ట్ ఓటీటీలో...

స‌న్ నెక్స్ట్ ఓటీటీలో సెప్టెంబ‌ర్ 20 నుంచి లాల్ స‌లామ్ స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సెప్టెంబ‌ర్ సెకండ్ వీక్‌లో లాల్ స‌లామ్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం. కేవ‌లం స‌న్ నెక్స్ట్ ఓటీటీలో మాత్ర‌మే ఈ మూవీ రిలీజ్ అవుతోంద‌ని అంటున్నారు.

క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో...

క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా...విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టించారు. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో కేవ‌లం 30 కోట్లలోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి డిజాస్ట‌ర్‌గా నిలిచింది. నిర్మాత‌ల‌కు 70 కోట్ల‌కుపైనే న‌ష్టాల‌ను మిగిల్చింది.

సినిమా క‌థ బోరింగ్‌గా సాగ‌డం, ర‌జ‌నీకాంత్ పాత్ర‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌డంలో డైరెక్ట‌ర్ ఐశ్వ‌ర్య‌ విఫ‌లం కావ‌డంతో లాల్ స‌లామ్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ సినిమాలో తొలుత ర‌జ‌నీకాంత్ క్యారెక్ట‌ర్ ఐదు నుంచి ప‌ది నిమిషాల లోపే ఉండ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ క్రేజ్ కోసం అన‌వ‌స‌ర‌పు సీన్స్‌తో ర‌జ‌నీకాంత్‌ క్యారెక్ట‌ర్ లెంగ్త్ పెంచ‌డం కూడా సినిమా ప‌రాజ‌యానికి కార‌ణంగా నిలిచింది.

రిజ‌ల్ట్ మ‌రోలా ఉండేది...

ర‌జ‌నీకాంత్‌పై దాదాపు 21రోజుల పాటు తీసిన ఓ యాక్ష‌న్ ఎపిపోడ్‌తో పాటు కొన్ని కీల‌క‌మైన సీన్స్ తాలూకు హార్డ్ డిస్క్ మిస్స‌యిందంటూ, ఆ సీన్స్ ఉంటే సినిమా రిజ‌ల్ట్ మ‌రోలా ఉండేదంటూ రిలీజ్ త‌ర్వాత ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి.

లాల్ స‌లామ్ స్టోరీ ఇదే...

క‌సుమూరుకు చెందిన మొయుద్దీన్ (ర‌జ‌నీకాంత్‌) ఓ బిజినెస్‌మెన్‌. త‌న కొడుకు శంషుద్దీన్‌ను (విక్రాంత్‌) క్రికెట‌ర్‌గా చూడాల‌న్న‌ది మొయుద్దీన్ క‌ల‌. ఊళ్లో క్రికెట్ మ్యాచ్ లో జ‌రిగిన గొడ‌వ మ‌త‌క‌ల్లోలానికి దారితీస్తుంది. ఈ గొడ‌వ‌లో శంషుద్దీన్ చేయిని గురు (విష్ణు విశాల్‌) న‌రికేస్తాడు. అస‌లు గురు ఎవ‌రు? త‌న కొడుకుకు జ‌రిగిన అన్యాయంపై మెయిద్దీన్ ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు? ప్రాణ‌స్నేహితులుగా ఉన్న మొయిద్దీన్‌, గురు తండ్రి ఎందుకు శ‌త్రువులుగా మారారు అన్న‌దే లాల్ స‌లామ్ మూవీ క‌థ‌.

తొమ్మిదేళ్ల త‌ర్వాత‌...

లాల్ స‌లామ్ మూవీతో దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ డైరెక్ట‌ర్‌గా కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. లాల్ స‌లామ్ కంటే ముందు ధ‌నుష్ త్రీ , వాయ్ రాజా వాయ్ సినిమాల‌కు ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. లాల్‌స‌లామ్ మూవీలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి జీవిత ఓ కీల‌క పాత్ర చేసింది.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ వెట్టైయాన్‌తో పాటు స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో మ‌రో మూవీ చేయ‌బోతున్నాడు. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వెట్టైయాన్ మూవీ అక్టోబ‌ర్ 10న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, రానా, ఫ‌హాద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.