OTT: రజినీకాంత్ సినిమాకు ఏడాది పూర్తి.. ఇంకా ఓటీటీలోకి రాని చిత్రం-rajinikanth lal salaam completes on year but still no ott release for this flop sports drama movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: రజినీకాంత్ సినిమాకు ఏడాది పూర్తి.. ఇంకా ఓటీటీలోకి రాని చిత్రం

OTT: రజినీకాంత్ సినిమాకు ఏడాది పూర్తి.. ఇంకా ఓటీటీలోకి రాని చిత్రం

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 10, 2025 10:25 AM IST

Lal Salaam: రజినీకాంత్ హీరోగా నటించిన లాల్‍ సలామ్ చిత్రం థియేటర్లలో తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మూవీ రిలీజై ఏడాది పూర్తయింది. అయితే, ఈ చిత్రం ఇంకా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు మాత్రం రాలేదు.

Rajinikanth: రజినీకాంత్ సినిమాకు ఏడాది పూర్తి.. ఇంకా ఓటీటీలోకి రాని చిత్రం
Rajinikanth: రజినీకాంత్ సినిమాకు ఏడాది పూర్తి.. ఇంకా ఓటీటీలోకి రాని చిత్రం

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కీలకపాత్ర పోషించిన లాల్ సలామ్‍ సినిమా డిజాస్టర్ అయింది. తమిళ యంగ్ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ఈ స్పోర్ట్ డ్రామా మూవీలో లీడ్ రోల్స్ చేశారు. రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది 2024 ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగులోనూ వచ్చింది. లాల్ సలామ్‍ చిత్రం అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అయింది. ఈ మూవీకి రిలీజై ఇప్పటికి ఏడాది పూర్తయింది. అయితే, ఇంకా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు మాత్రం రాలేదు. ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

ఓటీటీపై రిలీజ్‍పై సందిగ్ధత

లాల్ సలామ్‍ సినిమా ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు దక్కించుకున్నాయని ముందుగా సమాచారం వెల్లడైంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అప్పుడు.. ఇప్పుడు అంటూ రూమర్లు చాలాసార్లు వచ్చాయి. మూవీ టీమ్ నుంచి కూడా హింట్స్ వచ్చాయి. అయితే, లాల్ సలామ్‍ మాత్రం ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాలేదు.

హార్డ్ డిస్క్ దొరికిందంటూ..

లాల్ సలామ్‍ సినిమా స్ట్రీమింగ్ ఆలస్యం అవుతుండడంపై కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఐశ్వర్య స్పందించారు. షూటింగ్ ఫుటేజ్ ఉన్న ఓ హార్డ్ డిస్క్ అప్పట్లో మిస్ అయిందని, ఆ సీన్లు ఉండి ఉంటే మూవీ మరో రకంగా ఉండేదని చెప్పారు. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ తమకు దొరికిందని, కొత్త వెర్షన్‍తో లాల్ సలామ్ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అన్నారు. అయితే, ఆ మాట చెప్పి నెలలు గడుతున్నా సినిమా మాత్రం ఓటీటీలోకి అడుగుపెట్టలేదు.

లాల్ సలామ్‍ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వస్తుందని కూడా ఐశ్వర్య అప్పుడు తెలిపారు. కొత్తగా యాడ్ చేసే సీన్లకు ఏఆర్ రహమాన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఆ తర్వాతి నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎలాంటి అప్‍డేట్లు రాలేదు. మూవీ టీమ్, ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ చిత్రంపై ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. దీంతో ఈ మూవీ అసలు ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తుందా.. లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.

లాల్ సలామ్ చిత్రం రూ.20కోట్ల లోపు కలెక్షన్లనే దక్కించుకొని కమర్షియల్‍గా డిజాస్టర్ అయింది. క్రికెట్‍తో పాటు మత కలహాల అంశంతో స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని తీసుకొచ్చారు ఐశ్వర్య. మోహిద్దీన్ భాయ్ పాత్ర పోషించారు. విష్ణు విశాల్, విక్రాంత్‍తో పాటు సెంథిల్, లివింగ్ స్టోన్, జీవిత రాజశేఖర్, కేఎస్ రవికుమార్, తంబి రామయ్య ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీకి.. ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు.

కాగా, లాల్ సలామ్ తర్వాత రజినీకాంత్ మూవీ వెట్టైయన్ గతేడాది అక్టోబర్‌లో రిలీజ్ అయింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. రజినీ ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో కింగ్ నాగార్జున కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. బ్లాక్‍బస్టర్ మూవీ జైలర్‌కు సీక్వెల్ కూడా రూపొందనుంది. నెల్సన్ దర్శకత్వం వహించే జైలర్ 2 అనౌన్స్‌మెంట్ వీడియో ఇటీవలే వచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం